CM KCR: రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తాం!

ఢిల్లీలోని తెలంగాణ భవన్ పరిసరాలు గులాబీమయం అయ్యాయి.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ పరిసరాలు గులాబీమయం అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దీక్ష ప్రారంభమయింది. రైతులు పడించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలనే డిమాండ్ తో టీఆర్ఎస్ పార్టీ దేశ రాజధానిలో ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు రైతు సంఘం నేత టికాయత్ హాజరయ్యారు. వేదికపై కేసీఆర్ పక్కనే టికాయత్ ఆసీనులయ్యారు. ఢిల్లో వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నా కార్యక్రమం కొనసాగుతోంది. తెలంగాణ రైతుల కోసం చేస్తున్న దీక్ష అయినప్పటికీ, కొన్ని రోజుల నుండి బీజేపీ రాజకీయాలపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడుతారో అనే అంశంపై అన్ని రాజకీయపార్టీలు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండించిన యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు. 24 గంటలలోపు ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని చెప్పారు. రైతు సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చని కానీ రైతులతో పడొద్దని అన్నారు. కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు. రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఉరికేపోదని అన్నారు. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి కానీ ధాన్యం వద్దా అని బీజేపీని కేసీఆర్ ప్రశ్నించారు.

అనంతరం తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. చారిత్రక దీక్ష అని, అన్నదాతల కోసం తెలంగాణ నుండి హస్తినకు వచ్చామని, ఒక అనివార్య పరిస్థితిని కేంద్రం కల్పించిందని, కేంద్రం మోసాన్ని ముందే గ్రహించి కేసీఆర్ అప్రమత్తం చేశారని తెలిపిన ఆయన వానాకాలం ముందే యాసంగి పంట గురించి అడిగితే బీజేపీ నేతలు యాసంగి గురించి ఎందుకని బీజేపీ నేతలు అన్నారని గుర్తు చేశారు. ధాన్యం విషయంలో మంత్రుల బృందం పలుమార్లు కేంద్రాన్ని కలిసిందని, కేసీఆర్ గారు ప్రధానికి రాసిన లేఖలో కొత్త మార్గాలు అన్వేషించాలని కోరారని మంత్రి తెలిపారు. తెలంగాణ రైతుల పట్ల బాధ్యత లేకుండా తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలని కేంద్ర మంత్రి అవహేళన చేశారని, పంజాబ్ ను తలదన్ని తెలంగాణ రైతులు ధాన్యం పండించిన తెలంగాణను కేంద్రం అభినందించాల్సింది పోయి వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నీళ్లలో, కరంటులో, రైతుబంధులో, రైతుభీమాలో కేంద్రం సాయం లేదని, చివరకు పంట కొనాల్సిన బాధ్యత నుండి కేంద్రం బాధ్యతారహితంగా వైదలగుతున్నారని ఆరోపించారు.

దేశ రైతాంగాన్ని రోడ్డు మీదకు తెచ్చి వారి నిరసనకు తలొగ్గి లెంపలేసుకున్న చరిత్ర బీజేపీదని గుర్తు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి, 2011 ముఖ్యమంత్రి మోడీ చేసిన డిమాండ్లు ఉన్న ఫైలు ఇప్పుడు ప్రధానమంత్రి అయిన మోడీ టేబుల్ మీదనే ఉన్నదని, 2013లో పంటల కొనుగోలు గురించి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా రైతులతో సమావేశం పెట్టి, 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించారని గుర్తు చేశారు.  కాగా తెలంగాణ కేబినెట్ మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో ధాన్యం కొనగోలుపై కేంద్రం వైఖరిపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.

బండి సంజయ్ ఫోటోలు చించివేత

టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల నినాదాలతో ఢిల్లీ హోరెత్తింది. రైతుల విషయంలో బీజేపీ నాటకాలు ఆడుతోందని గులాబీనేతలు మండిపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ దీక్షకు కౌంటర్ గా ఢిల్లీలో బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసింది. కేసీఆర్ చేస్తున్న మహాధర్నా ప్రాంగణం తెలంగాణ భవన్ పక్కనే బండి సంజయ్ ఫోటో, పేరుతో బీజేపీ ఫ్లెక్సీలు చూసి టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గల్లీ రాజకీయాలు ఢిల్లీలో చేస్తావా? ధాన్యం కొనుగోలు చెయ్ లేదంటే గద్దె దిగు అని రాసి ఉన్న ఫ్లెక్సీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లోలోని నివాసం ముందు కనిపించగా టీఆర్ఎస్ నాయకులు వాటిని చించివేశారు.