Site icon HashtagU Telugu

TRS Plenary 2022 : ఎన్టీఆర్ కు ప్రేమ‌తో..ప్లీన‌రీ!

Kcr About Ntr In Trs Plenary

Kcr About Ntr In Trs Plenary

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసే ప్ర‌తి వ్యాఖ్య వెనుక రాజ‌కీయ వ్యూహం ఉంటుంది. ఆంధ్రా సెంటిమెంట్ ను ర‌గిలించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు న‌డిపిన ఆయ‌న అపరచాణ‌క్యం అంద‌రికీ తెలిసిందే. అలాంటి రాజ‌కీయ మేధావి టీఆర్ఎస్ ప్లీన‌రీలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స్మ‌ర‌ణ అందుకున్నారు. స్వ‌చ్ఛ‌మైన‌, నీతి, నిజాయితీతో కూడిన పాల‌న అందించే ల‌క్ష్యంగా ఎన్టీఆర్ ముందుకు క‌దిలార‌ని ప్ర‌శంసించారు. విశాల హృద‌యంతో ఎన్టీఆర్ చేసిన రాజ‌కీయాన్ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అంతేకాదు, ఆనాడు ఆయ‌న‌పై కాంగ్రెస్ చేసిన అరాచ‌కాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వ‌ద్ద యువ నాయ‌కునిగా ప‌నిచేసిన అనుభ‌వాన్ని ప్లీన‌రీ వేదిక‌గా కేసీఆర్ అవ‌లోక‌నం చేసుకున్నారు.

ఆంధ్రా పాల‌కుల‌పై ద‌శాబ్దం పాటు నిప్పులు చెరిగిన కేసీఆర్ కు హ‌ఠాత్తుగా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పై ప్రేమ పొంగుకొచ్చింది. ఏపీ వెనుక‌బాటుతనంపై ప్లీన‌రీ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాల‌ను సంధించిన ఆయ‌న స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కు శిష్యునిగా చెప్పుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం విచిత్రం. ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను ఉద్య‌మ స‌మ‌యంలో ధ్వంసం చేసిన సంఘ‌ట‌న‌లు అనేకం. ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ పెట్టించిన విగ్ర‌హాల‌ను కూల్చే ప్ర‌య‌త్నం చేసి, ఆంధ్రా ప్ర‌జ‌లు, పాల‌కుల‌పై కేసీఆర్ విషం చిమ్మారు. ఇప్పుడు ఆంధ్రా కాంట్రాక్ట‌ర్లు, ఆంధ్రా లీడ‌ర్ల‌పై అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది. తెలుగువాళ్ల‌కు ఐకాన్ గా ఉండే స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చ‌రిష్మాను కేసీఆర్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అంటే కేసీఆర్ కు నిజంగా అభిమానం ఉండేద‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. అందుకే, కుమారునికి తార‌క రామారావుగా నామ‌క‌ర‌ణం చేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాలకు తెలుసు. కానీ, ఉద్య‌మ నేప‌థ్యంలో ఆనాడు ఆంధ్రా పాల‌కులంద‌ర్నీ ద్వేషించేలా కేసీఆర్ మాట్లాడారు. అవ‌న్నీ ఉద్య‌మం వ‌ర‌కే ప‌రిమితమ‌ని ఇటీవ‌ల చెబుతున్నారు. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్ ను మ‌లిచిన త‌రువాత ఆంధ్రా ఓట‌ర్ల‌తోనే రెండోసారి అధికారంలోకి వ‌చ్చారు. వాళ్ల ఓట్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ప‌రువు నిలుపుకున్నారు. ఆ కోణం నుంచి రాజ‌కీయాన్ని అంచ‌నా వేస్తోన్న కేసీఆర్ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ను స్మ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఉత్త‌ర భార‌త దేశం ఓట‌ర్లు హైద‌రాబాద్ కేంద్రంగా పెరిగారు. వాళ్ల ఆధిప‌త్యం రియ‌ల్ ఎస్టేట్ , సాఫ్ట్ వేర్‌, త‌యారీ రంగంలోనూ కొన‌సాగుతోంది. నార్త్ ఓట‌ర్లు ఉన్న డివిజ‌న్ల‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. బీజేపీ అభ్య‌ర్థులు అక్క‌డ గెలిచారు. ఆంధ్రా సెటిల‌ర్ల ఓట్లు ఎక్కువ‌గా ఉన్న చోట టీఆర్ఎస్ గెలుపొందింది. ఏపీ వెనుక‌బాటు త‌నాన్ని వెక్కిరిస్తోన్న కేసీఆర్ కు ఈసారి ఆంధ్రా సెటిల‌ర్లు దూరంగా ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు, రెండో త‌ర‌గ‌తి పౌరుల మాదిరిగా ఉండాల్సి వ‌స్తుంద‌ని కేసీఆర్ పై క‌సి పెంచుకున్నార‌ని టాక్‌. అందుకే, వాళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పేరును ప్లీన‌రీ వేదిక‌గా వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ ప్ర‌స్తావించార‌ని టాక్‌.

ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌ల సామెత‌లాగా గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌పై గురిపెట్టిన కేసీఆర్ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పాల‌న‌, ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని ప్ర‌శ‌సించారు. ఇందిరా గాంధీ ఆదేశం మేర‌కు గ‌వ‌ర్న‌ర్ రామ్ లాల్ 1994లో ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుతుడ్ని చేసిన ఎపిసోడ్‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ఆ సంద‌ర్భంగా ఎన్టీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై వ్య‌వ‌హారాన్ని ప‌రోక్షంగా ప్లీన‌రీ వేదిక‌గా తూర్పురాబ‌ట్టారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆ రాష్ట్ర క్యాబినెట్ పంపిన 12 మంది ఎమ్మెల్సీ ల నియ‌మాకాన్ని పెండింగ్ లో ఉంచిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. త‌మిళ‌నాడులో ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని సైతం కాద‌ని అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును కోడ్ చేశారు. కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ప‌రిస్థితిని కూడా ప్ర‌స్తావిస్తూ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై రాజ్యాంగేత‌ర శ‌క్తిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న విష‌యాన్ని ఆమె పేరు ఎత్త‌కుండా ప‌రోక్షంగా దుయ్య‌బ‌ట్టారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ గ‌వర్న‌ర్ల వ్య‌వ‌స్థపై పోరాడి గెలిచిన తీరును మ‌రువ‌లేం అంటూ గుర్తు చేశారు. రాజ్యాంగేత‌ర శ‌క్తిగా వ్య‌వ‌హ‌రించిన ఆనాటి గ‌వ‌ర్న‌ర్ రామ్ లాల్ కు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ని ప‌రోక్షంగా త‌మిళ సై ను హెచ్చ‌రించారు. దీంతో అటు ఎన్టీఆర్ ప్ర‌స‌న్నం కార‌ణంగా సెటిల‌ర్ల ఓట్లు ఇటు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై పేరెత్త‌కుండానే ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని చెప్ప‌డం కేసీఆర్ చాణ‌క్యాన్ని చాటుతోంది.