Chinna Jeeyar Swamy : రాజ‌కీయ ‘జాత‌ర‌’లో జీయ‌ర్

త్రిదండి చిన జీయ‌ర్ స్వామి రాజ‌కీయ వ‌ర్గాల‌కు కేంద్ర బిందువుగా మారాడు. ఆయ‌న చేసిన ప్ర‌వ‌చ‌నాల పాత వీడియోల‌ను త‌వ్వుతున్నారు.

  • Written By:
  • Updated On - March 16, 2022 / 04:13 PM IST

త్రిదండి చిన జీయ‌ర్ స్వామి రాజ‌కీయ వ‌ర్గాల‌కు కేంద్ర బిందువుగా మారాడు. ఆయ‌న చేసిన ప్ర‌వ‌చ‌నాల పాత వీడియోల‌ను త‌వ్వుతున్నారు. ఆ క్ర‌మంలోనే స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర‌పై జీయ‌ర్ చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆ వీడియో రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపుతోంది.ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి రాష్ట్ర పండుగగా స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర ను తెలంగాణ స‌ర్కార్ నిర్వ‌హిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో జాత‌ర‌కు హాజ‌ర‌వుతారు. గిరిజ‌న జాత‌ర‌గా తొలుత గుర్తింపు ఉన్న‌ప్ప‌టికీ క్ర‌మంగా గిరిజ‌నేతరులు, పలు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ల‌ను కొలుస్తున్నారు. ప్ర‌తి ఏడాది భ‌క్తుల సంఖ్య పెరుగుతోంది. ఆ అమ్మ‌వారి కరుణాక‌టాక్షాల కోసం బ‌డా వ్యాపారులు, రాజ‌కీయ‌వేత్త‌లు జాత‌రకు హాజ‌రవుతారు. గ‌వ‌ర్న‌ర్, సీఎం, మంత్రులు దాదాపు ఆ జాత‌ర‌కు వెళ‌తారు. నిలువెత్తు బంగారంతో తులాభారం తూగుతూ మొక్కులు చెల్లించుకుంటారు. గిరిజ‌న దేవ‌త‌లుగా పేరుగాంచిన సామ్మ‌క్క‌-సార‌ల‌మ్మ భ‌క్తులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉంటారు. అంత‌టి ప్రాముఖ్య‌త ఉన్న దేవ‌తల‌పై జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాద‌స్పం అయ్యాయి.

స‌మ్మ‌క్క-సార‌ల‌మ్మ‌ల‌ను అడ‌వి దేవ‌త‌లుగా జీయ‌ర్ అభివ‌ర్ణించ‌డాన్ని భ‌క్తులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పైగా ఆ జాత‌రను వ్యాపార కోణం నుంచి చూస్తూ ఆయన చేసిన వ్యాఖ్య‌లు భ‌క్తుల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తున్నాయి. బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌కు గిరిజ‌న నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌త్యేకించి ఎమ్మెల్యే సీత‌క్క మీడియా ద్వారా జీయ‌ర్ ను నిల‌దీస్తోంది. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే, గిరిజనుల ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తోంది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు సీఎం కేసీఆర్ బాధ్య‌త వ‌హించాల‌ని రాజ‌కీయంగా మెలిక పెట్టింది. ఫ‌లితంగా జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య రాజ‌కీయాన్ని రాజేస్తున్నాయి.తెలంగాణ ప్ర‌భుత్వాన్ని జీయ‌ర్ ప‌రోక్షంగా న‌డిస్తున్నాడ‌ని ప‌లు సంద‌ర్భాల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంద‌ర్భాల్లు ఉన్నాయి. దానికి బ‌లం చేకూరేలా కేసీఆర్, జీయ‌ర్ న‌డత కూడా ఉంది. సీఎం కేసీఆర్ చేస్తోన్న యాగాలు, హోమాల వెనుక జీయ‌ర్ ఉన్నాడ‌ని ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌. 2014వ ఏడాది సీఎం అయిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ చేసిన యాగాలు, హోమాలు జీయ‌ర్ సూచ‌న మేర‌కు జ‌రిగాయ‌ని భావిస్తుంటారు. యాదాద్రి పున‌ర్నిర్మాణంలోనూ జీయ‌ర్ ప్ర‌మేయం ప్ర‌త్య‌క్షంగా ఉంది. ఇద్ద‌రూ క‌లిసి ప‌లుమార్లు యాదాద్రి దేవాల‌య నిర్మాణ పనుల‌ను స‌మీక్షించారు. అంతేకాదు, జీయ‌ర్ ఆశ్ర‌మానికి త‌క్కువ ధ‌ర‌కు భూముల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కేటాయించాడు. ఇవ‌న్నీ కేసీఆర్‌, జీయ‌ర్ కు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిద‌ర్శ‌నంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌లు చెబుతుంటారు.

Also Read : ‘ముచ్చింతల్’ కోట ర‌హ‌స్యం!

తాజాగా ముచ్చింత‌ల్ స‌మ‌తామూర్తి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ పెరిగింది.స‌రిగ్గా ఆ టైంలోనే స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర‌పై జీయ‌ర్ చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల వీడియో బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం. పైగా విగ్ర‌హావిష్క‌ర‌ణ ముందు రోజు మాంసాహారుల గురించి జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ఏ మాంసం తింటే ఆ జంతువులాగా మ‌నుషులు వ్య‌వ‌హ‌రిస్తారంటూ జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దం అయ్యాయి. దానిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా జీయ‌ర్ భ‌క్తులు వ‌ర్సెస్ మాంసాహారుల మ‌ధ్య కొన్ని రోజులు వార్ న‌డిచింది. ఆ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌కుండానే ఇప్పుడు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర పై చేసిన అనుచిత‌ ప్ర‌వ‌చ‌నం బ‌య‌ట‌కు వ‌చ్చింది. జీయ‌ర్, ఆయ‌న ఆశ్ర‌మం త‌ర‌చూ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ఆయ‌న ప్ర‌వ‌చ‌నాలు కూడా రాజ‌కీయాల‌కు ఆజ్యం పోస్తున్నాయి. ప్ర‌స్తుతం యాదాద్రి ప్రారంభానికి కూడా జీయ‌ర్ ను కేసీఆర్ దూరంగా పెట్టాడు. ఇలాంటి స‌మ‌యంలో వివాదాల్లోకి వెళ్లిన జీయ‌ర్ ను కాపాడెదెవ‌రు? గిరిజ‌నుల‌కు క్ష‌మాప‌ణ చెబుతాడా? గులాబీ శ్రేణులు కూడా జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డ‌తారా? అనేది ఆస‌క్తిక‌రం. లేదంటే, జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు కేసీఆర్ కి చుట్టుకునే అవ‌కాశం లేక‌పోలేదు. ప్ర‌త్యేకించి కాంగ్రెస్ పార్టీ జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ధాన రాజ‌కీయ అస్త్రంగా కేసీఆర్ పై విస‌ర‌డానికి సిద్ధం అయింది. ఆ క్ర‌మంలో కేసీఆర్ అండ కోసం జీయ‌ర్ వెళ‌తాడా? మ‌ళ్లీ ఇద్ద‌రూ ఒక‌ట‌య్యే అవ‌కాశం ఈ వివాదం ద్వారానే వ‌స్తుందా? అనేది చూడాలి.