Site icon HashtagU Telugu

CM KCR : `విభ‌జ‌న‌-స‌మైక్య‌త` న‌డుమ కేసీఆర్ హైడ్రామా

Cm Kcr

Cm Kcr

వినేవాళ్లు ఉంటే చెప్పే వాళ్లు ఏదైనా చెబుతుంటార‌ని నానుడి. స‌రిగ్గా దీన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ కు అన్వ‌యిస్తే కాద‌న‌లేం. ఎందుకంటే, ఒక‌ప్పుడు `విభ‌జ‌న`వాదాన్ని కేసీఆర్ బ‌లంగా వినిపించారు. ఆంధ్రోళ్ల దోపిడీ అంటూ విభ‌జ‌న‌వాదాన్ని ర‌క్తిక‌ట్టించారు. ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పాటు ఆంధ్రోళ్ల‌ను బూచిగా చూపించి విభ‌జ‌నవాదాన్ని విద్వేషంగా మార్చ‌డం ద్వారా ల‌క్ష్యాన్ని చేరుకున్నారు. ఆంధ్రోళ్ల‌ను చూపిస్తూ సెంటిమెంట్ రేకెత్తించ‌డం ద్వారా ఎనిమిదేళ్లుగా సీఎం కుర్చీని కాపాడుకుంటూ వ‌స్తున్నారు. రెండుసార్లు సీఎం కావ‌డానికి సెంటిమెంట్ బాగా ప‌నిచేసింది.

మూడోసారి సెంటిమెంట్ పనిచేయ‌ద‌ని కేసీఆర్ గ్ర‌హించార‌ట‌. అందుకే, ఆంధ్రోళ్లు ఒక‌ప్పుడు వినిపించిన `స‌మైక్య‌త‌` నినాదాన్ని కేసీఆర్ ఇప్పుడు అందిపుచ్చుకున్నారు. కులం, మ‌తం పేరుతో సమాజాన్ని బీజేపీ విభ‌జిస్తోంద‌ని, విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతుంద‌ని కేసీఆర్ గ‌గ్గోలు పెడుతున్నారు. ఆయ‌న ఉప‌యోగించిన విభ‌జ‌న `సెంటిమెంట్` అస్త్రాన్ని ఇప్పుడు బీజేపీ మ‌రోరూపంలో అందిపుచ్చుకుంది. ముల్లును ముల్లుతోనే తీయాల‌న్న‌ట్టు భావోద్వేగాల‌ను సానుకూలంగా మ‌లుచుకోవ‌డం ద్వారా రాజ్యాధికారం చేజిక్కించుకోవాల‌ని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

ప‌దిహేళ్ల పాటు తెలుగు రాష్ట్రాల్లో భావోద్వేగాల్ని రేప‌డం ద్వారా ప‌లు రకాలుగా కేసీఆర్ ల‌బ్ది పొందారు. ఆనాడు ప్రాంతాల మ‌ధ్య `విభ‌జ‌న` వాదాన్ని విద్వేషం దిశ‌గా కేసీఆర్ తీసుకెళ్లారు. ఇప్పుడు బీజేపీ మ‌తం కోణం నుంచి భావోద్వేగాల‌ను రెచ్చ‌గొడుతోంది. అందుకే, ఇప్పుడు కేసీఆర్ జాతీయ‌ `స‌మైక్య‌త‌` ఉత్స‌వాలు అంటూ స‌మైక్య‌తారాగం వినిపిస్తున్నారు. అధికారం వ‌చ్చే వ‌ర‌కు విభ‌జ‌న వాదం ఇప్పుడు దాన్ని కాపాడుకోవ‌డానికి స‌మైక్య‌తారాగాన్ని కేసీఆర్ అందుకున్నారు. మూడు రోజుల పాటు జాతీయ స‌మైక్య‌త ఉత్స‌వాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. వాటిని విజ‌య‌వంతం చేయ‌డానికి తెలంగాణ విద్యా, ప్ర‌భుత్వం సంస్థ‌ల‌కు మూడు రోజుల పాటు సెల‌వు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

సెప్టెంబ‌ర్ 17వ తేదీని విమోచ‌నం దినోత్స‌వం కింద కేంద్రం ప‌రిగ‌ణిస్తోంది. హైద‌రాబాద్ సంస్థానం స్వ‌తంత్ర్య భార‌తావ‌నిలో క‌లిసిన రోజు ఇది, అందుకే, నిజాం పాల‌న నుంచి విముక్తి, విమోచ‌నం ల‌భించిన‌ గుర్తుగా సెప్టెంబ‌ర్ 17వ తేదీని విమోజ‌న‌దినోత్స‌వంగా జ‌రుపుకోవాల‌ని `విభ‌జ‌న‌` వాదాన్ని వినిపించిన రోజుల్లో కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత విమోచ‌నదినోత్స‌వాన్ని జ‌రుపుకుందామ‌ని ఆనాడు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు త‌ద్విరుద్ధంగా స‌మైక్య‌త ను కోరుకుంటూ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో బ‌హిరంగ స‌భ‌, ర్యాలీను పెట్టారు. కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్ నాథ్ సింగ్ లు ముఖ్యఅతిథులుగా సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో విమోచ‌నదినోత్స‌వాన్ని బీజేపీ నిర్వ‌హిస్తోంది. పోటాపోటీగా విమోచ‌న‌, స‌మైక్య‌త నినాదాల‌తో హైద‌రాబాద్ కేంద్రంగా శ‌నివారం జ‌రుగుతోన్న స‌భ‌లు ఉత్కంఠ‌త‌ను క‌లిగిస్తున్నాయి. ఇదంతా బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య రాజ‌కీయ వార్ గా మారిపోయింది.