Site icon HashtagU Telugu

CID Searches at Bharti Cements : భారతి సిమెంట్స్‌పై సీఐడీ సోదాలు.. లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు

Bharathi Office

Bharathi Office

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌(AP Liquor Case)కు సంబంధించి కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు వద్ద ఈ సోదాలు కొనసాగాయి. సోదాల్లో కీలక డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు, లిక్కర్ స్కామ్‌కు భారతి సిమెంట్స్ కేంద్రంగా పని చేశిందన్న అనుమానాలతో విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప ఈ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా హైదరాబాదులోని ఆరు లొకేషన్లకు భారతి సిమెంట్స్ నుండి ముడుపులు తరలించబడినట్లు గుర్తించారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశాలు కూడా ఇదే ఆఫీసులో జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ సమావేశాల అనంతరం ముడుపులు నేరుగా భారతి సిమెంట్స్ ద్వారా ఇచ్చారని స్పష్టం చేశారు. బాలాజీ గోవిందప్ప మద్యం సరఫరాదారుల నుండి నెలవారీగా రూ. 50 నుండి 60 కోట్ల ముడుపులు సేకరించే వ్యవస్థను రూపొందించారని SIT పేర్కొంది.

Bank OTP, Mails : బ్యాంకు లావాదేవీల్లో ఈ మెయిల్, మొబైల్ ఓటీపీలు అథెంటికేషన్ బంద్.. ఎక్కడంటే?

ఈ ముడుపులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయ్ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులకు చేరాయని అధికారులు వెల్లడించారు. బాలాజీ తన ఆర్థిక నైపుణ్యంతో ఈ నిధులను షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ షెల్ కంపెనీలు కేవలం కాగితాలపై మాత్రమే ఉండేవి. ముడుపులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీటిని ఉపయోగించినట్లు SIT తెలిపింది. అనంతరం ఈ నిధులను హవాలా మార్గంలో, బంగారం కొనుగోళ్ల ద్వారా మనీలాండరింగ్ చేశారని సీఐడీ గుర్తించింది.

వైఎస్ జగన్ సతీమణి భారతి తరపున బాలాజీ గోవిందప్ప ఆర్థిక లావాదేవీలను నిర్వహించారని SIT రిమాండ్ రిపోర్ట్‌ చెబుతోంది. ఆయన పూర్తికాలిక డైరెక్టర్‌గా భారతి సిమెంట్స్‌లో పని చేసి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారని తెలిపింది. మే 13న కర్ణాటకలోని బీఆర్ హిల్స్ ప్రాంతంలోని వెల్‌నెస్ సెంటర్‌లో బాలాజీని SIT అరెస్ట్ చేసింది. ఆయన సమన్లను పట్టించుకోకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. భారతి సిమెంట్స్‌లోకి లిక్కర్ స్కామ్ నిధులు చొరబడినట్లు తేలడంతో కంపెనీపై సీఐడీ దృష్టి కేంద్రీకరించబడింది.

Exit mobile version