Chinna Jeeyar Swamy : డామిట్‌! క‌థ అడ్డగోలు.!

గ్ర‌హ‌స్థితి బాగా లేక‌పోతే తాడు కూడా పామై కాటేస్తుంద‌ని ఆధ్యాత్మిక‌వేత్త‌ల సామెత‌. అలాంటిదే ఇప్పుడు త్రిదండి చిన జీయ‌ర్ స్వామి విష‌యంలో న‌డుస్తోంది.

  • Written By:
  • Updated On - March 19, 2022 / 03:46 PM IST

గ్ర‌హ‌స్థితి బాగా లేక‌పోతే తాడు కూడా పామై కాటేస్తుంద‌ని ఆధ్యాత్మిక‌వేత్త‌ల సామెత‌. అలాంటిదే ఇప్పుడు త్రిదండి చిన జీయ‌ర్ స్వామి విష‌యంలో న‌డుస్తోంది. ఆయ‌న‌కు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని తెలియ‌గానే జీయ‌ర్ పై ప‌లువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏకంగా ప్ర‌ముఖ నిర్మాత అశ్వ‌నీద‌త్ ఒక ప్రైవేటు ఛాన‌ల్ లో అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు జీయ‌ర్ పై చేయ‌డం విడ్డూరం. “వాడో వెధ‌వ బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే వెధ‌వ మూడు నామాలు పెట్టుకుని మోసం చేస్తున్నాడు..` అంటూ విన‌రాని మాట‌లు జీయ‌ర్ గురించి మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. ఆ ఛాన‌ల్ నిర్వ‌హ‌కుడు కూడా ఆ వ్యాఖ్య‌ల‌ను ఏ మాత్రం బీఫ్ చేయ‌కుండా యూ ట్యూబ్ లో పెట్టుకుని వైరల్ చేయ‌డం శోచ‌నీయం. అదే వీడియోలో జూప‌ల్లి రామేశ్వ‌రరావు పేరు ఎత్తకుండా ఏదో ఒక రోజు వాళ్లిద్ద‌రి మ‌ధ్యా వ్యాపారలావాదేవీల తేడా వ‌స్తుంద‌ని అశ్వ‌నీద‌త్ జోస్యం చెప్పాడు. ఆ రోజున ఆశ్ర‌మం కేంద్రంగా ఏమి జరుగుతుందో..బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ద‌త్ ముక్తాయిడం భ‌క్తుల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది.విశాఖ పీఠం అధిప‌తి స్వామి ప‌రిపూర్ణ‌నంద కూడా మేడారం జాతరపై చిన జీయర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. జాతరపై పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేసుంటారని ప‌రోక్షంగా దుయ్య‌బ‌ట్టాడు. సమ్మక్క-సారలమ్మ సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపులే అన్నారు. ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ది చెందిందన్నాడు. అద్వైతం తెలియ‌కుండా జాత‌ర గురించి మాట్లాడొద్ద‌ని జీయ‌ర్ కు చుర‌క‌లేశాడు. దీంతో హిందూ స్వామిజీలుగా ఎక్కువ ఫోక‌స్ అవుతున్న జీయ‌ర్, ప‌రిపూర్ణ‌నంద మధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైయింది. ఆధ్యాత్మిక‌వేత్త భ‌గ‌వ‌తీ మ‌హారాజ్ తొలి నుంచి జీయ‌ర్‌, చాగంటి, గ‌రిక‌పాటి త‌దిత‌రుల ప్ర‌వ‌చ‌నాల‌ను త‌ప్పుబడుతుంటాడు. తాజాగా స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ పై జీయ‌ర్ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల వీడియోను విన్న త‌రువాత‌ భ‌గ‌వ‌తీ మ‌హారాజ్ త‌న‌దైన శైలిలో త్రిదండి చిన జీయర్ ను తూల‌నాడాడు.

2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ‌డానికి ముందు వ‌ర‌కు జీయ‌ర్ కు ఇచ్చే ప్రాధాన్యత‌ను పరిపూర్ణానంద‌కు కూడా ఇంచుమించు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే వాడు. స‌తీస‌మేతంగా వెళ్లి ప‌రిపూర్ణానంద‌కు సాష్టాంగ దండ ప్రమాణాలు పెట్టిన‌ దృష్టాంతాలు అనేకం. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత సినీ క్రిటిక్‌, విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ ఒక ప్రైవేటు ఛాన‌ల్ లో శ్రీరాముడు స్త్రీలోలుడు అంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ఆ సంద‌ర్భంగా క‌త్తి మ‌హేష్‌, స్వామి ప‌రిపూర్ణానంద మ‌ధ్య మ‌రో ప్రైవేటు ఛాన‌ల్ వేదిక‌గా ఆధ్యాత్మిక యుద్ధం జ‌రిగింది. ఆ రోజు నుంచి క‌త్తి మహేష్ పై హిందూ సంస్థ‌ల‌తో క‌లిసి ఆనాడు ప‌రిపూర్ణానంద‌ పోరాటం చేశాడు. ఆ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఏర్ప‌డిన మ‌త విద్వేషాల వాతావ‌ర‌ణాన్ని చ‌ల్ల‌బ‌ర్చ‌డానికి క‌త్తి మ‌హేష్ పై బ‌హిష్క‌ర‌ణ వేటు కేసీఆర్ స‌ర్కార్ వేసింది. అదే స‌మయంలో హిందూ వాదానికి అనుకూలంగా ఒక ర్యాలీని నిర్వ‌హించాల‌ని అప్ప‌ట్లో ప‌రిపూర్ణానంద ప్ర‌య‌త్నం చేశాడు. ఆయ‌న‌పై కూడా హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు ప‌డింది. అప్ప‌టి నుంచి కేసీఆర్‌, ప‌రిపూర్ణానంద మ‌ధ్య ఆధ్యాత్మిక సంబంధాలు క‌ట్ అయ్యాయ‌ని తెలుస్తోంది.బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప‌రిపూర్ణానంద తొలుత తెలంగాణ రాష్ట్రంపై గురి పెట్టాడు. విఫలం చెంద‌డంతో ఏపీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఆయ‌న్ను ఇప్పుడు ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌న క‌ర్త‌గా కంటే రాజ‌కీయ ప‌క్షానికి చెందిన లీడ‌ర్ గా విశ్వ‌సిస్తోన్న భ‌క్తులు ఎక్కువ‌గా ఉన్నారు. ప్ర‌వ‌చ‌నాల‌కు కూడా ఇటీవ‌ల ఆయ‌న దూరంగా ఉంటున్నాడు. కానీ, మేడారం జాత‌ర‌పై జీయ‌ర్ వ్యాఖ్య‌ల దుమారం త‌రువాత సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జీయ‌ర్ పై ఒక ర‌కంగా ఆధ్యాత్మిక యుద్ధాన్ని ప్ర‌క‌టించిన‌ట్టు ఆయ‌న వ్యాఖ్య‌ల ఆంత‌ర్యం క‌నిపిస్తోంది. కొంద‌రు స్వాముల‌తో పాటు జీయ‌ర్ ఆశ్ర‌మ లావాదేవీల‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ , ఎమ్మెల్యే సీత‌క్క‌, ఆదివాసీ గిరిజ‌న సంక్షేమ ప‌రిష‌త్ మీడియాకు ఎక్కారు. క్షేత్రస్థాయి పోరాటానికి కూడా దిగాల‌ని ప్ర‌ణాళిక‌ను ర‌చిస్తున్నార‌ని తెలిసింది.

రాష్ట్ర విడిపోయిన త‌రువాత కేసీఆర్, జీయ‌ర్ మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింది. విజ‌య‌వాడ‌, గుంటూరు కేంద్రంగా చేసే ఆశ్ర‌మ క్ర‌తువుల‌ను హైద‌రాబాద్ కేంద్రంగా జీయ‌ర్ నిర్వ‌హిస్తున్నాడు. అందుకే, తెలంగాణ ప్ర‌భుత్వం ఆశ్ర‌మం కోసం సుమారు మూడెక‌రాల భూమిని చాలా త‌క్క‌వ ధ‌ర‌కు కేటాయించింది. సీఎం కేసీఆర్ స‌హ‌చ‌ర మంత్రులు, ఇత‌ర కీల‌క లీడ‌ర్లు కూడా జీయ‌ర్ ఆశ్ర‌మం పంచ‌న చేరారు. ఒక వైపు బీజేపీ అగ్ర నేత‌లు ఇంకో వైపు టీఆర్ఎస్ కోట‌రీ జీయ‌ర్ ఆశ్ర‌మ నీడ‌న ఉంది. ఫ‌లితంగా జీయ‌ర్ ప‌లుకుబ‌డి అమాంతం ఇటీవల పెరిగింది. ఆ ప‌రిణామం జీయ‌ర్ ప్ర‌త్య‌ర్థులుగా ఉండే స్వాముల‌కు కంట‌గింపు స‌హ‌జంగా క‌లిగించింది. ఆ ఆక్రోశాన్ని ఇప్పుడు తీర్పుకోవ‌డానికి అవ‌కాశం క‌లిగింది. ఎందుకంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ , జీయ‌ర్ మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయ‌ని మీడియా కోడై కూస్తోంది.అంతేకాదు, ప్ర‌ముఖ సినీ నిర్మాత అశ్వ‌నీద‌త్ కూడా వాళ్ల బాట‌న న‌డుస్తున్నాడు. జీయ‌ర్ చుట్టూ ప్ర‌త్య‌ర్థులు సాలెగూడును అల్లేస్తున్నార‌ని తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే స్ప‌ష్టం అవుతోంది.జీయ‌ర్ ఎపిసోడ్ లోకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడును కూడా లేగేశారు. సీఎంగా ఉన్న రోజుల్లో ఆశ్ర‌మానికి ప‌లుమార్లు ఆహ్వానించినన్ప‌టికీ బాబు వెళ్ల‌లేద‌ని ద‌త్ చెబుతున్నాడు. జీయ‌ర్ సినిమా బ్లాక్ టిక్కెట్ల వ్య‌వ‌హారం తెలుసుగాబ‌ట్టే వెళ్ల‌లేద‌ని కూడా వెల్ల‌డించాడు. స్వామీజీల‌ను న‌మ్ముకోవ‌డం కంటే ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే భాగ్య‌మంటూ బాబు అన్నాడ‌ని ద‌త్ గుర్తు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇలా ప‌లు ర‌కాలుగా ఆరోప‌ణ‌లు చుట్టుముడుతుండ‌గా జీయ‌ర్ ప్ర‌వ‌చ‌న మ‌రో వీడియో తాజాగా వెలుగు చూసింది. ప‌ర‌మ శివుడు రావ‌ణాసుడికి ఫ్రెండ్ అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వీడియో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది. వైష్ణ‌వ సంప్ర‌దాయాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన జీయ‌ర్ చేసిన శైవ వ్య‌తిరేక ప్ర‌వ‌చ‌న వీడియో తాజాగా సంచ‌ల‌నం రేపుతోంది. ఇలాంటి వాట‌న్నింటికీ ఫుల్ స్టాప్ పెట్ట‌డానికి నేరుగా మీడియా ముందుకు జీయ‌ర్ వ‌చ్చాడు. మేడారం జాత‌ర వీడియోలోని అంశాల‌ను ప్ర‌స్తావించాడు.

ఆదివాసి దేవతలను తులనాడినట్లు చేస్తున్న ప్రచారం నిజం కాదని చినజీయర్ స్వామి ఖండించాడు. పూర్వాపరాలు చూడకుండా..మధ్యలో మాట్లాడిన కొన్ని అంశాలను తీసుకొని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నార‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని విమర్శించాడు. సమతామూర్తి విగ్రహం నిర్వహణ కోసం టికెట్ పెట్టామే తప్ప.. పూజలు, ప్రసాదాలకు కాదని స్పష్టం చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో నేకాదు …తమకు ఎవరితోనూ గ్యాప్స్ ఉండవని తెలిపాడు. కావాలని అవ‌త‌లి వాళ్లు పెట్టుకుంటే ఏం చేయలేమని ప‌రోక్షంగా కేసీఆర్ వాల‌కాన్ని వెల్ల‌డించాడు. కావాలని ఎవరినీ ఏదీ అడగమ‌ని..పిలిస్తే వెళ్తాం లేదంటే చూసి ఆనందిస్తామని ప‌రోక్షంగా యాదాద్రి ఆహ్వానం లేక‌పోవ‌డంపై జీయ‌ర్ స్పందించాడు. మొత్తం మీద త్రిదండి చిన జీయ‌ర్ స్వామిపై ఒక్క‌సారిగా రాజకీయ‌, ఆధ్యాత్మిక `దండు` చేస్తోన్న పోరాటం అస్ట్రాల‌జిస్ట్ లు చెబుతోన్న‌ గ్ర‌హ‌స్థితిని గుర్తు చేస్తోంది. తాడే పామై క‌రుస్తున్న సామెత‌లాగా జీయ‌ర్ గ్ర‌హ‌స్థితి ఉంద‌న‌డంలో త‌ప్పులేదేమో.!