CM KCR: ఎకరాకు 10 వేల నష్ట పరిహారం: రైతులకు సీఎం కేసీఆర్ హామీ!

రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు కేసీఆర్ పరిశీలించారు.

  • Written By:
  • Updated On - March 23, 2023 / 03:20 PM IST

ఇటీవల తెలంగాణ (Telangana) వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. వర్షాలకు పంటలు దెబ్బతినడంతో దిక్కు తోచని స్థితిలో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) రూ. పదివేల పరిహారం ప్రకటించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఆయన పరిశీలించారు. ఖమ్మం జిల్లా బొంకల్‌ మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి (CM KCR) ప్రకటించారు. దాదాపు 2,28,000 ఎకరాల భూమి వర్షాల వల్ల ప్రభావితమైంది, ఫలితంగా కౌలు రైతులు గణనీయంగా నష్టపోయారు. నష్టపోయిన రైతుల (Farmers)కు పరిహారం పంపిణీని ఇన్ ఛార్జి అధికారులు పర్యవేక్షించనున్నారు.

ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో రైతులకు మేలు చేసే విధానాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. అలా కాకుండా రైతులు, ప్రజల సంక్షేమం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పంటనష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇవ్వమని, తామే ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాని కృషి ఫలితంగా రైతులకు గణనీయమైన ప్రగతిని సాధించిందని కేసీఆర్ (CM KCR) ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా నష్టపోయిన ప్రతీ ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొత్తం 2,28,255 ఎకరాల్లో పంట దెబ్బతిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని అన్నారు. ఈ రైతులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రకటనతో రైతులకు భారీగా ఊరట లభించనుంది.

Also Read: Keerthy Suresh: కల్లు తాగిన కీర్తి సురేశ్.. షాకైన ఫ్యాన్స్