తెలంగాణ సీఎం కేసీఆర్ నోట చంద్రబాబు మాట వినిపిస్తోంది. కర్ణాటక వెళ్లిన ఆయనకు మీడియా వేసిన ప్రశ్నకు సమాధానం చెబుతూ బాబును కలుపుకుని వెళతామన్నట్టు పరోక్ష సంకేతం ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబును కాదని వెళతారా? అనే ప్రశ్నకు కేసీఆర్ నుంచి వచ్చిన ప్రతిస్పందన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాన్ని మార్చేలా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేయేతర పార్టీలన్నింటితో సంప్రదింపులు జరుపుతానని వెల్లడించారు. చంద్రబాబు సహకారం కూడా ఉంటుందని పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది. దేశ పర్యటనకు కొంత విరామం ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఫౌంహౌస్ రాజకీయానికి తెరలేపారు. ఏడేళ్లుగా తెలంగాణ పరిపాలన అంతా ఫాంహౌస్ నుంచే నడుస్తోంది. ఆ తరహాలోనే దేశ రాజకీయాన్ని కూడా ఫాంహౌస్ నుంచే నడిపిస్తున్నారు. మేధావులు, ఆర్థిక వేత్తలు, ప్రకాష్ తరహా సినీ నటులు, ప్రశాంత్ కిషోర్ లాంటి సర్వే రాయుళ్లు ఫాంహౌస్ పాలిటిక్స్ కు జై కొడుతున్నారు. ఆర్భాటంగా ఢిల్లీ వెళ్లిన ఆయన అర్థాంతరంగా టూర్ ముగించుకుని వచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన రోజు మొఖంచాటేస్తూ బెంగుళూరు వెళ్లారు. ఆయన ఏది చేసినప్పటికీ దాని వెనుక రాజకీయ వ్యూహం ఉందని నమ్మేవాళ్లు టీఆర్ఎస్ పార్టీలో అనేకం.
ప్రస్తుతానికి విశ్రాంతి మూడ్ లో ఉన్న కేసీఆర్ ఫాంహౌస్ కు శుక్రవారం రాత్రి చేరుకున్నారు. వచ్చే నెల వరకు ఆయన దేశ పర్యటన వైపు చూసే పరిస్థితి లేదు. ఈనెల 26న బెంగళూరు వెళ్లిన కేసీఆర్ ఎప్పటి మాదిరిగానే మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. హైదరాబాదుకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన రెండు వివాహాలకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేను కలవడానికి రాలేగావ్ సిద్ధికి వెళ్లాలి. అయితే ఆ పర్యటన రద్దయింది. వచ్చే నెల 2 లేదా 3న ఆయన రాలేగావ్ సిద్ధికి వెళ్లే అవకాశం ఉంది. ఫాంహౌస్ నుంచి సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారని ప్రగతిభవన్ వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కొత్త పార్టీని పెడతారని ప్రచారం జరుగుతోంది. దసరా రోజున కేసీఆర్ నుంచి కీలక ప్రకటన వస్తుందని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశ రాజకీయాలపై కేసీఆర్ సంచలన ప్రకటన చేస్తారని ఆయన భావిస్తున్నారు.
ఒకప్పుడు దేశ రాజకీయాలను నడిపిన అనుభవం చంద్రబాబుకు ఉంది. ఆ సమయంలో కేసీఆర్ కూడా ఆయనతో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆనాడు చంద్రబాబు చేసిన ప్రయత్నం తరహాలోనే చేస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ ను ప్రధానిగా చేయడంలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అందుకే, దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినప్పటికీ కేసీఆర్ కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎదురవుతోన్న ప్రశ్న చంద్రబాబు రోల్. బెంగుళూరు వెళ్లిన ఆయనకు డైరెక్ట్ గా మీడియా రూపంలో చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా కేసీఆర్ పాజిటివ్ గా స్పందించడం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను మలుపుతిప్పేలా కనిపిస్తోంది.