CM KCR : ఇదేం చోద్యం! స‌మైక్యానికి కేసీఆర్ జై!!

ఏదైనా త‌న‌దాకా వ‌స్తేగానీ తెలియ‌దంటారు పెద్ద‌లు. ఇప్పుడు విభ‌జ‌న‌, విచ్ఛిన్నం బాధ తెలంగాణ సీఎం కేసీఆర్ కు తాకింది. కులం, మ‌తం, వ‌ర్గం అంటూ దేశాన్ని విడ‌దీయ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని గ‌గ్గోలు పెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 11:48 AM IST

ఏదైనా త‌న‌దాకా వ‌స్తేగానీ తెలియ‌దంటారు పెద్ద‌లు. ఇప్పుడు విభ‌జ‌న‌, విచ్ఛిన్నం బాధ తెలంగాణ సీఎం కేసీఆర్ కు తాకింది. కులం, మ‌తం, వ‌ర్గం అంటూ దేశాన్ని విడ‌దీయ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని గ‌గ్గోలు పెడుతున్నారు. కానీ, ఆయ‌న మాత్రం ఇప్ప‌టికే విభ‌జ‌న వాదాన్ని తెలుగు రాష్ట్రాల్లో న‌మ్ముకున్నారు. వ‌చ్చే ఎన్నికల కోసం ఇప్ప‌టి నుంచే సెంటిమెంట్ ను రాజేస్తూ ఇటీవ‌ల నిర్వ‌హిస్తోన్న జిల్లాల స‌భ‌ల్లో ప్ర‌సంగాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

విభ‌జ‌న వాదాన్ని 2001 నుంచి కేసీఆర్ న‌డిపారు. ఆ వాదాన్ని ఎజెండాగా చేసుకుని టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని చావు నోట్లో త‌ల‌పెట్టి సాధించాన‌ని చెబుతారు. ఆ స్లోగ‌న్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బాగా ప‌నిచేసింది. మ‌ళ్లీ రాబోవు 2023 ఎన్నిక‌ల్లోనూ అదే స్లోగ‌న్ వినిపించ‌డం ద్వారా మూడోసారి సీఎం కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. విభ‌జ‌న వాదాన్ని దేశ వ్యాప్తంగా వినిపించిన నాయ‌కుడు కేసీఆర్. ఆ రోజు దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో విభ‌జ‌న వాదానికి మ‌ద్ధ‌తు ప‌లికారు. సుమారు 20 రాష్ట్రాలు ప్ర‌త్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నాయ‌ని వినిపించారు. ఆయా రాష్ట్రాల‌కు వెళ్లి విభ‌జ‌న వాదాన్ని లేపారు. ప్ర‌త్యేక‌వాదం ద్వారా ఆయ‌న , ఆయ‌న కుటుంబం పొందిన ల‌బ్ది గురించి తెలంగాణ‌లో ఎవ‌ర్ని క‌ద‌లించినా చెబుతారు.

సీన్ క‌ట్ చేస్తే, ఇప్పుడు ఐక్య‌త‌, జాతీయ‌వాదం కావాల‌ని కోరుకుంటున్నారు. అధికారంలోని బీజేపీ విభ‌జించి పాలించాల‌ని చూస్తుంద‌ని విమ‌ర్శ‌లు అందుకున్నారు. మ‌తం, కులం, వ‌ర్గం అస్త్రాల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయాల‌ని మోడీ కోరుకుంటున్నార‌ని ఆరోప‌ణలు చేస్తున్నారు. ఆనాడు విభ‌జ‌న‌కు ప్ర‌త్యేక వాదాన్ని వినిపించ‌డాన్ని స‌మ‌ర్థించిన కేసీఆర్ ఇప్పుడు మ‌తం, కులం, వ‌ర్గం ద్వారా దేశాన్ని విభ‌జించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దం.

ఐక్యంగా ఉండాల‌ని దేశ ప్ర‌జ‌ల‌కు విభ‌జ‌న‌వాది కేసీఆర్ చెబుతున్నారు. దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాల‌ని కోరుకుంటున్నారు. అందుకోసం తెలంగాణ మోడ‌ల్ ను చూపిస్తున్నారు. సేమ్ టూ సేమ్ ఇలాగే గుజ‌రాత్ మోడ‌ల్ ను చూపించ‌డం ద్వారా 2014 ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌ధాని అయ్యారు. అదే త‌ర‌హాలో 2024 ఎన్నిక‌ల నాటికి తెలంగాణ మోడ‌ల్ చూపించాల‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. జాతీయ‌వాదం, ఐక్య‌త‌, మ‌త‌సామ‌ర‌స్యం ఇవ‌న్నీ ఇప్పుడు కేసీఆర్ దేశానికి చెబుతోన్న సూత్రాలు. మొత్తం మీద బీజేపీ విభ‌జ‌న పార్టీగా చూపుతూ టీఆర్ఎస్ ఐక్యతారాగాన్ని చూప‌డం ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా ఉంద‌ని ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌త్యేకించి స‌మైఖ్య రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్లు ప్ర‌స్తుతం కేసీఆర్ వినిపిస్తోన్న ఐక్య‌తారాగాన్ని చూసి `హ‌వ్వా` ఇదే చోద్యం అంటూ గొల్లుమంటున్నారు.