Site icon HashtagU Telugu

CM KCR: మోడీ బూట్లు మోసే స‌న్యాసులు కావాలా: పెద్ద‌ప‌ల్లి స‌భ‌లో కేసీఆర్

Kcr And Modi

Kcr And Modi

ఆత్మ గౌర‌వం కోసం 60ఏళ్లు గోస‌ప‌డి తెచ్చుకున్న తెలంగాణ‌ను తాక‌ట్టు పెట్టాల‌ని మోడీ బూట్లు మోసే వాళ్లు చూస్తున్నార‌ని ప‌రోక్షంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి బండి సంజ‌య్ మీద పెద్దప‌ల్లి స‌భ‌లో కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. బూట్లు మోసి, చెప్పులు మోసి గులాములుగా మారిన వెధ‌వ‌లు తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. మేధావులు, బుద్ధి జీవులు, యువ‌కులు మేల్కోని ప్ర‌తి గ్రామంల్లో చ‌ర్చ‌లు పెట్టి ఈ బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాల‌ని కోరారు. మ‌త‌పిచ్చి, మ‌త ద్వేషాలు ఉండే బీజేపీ న‌మ్మొద్ద‌ని అన్నారు.

26 రాష్ట్రాల నుంచి వ‌చ్చిన రైతులు చ‌ర్చించార‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. వాళ్ల‌తో వ్య‌వ‌సాయాన్ని దేశ వ్యాప్తంగా ఎలా చేద్దామ‌నే విష‌యంపై చ‌ర్చించామ‌ని చెప్పారు. గుజ‌రాత్ మోడ‌ల్ ను చూపించి దేశ ప్ర‌జ‌ల్ని మోడీ మోసం చేశార‌ని ఆరోపించారు. గుజరాత్ లో మ‌ద్య నిషేధం ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ కల్తీ మ‌ద్యం తాగి 79 మంది మ‌ర‌ణించార‌ని , అక్క‌డ అక్ర‌మ మ‌ద్యం ఏరులై పారుతున్న విష‌యాన్ని వివ‌రించారు. అక్ర‌మార్కులు, అవినీతి కోరులు, మ‌త విద్వేషం లేప‌డానికి ఢిల్లీ నుంచి బీజేపీ నేత‌లు వ‌స్తున్నార‌ని, జాగ్ర‌త్త ప‌డాల‌ని కేసీఆర్ కోరారు. ఆయ‌న ప్ర‌సంగంలో యథాలాపంగా మోడీ స‌ర్కార్ మీద విరుచుప‌డ్డారు.

జాతీయ రాజ‌కీయాల‌కు వెళ్లాలా? వ‌ద్దా ? అంటూ ప్ర‌జ‌ల నుంచి ఆమోదం తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఆయ‌న‌కు సానుకూల స్పంద‌న వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న ఆద్యంత‌మూ మోడీ, జాతీయ స్థాయి అంశాల‌పై మాట్లాడారు. ఢిల్లీ సెంటిమెంట్ ను లేప‌డం ద్వారా మూడోసారి సీఎం కావ‌డానికి అనుకూలమైన ప్ర‌సంగం చేశారు కేసీఆర్.