CM KCR: ‘నాటు నాటు’ తెలంగాణ సంస్కృతికి, జీవన వైవిధ్యానికి అద్దం పట్టింది!

‘నాటు నాటు' పాట కు 'ఉత్తమ ఒరిజనల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల (CM KCR) హర్షం వ్యక్తం చేశారు.

  • Written By:
  • Publish Date - March 13, 2023 / 11:35 AM IST

ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాట కు ‘ఉత్తమ ఒరిజనల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం అన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ పాటలో పొందు పరిచిన పదాలు తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని సీఎం అన్నారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి, కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు శ్రీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ శ్రీ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత శ్రీ డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణ విలువల పరంగాను, సాంకేతికంగాను హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం గొప్ప విషయమని సీఎం అన్నారు. ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని సీఎం (CM KCR) పేర్కొన్నారు.

ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణం అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండుగరోజనీ, తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదనీ, కరోనా కాలంలో కష్టాలు చుట్టిముట్టిన తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని, వైవిద్యంతో కూడిన కథలతో, ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని, సీఎం (CM KCR) ఆకాంక్షించారు.

Also Read: MM Keeravani: నాటు నాటు విజయకేతనం.. కీరవాణి ఎమోషనల్