పోలీస్ స్టేషన్(Police Station ) కు వెళ్తే న్యాయం జరుగుతుందని సామాన్య ప్రజలు భావిస్తారు..కానీ ఓ మహిళా కు న్యాయం కు బదులు దౌర్జన్యం జరిగింది. ఈ ఘటన బోధన్ (Bodhan ) లో జరిగింది. పర్స్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు సాయం చేయాల్సిందిపోయి ఆమెపై కర్కశంగా వ్యవహరించాడు సీఐ విజయ్ బాబు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ భాగ్య (Boya Bhagya) అనే మహిళ తన కుమారుడితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లింది. తన కొడుక్కి ఆటబొమ్మలు కొనిచ్చే సమయంలో తన పర్సు పోయిందని భాగ్య గుర్తించింది. వెంటనే అక్కడే జాతరలో కనిపించిన కానిస్టేబుళ్లకు పర్సు పోయిన విషయాన్నీ తెలిపింది. వెంటనే వారు కాసేపు వెతికారు.. కానీ ఎక్కడా పర్సు దొరకలేదు. అదే సమయంలో బ్రహ్మోత్సవాల డ్యూటీకి వచ్చి ఔట్‌పోస్టులో ఉన్న బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు (CI Vijay Babu) దగ్గరకు భాగ్య వెళ్లి జరిగిన విషయం చెప్పింది. తన పర్సులో రూ.300, ఇంటి తాళం ఉన్నాయని తెలిపింది. కానీ ఆమెకు సాయం చేయాల్సిందిపోయి సీఐ కర్కశంగా వ్యవహరించాడు. ఫిర్యాదు చేసిన మహిళను దూషిస్తూ.. అనవసరంగా రాద్దాంతం చేస్తావా అంటూ లాఠీతో మహిళ అనే కనికరం చూడకుండా విచక్షణారహితంగా చితకబాదాడు. దీనిపై ఆమె ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.