CM KCR:అప్పుడు హైదరాబాద్.. ఇప్పుడు ఢిల్లీ.. కేసీఆర్ పొలిటికల్ లెక్క అదేనా!

కేసీఆర్ ఏం చేసినా ఓ లెక్కుంటుంది! అందుకే గత ఎనిమిదేళ్లుగా ఆయన రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థుల అంచనాలకు మించి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వడ్ల ఎపిసోడ్‌ ను తెలంగాణ నుంచి ఢిల్లీకి మార్చారు.

  • Written By:
  • Publish Date - April 11, 2022 / 10:11 AM IST

కేసీఆర్ ఏం చేసినా ఓ లెక్కుంటుంది! అందుకే గత ఎనిమిదేళ్లుగా ఆయన రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థుల అంచనాలకు మించి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వడ్ల ఎపిసోడ్‌ ను తెలంగాణ నుంచి ఢిల్లీకి మార్చారు. అందులోనూ కేసీఆర్ స్వయంగా పాల్గొంటుండడంతో జాతీయస్థాయిలో దీనికి గుర్తింపు వస్తుంది. పైగా ఫ్లెక్సీలను కూడా హిందీ, ఇంగ్లిషీ భాషల్లో ఏర్పాటు చేశారు. అంటే ఢీల్లీవాసులతో పాటు దేశంలో అన్ని ప్రాంతాలవారికీ అర్థమయ్యేలా.. ఢిల్లీ పెద్దలకు ఆ విషయం ఘాటుగా చేరేలా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో దేశ రాజధానిలో టీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు మరోసారి కేంద్రంపై పోరుబాట పట్టింది. కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ దీక్షకు దిగారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో… రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష.. పేరుతో దీనిని ఏర్పాటుచేశారు.

తెలంగాణలోని వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం రాజకీయం చేస్తోందంటూ గతంలో హైదరాబాద్ లోనే కేసీఆర్ దీక్షకు దిగారు. అప్పుడు కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఢిల్లీలో అలాంటి నిరసనే చేపట్టారు. కానీ ఏకంగా దేశరాజధానిలోనే దీనిని ఏర్పాటు చేయడం వల్ల మోదీ ప్రభుత్వానికి ఆ సెగ తగులుతుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

రాజకీయంగా కేసీఆర్ ఏం చేసినా దానికో లెక్కుంటుంది. క్షేత్రస్థాయిలో బీజేపీతో వైరం ఉన్నా.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలను నెరిపేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఢిల్లీలోనే గులాబీజెండా రెపరెపలాడేలా చేయడంతో.. బీజేపీ అధిష్టానం దీనిని ఎలా తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ దీక్షతో రాజకీయంగా ప్రయోజనం చేకూరేది.. టీఆర్ఎస్ కా, బీజేపీకా అన్నది త్వరలో తేలనుంది.