Site icon HashtagU Telugu

Telangana Congress: కాంగ్రెస్ లో సీఎం కుర్చీ ఫైట్..

Telangana Congress (1)

Telangana Congress (1)

Telangana Congress: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వేడి పుట్టిస్తుంది. 6 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసి ఓటర్లని ఆకట్టుకోగా, తాజాగా 55 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. మరోపక్క అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడుమీదుంది. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసిన కారు పార్టీ 115 అభ్యర్థుల్ని నెలక్రితమే ప్రకటించింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ లో కనిపించే గందరగోళం ఏంటంటే కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరనేది క్లారిటీ లేదు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అని చిన్న పిల్లాడిని అడిగిన చెప్తాడు.

కాంగ్రెస్ గెలిస్తే ఎవరికీ వారు నేనే సీఎం అని చెప్పుకుంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా డిసెంబర్ 9న సీఎంగా ప్రమాణం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎల్బీ స్టేడియం అని వేదిక కూడా డిక్లేర్ చేశారు. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం చేస్తున్నారు. పైగా ఆయన ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఢిల్లీ పెద్దలతో శభాష్ అనిపించుకున్నాడు.ఇంకా కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి హనుమంతరావు, మధు యాష్కీ, రేణుకా చౌదరి ఇలా సీనియర్లు చాలానే ఉన్నారు. తాజాగా జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి రేపాయి. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అన్నారు. తనను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని జానా రెడ్డి పేర్కొన్నారు. ఇన్నాళ్లూ తనకు మద్దతుగా నిలిచిన నల్గొండ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ 77 ఏళ్ల వృద్ధుడిని అయిన నన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని కామెంట్స్ చేశాడు.

36 ఏళ్లకే మంత్రి అయ్యానని జానా రెడ్డి గుర్తు చేస్తూ.. పార్టీలో తనకు 55 ఏళ్ల సీనియారిటీ ఉందన్నారు. ఎలాంటి పదవులకు ఆశపడకుండానే నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివిధ పదవులు చేపట్టే అవకాశం లభించిందని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జానా రెడ్డి నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014లో తెలంగాణ అసెంబ్లీలో తొలి ప్రతిపక్ష నేత అయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి ఓడిపోయారు, 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా విఫలమయ్యారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి పోటీపడే అవకాశం ఉందని జానారెడ్డి వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. రేవంత్ ను కాదని జనాకు సీఎం కుర్చీ కట్టబెడితే ఇతర నేతలు, కార్యకర్తలు ఊరుకుంటారా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

Also Read: KTR On Pravalika Suicide : ప్రవళిక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం – కేటీఆర్ ప్రకటన