Site icon HashtagU Telugu

CM KCR: శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియా..ఒకరికి ప్రభుత్వోద్యోగం..!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడుభూములను రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారలాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతోపాటుగా ఆయన కుటుంబానికి పూర్తి జీతభత్యాలు చెల్లించాలని రిటైర్మెంట్ వయస్సు వరకు వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించలేదని హెచ్చరించారు. ఈ ఘటనకు కారణమైన దోషులకు కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

కొత్తగూడెంలో ఫారెస్టు రేంజర్‌పై గుత్తికోయలు దాడి చేసిన సంతి తెలిసిందే. జిల్లాలోని చండ్రుగొండ మండలం బెందాలపాడులో గ్రామ శివారు ఎర్రబోడులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తలపై తీవ్ర రక్తస్రావమైన రేంజర్ శ్రీనివాస్‌రావును చికిత్స నిమిత్తం చండ్రుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వలస వచ్చిన గుత్తికోయ గిరిజనులు ప్లాంటేషన్‌లో చెట్లను నరికివేయడాన్ని అటవీశాఖాధికారి అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మరణించారు.