TRS Rajyasabha : రాజ్య‌స‌భ స‌భ్యుల్ని ఖ‌రారు చేసిన కేసీఆర్‌

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వాల‌ను ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌కాష్ రాజ్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది.

  • Written By:
  • Updated On - May 18, 2022 / 05:41 PM IST

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వాల‌ను ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌కాష్ రాజ్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. జాతీయ రాజ‌కీయాల వైపు దూకుడుగా వెళుతోన్న కేసీఆర్ ఆ త‌ర‌హాలో రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక ఉంటుంద‌ని చాలా మంది ఊహించారు. కానీ, ప్ర‌చారం జ‌రిగిన విధంగా క‌ల్వ‌కుంట్ల క‌విత, ప్ర‌కాష్ రాజ్ పేర్ల‌ను ప‌రిశీల‌న‌లోకి ఆయ‌న తీసుకోలేదు. పెద్ద‌గా టీఆర్ఎస్ పార్టీలో ఫోక‌స్ కాని డాక్ట‌ర్ .బండి పార్థసారథి రెడ్డి., వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)., దీవకొండ దామోదర్ రావు లను రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎంపిక చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాశం అయింది.

న‌మ‌స్తే తెలంగాణ ఎండీగా ఉన్న దీవ‌కొండ దామోద‌ర్ రావు ఎంపిక వెనుక పూర్తిగా కేసీఆర్ సొంత కోట‌రీ వ్య‌వ‌హారం. ఆ ప‌త్రిక కేసీఆర్ స‌ర్కార్ కు అనుకూలం. మొద‌టి నుంచి ఆయ‌న పార్టీ అండ‌గా ఉంటూ పత్రిక‌ను న‌డిపారు. గ‌తంలోనే ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇవ్వ‌లేక‌పోయారు. ఇప్పుడు రాజ్య‌స‌భ‌గా ఆయ‌న్ను ఎంపిక చేయ‌డం కేవ‌లం స్వామిభ‌క్తి అంశం మాత్ర‌మే క‌నిపిస్తోంది. ఇక హెటిరో డ్ర‌గ్స్ డాక్ట‌ర్ పార్థ‌సార‌థి రెడ్డి ఏపీ మూలాలున్న పారిశ్రామిక‌వేత్త‌. ఆయ‌న‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డికి బంధుత్వం ఉంది. కోవిడ్ సంద‌ర్భంగా హెటిరో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది. బ‌హుశా ఆయ‌న ఎంపిక వెనుక అన్న‌దమ్ముల త‌ర‌హాలో ఉన్న జ‌గ‌న్‌, కేసీఆర్ మ‌ధ్య క్విడ్ ప్రో కో ఉండొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఖ‌మ్మం జిల్లాకు చెందిన వ‌ద్దిరాజు ర‌విచంద్ర అలియాస్ గాయ‌త్రి ర‌వి ని రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం. రాబోవు ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నుంచి టీఆర్ఎస్ పార్టీ గ‌ట్టెంచే దిశ‌గా ఈ ఎంపిక ఉంద‌ని భావిస్తున్నారు. ఆ జిల్లా నుంచి బీసీ లీడ‌ర్ గా ఉన్న ర‌వి చంద్ర‌కు రాజ్య‌స‌భ ఇవ్వ‌డం ద్వారా బీసీల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఇద్ద‌రు ఓసీ ఒక బీసీ కి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వాల‌ను ఇస్తూ ఎవ‌రూ ఊహించని విధంగా కేసీఆర్ ఎంపిక చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ్య‌స‌భ‌కు ఎంపిక అయిన ముగ్గురూ పారిశ్రామిక వేత్త‌లు కావ‌డం గ‌మ‌నార్హం. సొంత గూటిలోని దీవ‌కొండ దామోద‌ర‌రావు, జ‌గ‌న్ నీడున్న డాక్ట‌ర్ పార్థ‌సార‌థికి రాజ్య‌స‌భ ల‌భించ‌డం విశేషం. అలాగే గాయ‌త్రి గ్రానైట్స్ అధినేత‌గా ఉన్న వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌కు రాజ్య‌స‌భ ఇవ్వ‌డం ద్వారా ఖ‌మ్మం రాజ‌కీయాల్లో సరికొత్త ఈక్వేష‌న్ కు కేసీఆర్ తెర‌లేపారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ్మ‌, రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య అక్క‌డ జ‌రుగుతోన్న రాజ‌కీయ పోరుపై బీసీ కార్డును ప్లే చేశార‌ని తెలుస్తోంది. వ‌ద్దిరాజు ఎంపిక వెనుక మంత్రి కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని తెలుస్తోంది.