“తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం. కోటి ఎకరాల మగాణం కల. తెలంగాణకు దళితుడే తొలి సీఎం. ఆంధ్రా వాళ్లు వెళితే, హైదరాబాద్ లో మనిషికో ఇళ్లు. ఆంధ్రోళ్లు ఆక్రమించుకున్న భూములను లాగుడే. ఫిల్మ్ సిటీలో లక్ష నాగళ్లతో దున్నుడు` ఇలాంటివన్నీ కేసీఆర్ జమానా నుంచి వినిపించిన మాటలు. అవన్నీ ఎవరు చెప్పిన్రు అంటూ ఇప్పుడు కేసీఆర్ మీడియాను నోరు మూయిస్తున్నారు.టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తరువాత ప్రకటించారు. ఆనాటి నుంచి ఉద్యమానికి ఏ మాత్రం సంబంధంలేని వాళ్లతో పార్టీని నింపేశారు. తెలుగుదేశం పార్టీకి మరో రూపంగా టీఆర్ఎస్ పార్టీని మార్చేశారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో సగానికిపైగా టీడీపీ వేసిన విత్తనాలే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ అక్కడ కనిపించడంలేదు. ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని దూరంగా పెట్టిన వాళ్లే కారు పార్టీలో కీ రోల్ పోషిస్తున్నారు. అంతేకాదు, ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రివర్గంలో చేర్చుకున్న కేసీఆర్ సరికొత్త రాజకీయానికి నాంది పలికారు. అదేమంటే, చంద్రబాబునాయుడు చేస్తే ఒప్పు తాను చేస్తే తప్పా? అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు.
వాస్తవంగా 2014 ఎన్నికల్లో కేవలం 63 మంది ఎమ్మెల్యేలతో మైనార్టీ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సామదానదండోపాయాలను ఉపయోగించి ఆకర్షించారు. ఆ పార్టీని అసెంబ్లీలో లేకుండా విలీనం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అసెంబ్లీలో లేకుండా చేశారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైన మెజార్టీతో గెలుపొందినప్పటికీ 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. ఆ పార్టీని కూడా అసెంబ్లీలో విలీనం చేసుకోవడానికి అధికారాన్ని ప్రయోగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసిన కేసీఆర్ తెలంగాణ రాజకీయ చరిత్రలో మరిచిపోని లీడర్.
టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో కేసీఆర్ అమలు చేయలేదు. అంతేకాదు, దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. దాన్ని కూడా అమలు చేయలేని కేసీఆర్ ఆ వర్గం ప్రస్తుతం నిలదీస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే, తెలంగాణ అభివృద్ధి తరహా ఎజెండా భారతదేశానికి ప్రత్యామ్నాయం కావాలని ప్లీనరీ వేదికగా కేసీఆర్ పిలుపునిచ్చాడు. ఆ సందర్భంగా క్యాడర్ నుంచి ఉత్సాహం కనిపించింది. ఆ విధమైన స్పందన చూసిన తరువాత కేసీఆర్ తన వ్యాక్చాతుర్యంతో తెలంగాణ ఓటర్లను ఎప్పటికీ ఆకర్షించగలరని అర్ధం అవుతోంది.
`తెలంగాణ సీఎం కేసీఆర్ అలవోకగా అబద్దాలు చెబుతారు. అబద్దాన్ని నిజంలా, నిజాన్ని అబద్దంలా చెప్పడంలో ఆయన దిట్ట. `అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు పలువురు చెబుతుంటారు. అందుకు తాజా ఉదాహరణగా మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ఇష్యూను గుర్తు చేస్తున్నారు. మంత్రివర్గంలో నీతివంతమైనప మంత్రులు ఉన్నారని చెబుతోన్న కేసీఆర్ ఈటెల ఆక్రమణలు, ఆస్తులపై విచారణ ఎందుకు వేశార. ఆయన అవినీతిపై టీఆర్ఎస్ పార్టీ పలు విధాలుగా ప్రయత్నం చేసింది. పలువురు మంత్రుల అవినీతిపై ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. వాటి గురించి ఏ మాత్రం ప్రస్తావించని కేసీఆర్ మంత్రివర్గం నిజాయితీని ప్లీనరీలో ప్రశంసించారు. నీతివంతమైన పాలన తెలంగాణకు మాత్రమే సాధ్యమంటూ స్వీయ ప్రశంస చేసుకోవడం గమనార్హం.