CM KCR Announcement: కేసీఆర్ బిగ్ స్టేట్‌మెంట్.. నిరుద్యోగులకు భారీ న‌జ‌రానా..!

తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర నిరుద్యోగుల‌కు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. రాష్ట్ర వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

  • Written By:
  • Updated On - March 9, 2022 / 12:05 PM IST

తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర నిరుద్యోగుల‌కు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. రాష్ట్ర వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ క్ర‌మంలో80,039 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. పోలీసు శాఖలో 18,334, విద్యా శాఖలో 13,086, వైద్య ఆరోగ్య శాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, రెవెన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో4,311, సాగునాటీ శాఖలో 2,622, ఎస్సీ సంక్షేమ శాఖలో 2,879 ఖాళీలు ఉన్నాయ‌ని కేసీఆర్ తెలిపారు.

ఇక రాష్ట్రంలో ఉన్న 11,103 కాంటాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ క్ర‌మంలో నేటి నుంచి 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతాయని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికులకు ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగుల‌పై కేసీఆర్ వ‌రాల‌జ‌ల్లు కురిపించారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు లక్షా 56 వేల ఉద్యోగాలకు గతంలో నోటిఫికేషన్ జారీ చేశామ‌ని కేసీఆర్ తెలిపారు. మ‌రో 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామ‌ని, తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1.33 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ చేశామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు.

అలాగే రాష్ట్రంలో మిగతా ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. మనం వేరుపడ్డ రాష్ట్రంతో ఉద్యోగాల విషయంలో ప్రమాదం ఉండే అవ‌కాశం ఉంది కాబట్టి, కొత్త రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నామ‌ని, అయితే ఆ ఉత్త‌ర్వుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఏడాది పాటు పెండింగ్‌లో పెట్టిందని కేసీఆర్ తెలిపారు. ఇక‌ శాశ్వత ప్రాతిపదికన ఇక్కడి వారికి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేయ‌డంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అతి పెద్ద విజయం సాధించింద‌ని కేసీఆర్ తెలిపారు. నాలుగు రోజులు లేటయినా సరే మంచి విజయం సాధించామ‌ని, దీంతో అటెండర్ నుంచి ఆర్డీవో వ‌ర‌కు 95 శాతం ఉద్యోగాలు స్థానికులే రానున్నాయాయ‌ని, మిగతా 5 శాతంలోనూ 3 నుంచి 4 శాతం ఉద్యోగాలు మనకే వస్తాయ‌ని కేసీఆర్ తెలిపారు.

ఇక 2014 లో తెలంగాణ ఏర్పడేనాటికి లక్షల సంఖ్యలో వలసలు, ఆత్మహత్యలు, నిరాశతో నిరుద్యోగ యువత, రైతుల ఇబ్బందులు అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి తెలంగాణ కోసం కొంత‌ మందితో ఉద్యమం ప్రారంభిస్తే 14 ఏళ్లకు కల సాకారమయిందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణను పునర్నిర్మించుకోవాలని తాను చెప్పానన్నారు. వేరే పార్టీలకు రాజకీయలంటే ఒక గేమ్ అని, టీఆర్ఎస్‌కు మాత్రం అది ఒక టాస్క్ అని కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణను తెచ్చుకున్న తర్వాత ఏకాగ్రతను దెబ్బ‌తీసేందుకు చాలామంది ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, అయితే తెలంగాణ రాష్ట్రాన్ని బాధ్యతగా తీసుకుని పోవడమే తమ లక్ష్యమని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.