CM KCR Mind Game : కేసీఆర్ ‘మైండ్ గేమ్’ అదుర్స్

ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ప‌రిష్కారం కోసం క‌న్వీన్స్ చేయ‌డం లేదా ఎదుటి వాళ్ల‌ను క‌న్ఫ్యూస్ చేయ‌డాన్ని స‌ర్వ‌సాధారణంగా రాజ‌కీయాల్లో ఎంచుకుంటారు.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 01:43 PM IST

ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ప‌రిష్కారం కోసం క‌న్వీన్స్ చేయ‌డం లేదా ఎదుటి వాళ్ల‌ను క‌న్ఫ్యూస్ చేయ‌డాన్ని స‌ర్వ‌సాధారణంగా రాజ‌కీయాల్లో ఎంచుకుంటారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అలాంటి ప్ర‌యోగాన్ని చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. హుజురాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కేసీఆర్ స‌ర్కార్ ను విప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా టార్గెట్ చేశాయి. ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంద‌ని నిరూపించ‌డానికి అనేక పోరాటాల‌ను విజ‌య‌వంతం చేశారు. అందుకే, ఇటీవ‌ల కేసీఆర్ నేరుగా మీడియా ముందుకొచ్చాడు. అంతేకాదు, త‌ర‌చూ తానే స్వ‌యంగా మీడియా ముందుకొచ్చి విప‌క్షాల సంగ‌తేంటో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. అధికారంలో ఉండి కూడా ధ‌ర్నాలు, ఆందోళ‌న‌కు దిగిన ప్రభుత్వం అధినేత‌గా కేసీఆర్ న్యూస్ మేక‌ర్ అయ్యాడు.హుజురాబాద్ ఎన్నిక‌ల విజ‌యం కోసం సాధ్యంకాని ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాడు. ఆ ప‌థ‌కం కింద ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి రూ. 10లక్ష‌లు ఇవ్వాలి. తెలంగాణ బ‌డ్జెట్ కు ఆయ‌న ప్ర‌క‌టించిన ద‌ళితబంధు ప‌థ‌కానికి ఏ మాత్రం స‌రితూగ‌దు. పైగా రైతు బంధు, రుణ‌మాఫీ, క‌ల్యాణ ల‌క్ష్మీ, సాదీముబార‌క్ త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాడు. రాబోవు ఎన్నిక‌ల నాటికి రైతుల‌కు ఫించ‌ను ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాల‌ని కూడా భావిస్తున్నాడు. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి గురించి నైస్ గా కేసీఆర్ త‌ప్పుకున్నాడు. ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి మూడెక‌రాలు ఇవ్వ‌డం ఎలా సాధ్య‌మంటూ ఆయ‌న ఎదురు ప్ర‌శ్నించాడు. ద‌ళితుల‌కు మూడెక‌రాలు ఇస్తాన‌ని తాను ఎక్క‌డ చెప్పానో..చూపించ‌డంటూ మీడియానే ప్ర‌శ్నించాడు.

అప్ప‌ట్లో ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇస్తాన‌న్న కేసీఆర్ హామీపై విప‌క్షాలు విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాయి. తాను చెప్ప‌లేద‌ని కేసీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఆ ప‌థ‌కం మాయం అయింది. ఇక ఇప్పుడు ద‌ళితబంధు ప‌థ‌కం అమ‌లు గురించి విప‌క్షాలు ప్ర‌తి వేదిక‌పైన నిల‌దీస్తున్నాయి. ఎప్ప‌టి నుంచి అమ‌లు చేస్తావంటూ నిగ్గ‌తీసే ప‌రిస్థితి వ‌చ్చింది. ద‌ళితుల‌తో క‌లిసి ఉద్య‌మాన్ని లేవ‌దీసే వాతావ‌ర‌ణం విప‌క్ష నేత‌లు తీసుకొచ్చారు. దాన్ని గ‌మ‌నించిన కేసీఆర్ ఇటీవ‌ల‌ వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని విప‌క్షాల కోర్టులోకి విసిరాడు. దాని చుట్టూ విప‌క్షాలు అనివార్యంగా తిర‌గాల్సి వ‌చ్చింది. నెల రోజుల పాటు బీజేపీ, కాంగ్రెస్ వ‌రి ధాన్యం కొనుగోలు అంశం చుట్టూ తిరిగేలా కేసీఆర్ చేశాడు. అందుకు, ప్ర‌తిగా ఆయ‌న కూడా క్షేత్ర‌స్థాయిలో దీక్ష‌కు దిగ‌డం ద్వారా మ‌రింత ర‌క్తిక‌ట్టించాడు.వ‌రి ధాన్యం పోరు కొంత స‌ర్దుమ‌ణ‌గిన వెంట‌నే మ‌ళ్లీ ద‌ళిత‌బంధు అంశాన్ని విప‌క్ష నేత‌లు మ‌ళ్లీ ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు. ఎప్ప‌టి నుంచి ద‌ళిత‌బంధు ఇస్తావో..చెప్పాల‌ని అడ‌గ‌డం ప్రారంభించారు. దీంతో ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించిన 317 జీవోల‌ను తీసుకొచ్చాడు. దాని చుట్టూ కాంగ్రెస్‌, బీజేపీ పోటీప‌డి నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌కు దిగాయి. ఉద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేసీఆర్ స‌ర్కార్ ను నిల‌దీయ‌డంలో నిమ‌గ్నం అయ్యాయి. మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ 317 జీవో కార‌ణంగా క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను చెబుతూ మ‌రింతగా విప‌క్షాల‌ను రెచ్చ‌గొట్టాడు. ఆ జీవోను వ్య‌తిరేకిస్తూ దాదాపు రెండు వారాల పాటు విప‌క్షాలు ఆందోళ‌న‌లు చేశాయి. ప్ర‌జ‌ల మైండ్ కూడా అటు డైవ‌ర్ట్ అయ్యేలా కేసీఆర్ చేయ‌గ‌లిగాడు.

 


ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు అనుమ‌తించ‌డంతో 317జీవోకు సంబంధించిన హ‌డావుడి స‌ద్దుమ‌ణిగింది. విప‌క్షాలు మ‌ళ్లీ ద‌ళిత‌బంధు, కాళేశ్వ‌రం అవినీతి అంటూ వాయిస్ వినిపిస్తున్నారు. హుజురాబాద్ లో ఇచ్చిన హామీని ఎందుకు అమ‌లు చేయ‌డంలేదంటూ గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్ట‌డం మొద‌లు పెట్టాయి. దీంతో కొత్త రాజ్యంగం అంటూ కేసీఆర్ మీడియా ముందుకొచ్చాడు. గ‌త రెండు రోజులుగా ఆ వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు భీందీక్ష చేశాడు. స‌మాంత‌రంగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు భీందీక్ష‌ను విజ‌య‌వంతం చేశాయి. అంబేద్క‌ర్ ను కించ‌ప‌రిచేలా కేసీఆర్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊరువాడ నిర‌స‌న‌ల‌కు దిగ‌డం చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌దీక్ష‌ల‌ను చేసింది. 48 గంట‌ల నిర‌స‌దీక్ష‌కు పీసీసీ చీఫ్ రేవంత్ కూర్చున్నాడు. ఫ‌లితంగా ద‌ళిత‌బంధు అమ‌లు డిమాండ్ ప‌క్క‌కు వెళ్లిపోవ‌డంతో పాటు కొత్త రాజ్యాంగం తెర‌మీద‌కు వ‌చ్చింది. హుజురాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా శ‌క్తికి మించిన ద‌ళిత‌బంధు హామీ ఇచ్చిన కేసీఆర్ దాని గురించి స‌రైన స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నాడు. వివిధ ప‌థ‌కాల అమ‌లు గురించి విప‌క్ష నేత‌లు నిల‌దీస్తున్నారు. ఆ ప‌థ‌కాల్లోని లోపాల‌పై ప్ర‌జ‌ల్ని ఆలోచింప‌ చేసేలా పోరాడుతున్నారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంద‌ని వివిధ మార్గాల ద్వారా కేసీఆర్ తెలుసుకున్నాడు. దీంతో ప‌లు స‌ర్వేల‌ను చేయించాడని తెలుస్తోంది. విప‌క్షాల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌న్వీన్స్ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నామ‌ని స‌ర్వేల ద్వారా కేసీఆర్ కు బోధ‌ప‌డిన‌ట్టు వినికిడి. దీంతో క‌న్ఫ్యూస్ చేసే మార్గాన్ని ఆయ‌న ఎంచుకున్న‌ట్టు రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలించే వాళ్లు భావిస్తున్నారు.
హుజురాబాద్ ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ వ‌రి ధాన్యం కొనుగోలు, చైనా-భార‌త్ బోర్డ‌ర్ వ‌ద్ద వైఫ‌ల్యం, భార‌త సైన్యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, 317 జీవో, తాజాగా కొత్త రాజ్యాంగం అంటూ వివాద‌స్ప‌ద, సంచ‌ల‌నం క‌లిగించే అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తున్నాడు. ఇదంతా విప‌క్షాల‌ను, ప్ర‌జ‌ల్ని క‌న్ఫ్యూస్ చేసేలా మైండ్ గేమ్ ఆడుతున్నాడ‌ని సీనియ‌ర్ పొలిటిషియ‌న్స్ అంచ‌నా. సో…హామీల‌ను అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితుల్లో ప్ర‌శ్నించే గొంతుల‌ను, ప్ర‌జ‌ల్ని కేసీఆర్ తిక‌మ‌క పెడుతున్నాడ‌న్న‌మాట‌.