కేటీఆర్ ఇప్ప‌ట్లో సీఎం కాన‌ట్టే! కొత్త ఫార్మాట్లో టీఆర్ఎస్ చీఫ్

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కేటీఆర్ కు స‌మీపం దూరంలోనే ఉంద‌ని ప్లీన‌రీలోని సంస్థాగ‌త రాజ్యాంగ మార్పుల‌ను బ‌ట్టి స్ప‌ష్టం అవుతోంది.

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 08:00 AM IST

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కేటీఆర్ కు స‌మీపం దూరంలోనే ఉంద‌ని ప్లీన‌రీలోని సంస్థాగ‌త రాజ్యాంగ మార్పుల‌ను బ‌ట్టి స్ప‌ష్టం అవుతోంది. పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేని ప్ర‌తి స‌మ‌యంలోనూ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఆటోమేటిక్ గా అధ్య‌క్షుడుగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. ఆ మేర‌కు టీఆర్ఎస్ సంస్థాగ‌త బైలాను మార్పు చేశారు. అంటే, కేసీఆర్ వార‌సుడిగా టీఆర్ఎస్ పార్టీని ఇక నుంచి కేటీఆర్ న‌డిపిస్తాడ‌న్న‌మాట‌. నిబంధ‌న మార్పుతో పార్టీ పగ్గాల‌ను కేటీఆర్ కు పూర్తి స్థాయిలో కేసీఆర్ అప్ప‌చెప్పేసిన‌ట్టే. ఇక కేటీఆర్ కు పార్టీ మీద ప‌ట్టు కోసం మ‌రో నిబంధ‌న కూడా పెట్టుకున్నారు. ఇక నుంచి పార్టీ అధ్య‌క్షుడే రాష్ట్ర‌, జిల్లా క‌మిటీల‌ను ఏర్పాటు చేసేలా సంస్థాగ‌త బైలాను మార్చేశారు. దీన్ని బ‌ట్టి కేటీఆర్ అనుచ‌ర‌గ‌ణం మాత్ర‌మే ఇక పార్టీలో కీల‌క ప‌ద‌వుల్లో ఉంటార‌ని స్ప‌ష్టం అవుతోంది. పార్టీ మీద పూర్తిస్థాయి ప‌ట్టుకోసం అవ‌న‌మైన మార్పును చాలా ముందు చూపుతో కేసీఆర్ సంస్థాగ‌త మార్పులు చేశాడు. స‌హ‌జంగా చురుగ్గా ఉండే కేటీఆర్ పార్టీలో అల్లుకుపోవ‌డమే కాకుండా రోజుల వ్య‌వ‌ధిలోనే త‌న టీంను ఏర్పాటు చేసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని మాత్రం కేసీఆర్ ఇప్ప‌ట్లో వ‌దిలి పెట్టేలా క‌నిపించ‌డంలేదు. ఎందుకంటే ప్లీన‌రీ స‌మావేశంలో 2028 గురించి మాట్లాడారు. గ‌తంలో చంద్ర‌బాబు విజ‌న్ 2020 ఆ త‌రువాత 2050 గురించి చెప్పాడు. అదే త‌ర‌హాలో ఇప్పుడు కేసీఆర్ 2028 నాటికి తెలంగాణ బడ్జెట్ 4.80ల‌క్ష‌ల కోట్లు అవుతుంద‌ని లెక్కించాడు. అంటే, అప్ప‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉంటాన‌ని కేసీఆర్ ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చేశాడు. మ‌రో రెండు ట‌ర్మ్ లు ఉండాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టు అర్థం అవుతోంది. ప్ర‌తి సారీ కాబోయే సీఎం కేటీఆర్ అంటూ వినిపించే నినాదాలు ఈసారి ప్లీన‌రీ లో పెద్ద‌గా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.


సాధార‌ణంగా కేసీఆర్ కు ధీటుగా కేటీఆర్ క‌టౌట్ల‌ను టీఆర్ ఎస్ స‌భ‌లు, స‌మావేశాల సంద‌ర్భంగా పెడుతుంటారు. ఈసారి అందుకుభిన్నంగా ప్లీన‌రీలో కేవ‌లం కేసీఆర్ క‌టౌట్లు మాత్ర‌మే క‌నిపించాయి. ఆ విష‌యాన్ని వీడియోలో రూపంలో సోష‌ల్ మీడియా వేదికగా బీజేపీ ఎంపీ అర‌వింద్ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కేటీఆర్ ను ఫోక‌స్ చేయ‌డానికి ఇష్టంలేక ఇలా జ‌రిగింద‌ని అర‌వింద్ ట్రోల్స్ చేయ‌డం టీఆర్ఎస్ వ‌ర్గాల్లోనూ అదే చ‌ర్చ జ‌రిగ‌డం ఈసారి ప్లీన‌రీలోని ప్ర‌త్యేక‌త‌.ఇటీవ‌ల టీఆర్ఎస్ పార్టీ ఎంతోకాలం ఉండ‌ద‌ని బీజేపీ చేసిన ప్ర‌చారానికి కేసీఆర్ చెక్ పెట్టేలా మాట్లాడారు. ఇప్ప‌టికే సుమారు 500 కోట్ల డిపాజిట్లు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి నెల‌కు 2కోట్ల వ‌డ్డీ వ‌స్తుంద‌ని చెప్పాడు. దానితో పార్టీని ఎంత కాల‌మైన నడ‌పొచ్చ‌ని చెప్ప‌డం వెనుక ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌ల‌కు తెర‌ద‌తింపే ప్ర‌య‌త్నం క‌నిపించింది. 60లక్ష‌ల‌కు పైగా స‌భ్యులున్న టీఆర్ఎస్ ను రాబోయే రోజుల్లో ఏపీలోని విస్త‌రించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని చెప్ప‌డం కేటీఆర్ పార్టీ బాధ్య‌త‌ల్లో త‌ల‌మున‌క‌ల‌య్యేలా చేసే ప్ర‌య‌త్నం ఉంది.

మొత్తం మీద కేటీఆర్ కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆశ ఇప్ప‌ట్లో నెర‌వేరే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. ఆ మ‌ధ్య ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో సీఎం గా ప్ర‌మాణంస్వీకారం తేదీని కూడా ఆయ‌న అభిమానులు ఫిక్స్ చేసుకున్నారు. ఆ సంద‌ర్భాల్లో కేసీఆర్ మీడియా ముందుకొచ్చి ఊహాగానాల‌కు శాశ్వ‌త తెర‌దింపే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. సో..రాజ‌కీయ వార‌సునిగా కేటీఆర్ కు టీఆర్ఎస్ చీఫ్ ప‌‌దోన్న‌తి క‌ల్పించిన కేసీఆర్ రాబోయే రోజుల్లో సీఎం ప‌ద‌విని ఎలాంటి ఫార్మాట్ లో త‌న‌యునికి అప్ప‌గిస్తారో..చూద్దాం.