Site icon HashtagU Telugu

TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీలో జాతీయ ఎజెండ..కేసీఆర్ వ్యూహం ఇదే..!!!

TRS Plenary

TRS Plenary

తెలంగాణ సీఎం కేసీఆర్ కేవలం ఒక ఉద్యమకారుడు మాత్రమే కాదు.. ఒక రాజకీయ చాణుక్యుడు కూడా. అధికారం నిలుపుకోవడం..చేజిక్కించుకోవడం కోసం అనేక వ్యూహాలకు పదును పెడుతుంటారు. ఏ అంశం అయినా ఓ పట్టాన పట్టుకోరు..! పట్టుకుంటే మాత్రం అస్సలు వదిలి పెట్టరు..! తన మాటలు ఎవరినీ క్షమించవు, ఎదురుదాడికి దిగితే ఇక దయాదాక్షిణ్యాలు అస్సలు ఉండవు. ఓ చేత్తో ఉద్యమం మరో చేత్తో రాజకీయ అడుగులతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్…ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకునేందుకు అడుగులు వేస్తున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అధినేత కేసీఆర్ ఈ సారి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల సహా 11 తీర్మానాలను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రవేశపెట్టనున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో రోజంతా జరిగే వేడుకల్లో పార్టీ భవిష్యత్ ప్రణాళికను, తెలంగాణ అభివృద్ధి నమూనాను, గత ఏడేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రదర్శించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం, ఉదయం 10.30 గంటలకు పార్టీ జెండాను ఎగురవేసి, స్వాగత ప్రసంగం, జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఒకటి సహా 11 తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా టిఆర్ఎస్ అధిష్టానం వేడుకలను ప్రారంభిస్తుంది. ప్లీనరీ సమావేశంలో తీర్మానంపై చర్చించి ఆమోదించనున్నారు.

ఇదిలా ఉంటే ప్లీనరీ సందర్భంగా అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభలోనే పార్టీ జాతీయ ఎజెండాను ఆవిష్కరించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికార పార్టీ వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా ఈ తీర్మానాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే సీఎం కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థాయిలో బలం పుంజుకుంటున్న బీజేపీకి చెక్ పెట్టేందుకే, జాతీయ స్థాయిలో తన ప్రాభవం చాటాలని, చక్రం తిప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడో సారి అధికారం చేపట్టేందుకు, బీజేపీతో ప్రత్యక్ష పోరుకు దిగి విజయం సాధించింది. అదే వ్యూహం తెలంగాణలో కూడా వర్కౌట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ, ప్రతిపక్షం కన్నా జోరుగా ప్రజల్లో నిలవాలనేది, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా వ్యవసాయ రంగంలోని పలు సమస్యలకు దోషిగా నిలబెట్టేందుకు టీఆర్ఎస్ సిద్ధం అవుతోంది.

గతంలో కేసీఆర్ తన సన్నిహితుల వద్ద జాతీయ రాజకీయాలపై చర్చించారు. “నయా భారత్” అనే పేరు కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం “వ్యవసాయ బిల్లు”, “ఉచిత విద్యుత్ వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగింపు” అంశాలను దేశీయంగా బీజేపీ అమలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. కేసీఆర్ వాటిని వ్యతిరేకిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వీటిపై వ్యతిరేకత వస్తుంది. అందుకే కేసీఆర్ జాతీయ ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు.