Site icon HashtagU Telugu

KCR In TRS Plenary 2022 : భార‌త్‌లో మ‌రో కొత్త పార్టీ?

Kcr New Party

Kcr New Party

భార‌త దేశానికి కొత్త పార్టీ అవ‌స‌ర‌మంటూ ప్లీన‌రీ వేదిక‌గా కేసీఆర్ ఉద్ఘాటించారు. ప‌రోక్షంగా భార‌త సాధ‌న స‌మితి(బీఎస్సీ) పేరుతో పార్టీ స్థాప‌న ఉంటుంద‌ని సంకేతం ఇచ్చారు. ఒక ప‌త్రిక కోడ్ చేసిన భార‌త సాధ‌న స‌మితి పేరును ప్లీన‌రీలో చెబుతూ అవ‌స‌ర‌మైతే కొత్త పార్టీ వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం భార‌త దేశానికి మూడో కూట‌మి, ఫ్రంట్‌, ప్ర‌త్యామ్నాయ గుంపు, ప్ర‌త్యామ్నాయ కూట‌మి కాద‌ని కేసీఆర్ తేల్చారు. ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాల‌ని ప్ర‌క‌టించారు. అంబేద్క‌ర్ రాజ్యాంగం ప్ర‌కారం న‌డుచుకునే కొత్త రాజ‌కీయ శ‌క్తి అవ‌స‌ర‌మ‌ని గుర్తు చేశారు. దేశంలో భూకంపం, తుఫాన్ సృష్టించే పార్టీ వ‌స్తుంద‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. అంతేకాదు, దాన్లో టీఆర్ఎస్ పార్టీ కీల‌క భూమిక పోషిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పాల‌న టార్గెట్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌సంగం ప్లీన‌రీ వేదిక‌గా సుదీర్ఘంగా జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి భార‌త దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా త‌యారు అవుతుంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం భార‌తదేశం ప‌రిస్థితిని వివ‌రించారు. మ‌తత‌త్వ్తాల‌ను రెచ్చ‌గొడుతూ రాజ‌కీయాలు చేయాల‌ని అనుకోవ‌డం మంచికాద‌ని చుర‌క‌లంటించారు. మ‌త‌, కులాల‌ను రెచ్చ‌గొట్టే రాజ‌కీయాల ద్వారా ప‌ది మందికి ప‌ద‌వులు కావాల‌నుకోవ‌డం దుర్మార్గంమంటూ విమ‌ర్శించారు. వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికీ మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌లేని దుస్థితిలో కేంద్ర ప్ర‌భుత్వం ఉంద‌ని వివ‌రించారు. ఉత్ప‌త్తి సామ‌ర్థ్యంలోని స‌గం విద్యుత్ ను కూడా త‌యారు చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆరోపించారు. జాతీయ స్థాయిలో వ్య‌వ‌సాయ విధానం ఒక‌టే ఉండాల‌ని డిమాండ్ చేశారు. న‌దుల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటి స‌మ‌స్య‌ను తీర్చ‌డానికి అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ మైండ్ లేక దుర్వినియోగం చేస్తున్నార‌ని మోడీపై ఫైర్ అయ్యారు.

సుసంప‌న్న‌మైన భార‌త దేశానికి ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌కు లేని విధంగా వ‌న‌రులు ఉన్నాయి. వాటిని వినియోగించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టి వ‌ర‌కు వైఫ‌ల్యం చెందాయి. అందుకే, సుమారు 10కోట్ల మంది భార‌తీయులు విదేశాలు వెళ్లార‌ని కేసీఆర్ చెబుతున్నారు. సింగ‌పూర్ మోడ‌ల్ ను వివ‌రిస్తూ ఆ దేశాని కంటే భార‌త్ కు ఏమి త‌క్కువ‌ని నిల‌దీశారు. కేవ‌లం మ‌తాన్ని అడ్డుపెట్టుకుని, దేవుళ్ల‌ను చూపుతూ ఎన్ని రోజులు దిక్కుమాలిన రాజ‌కీయాలు చేస్తార‌ని బీజేపీపై విరుచుకుప‌డ్డారు. దేవుళ్లు ఊరేగింపుల్లో క‌త్తులు, క‌టార్లు అవ‌స‌ర‌మా? అంటూ నిల‌దీశారు. గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ ను ఉప‌యోగించుకుని బీజేయేత‌ర రాష్ట్రాల్లో జ‌రుగుతోన్న రాజ్యాంగ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల గురించి ప్ర‌శ్నించారు. అందుకే, భార‌త దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండాతో వ‌చ్చే రాజ‌కీయ శ‌క్తి అవ‌స‌ర‌మ‌ని వెల్ల‌డించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా భార‌త రాజ‌కీయాల‌పై మాట్లాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ హ‌డావుడి చేశారు. ఆ ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత మౌనంగా ఉన్న ఆయ‌న హుజూరాబాద్ ఉప ఫ‌లితాల త‌రువాత దేశ రాజ‌కీయల‌పై దృష్టి పెట్టారు. ఇటీవ‌ల ఆయా రాష్ట్రాల్లోకి బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను క‌లుసుకున్నారు. మోడీ కి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించారు. తాజాగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తో త‌ర‌చూ భేటీ అయ్యారు. దేశ రాజ‌కీయాల‌పై పలు మార్గాల‌ను చ‌ర్చించారు. కాంగ్రెస్‌తో కూడిన కూట‌మి దిశగా ఆలోచించారు. కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ఫ్రంట్ గురించి ప్ర‌స్తావించారు. మేధోమ‌థ‌నం పూర్త‌యిన త‌రువాత ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తి అవ‌స‌ర‌మని నిర్థారించుకున్న‌ట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ప్లీన‌రీలోని కేసీఆర్ స్పీచ్ ను గ‌మ‌నిస్తే, త్వ‌ర‌లోనే దేశానికి కొత్త రాజ‌కీయ శ‌క్తిని తెర‌మీద‌కు తీసుకొచ్చే ఆలోచ‌న ఉన్న‌ట్టు అర్థం అవుతోంది. అవ‌స‌మైతే, కొత్త పార్టీని పెడ‌తానంటూ మూడు నెల‌ల క్రితం మీడియా ఎదుట ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర స‌మ‌తిని తెలుగు రాష్ట్ర స‌మితిగా మార్చుతామ‌ని 2018 ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌స్తావించారు. తాజాగా భార‌త సాధ‌న స‌మితి అంటూ ఒక పేరును కేసీఆర్ తెర మీద‌కు తీసుకు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌శాంత్ కిషోర్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా కొత్త రాజ‌కీయ శ‌క్తి హైద‌రాబాద్ కేంద్రంగా రాబోతుంద‌ని కేసీఆర్ స్పీచ్ ద్వారా స్ప‌ష్టం అవుతోంది.