Site icon HashtagU Telugu

CM KCR: తెలంగాణ ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేస్తా!

Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

ప్రజారోగ్యం, వైద్యపరమైన మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం గుణాత్మక ప్రగతిని నమోదు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం న‌లుమూల‌ల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను నిరంతరం మెరుగుపరచడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తోందన్నారు. అనేక పథకాల అమలుతో పాటు, ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్ కేటాయింపులను ప్రభుత్వం గణనీయంగా పెంచింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. నీతి అయోగ్ నుండి అత్యుత్తమ ర్యాంకింగ్‌తో పాటు నాణ్యమైన వైద్య సేవలను విస్తృతం చేసినందుకు జాతీయ స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానం సాధించడం గర్వించదగ్గ విషయమని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు మొత్తం సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వైద్యశాఖలో మానవ వనరుల పెంపునకు చర్యలు చేపట్టారు. హెల్త్ వింగ్‌లో 21,073 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీ మరియు అనుబంధ నర్సింగ్ కాలేజీ, ఎంసీహెచ్ సెంటర్ల నిర్మాణం, యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ మెడికల్ సీట్ల పెంపుదల, నర్సింగ్ సీట్ల పెంపుదల వంటివి ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్దకే వైద్య సదుపాయాలను చేరవేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన బస్తీ దవాఖానలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.

బస్తీ దవాఖానాలు విజయవంతం కావడంతో ప్రభుత్వం గ్రామాల్లో పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి వైద్యసేవలను విస్తృతం చేసింది. కేసీఆర్‌ కిట్‌లు, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు ప్రజారోగ్య రంగంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా నిరుపేదలకు వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వ అంకితభావం నిరూపిత‌మైంద‌న్నారు. అమ్మ – ఒడి వాహనాలు, మాతా – శిశు సంరక్షణ కేంద్రాలు, మార్చురీల ఆధునీకరణ, క్యాథ్ ల్యాబ్ సెంటర్లు, అవయవ మార్పిడి కేంద్రాలు, స్టెమ్ సెల్ థెరపీ సెంటర్లు మరియు జెనోమిక్ సీక్వెన్స్ లేబొరేటరీలు అందుబాటులోకి వచ్చాయని… తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రోగ్రాం ప్రారంభించడం వల్ల ఆరోగ్య తెలంగాణ సాధనకు మార్గం సుగమం అవుతుందని సీఎం సీఆర్ ఆకాంక్షించారు.

Exit mobile version