Chinna Jeeyar: మౌనం వీడిన జీయర్.. కేసీఆర్ తో విభేదాలపై క్లారిటీ!

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వచ్చిన విభేదాలపై ఎట్టకేలకు మౌనం వీడారు చిన జీయర్ స్వామి.

  • Written By:
  • Updated On - February 19, 2022 / 12:02 PM IST

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వచ్చిన విభేదాలపై ఎట్టకేలకు మౌనం వీడారు చిన జీయర్ స్వామి. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో సమానత్వ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి చిన జీయర్ స్వామి, కేసీఆర్ మధ్య విభేదాలు తలెత్తాయని టీఆర్‌ఎస్, రాజకీయ, మీడియా వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ దూరంగా ఉండడమే కాకుండా చిన జీయర్ స్వామి వద్ద జరిగే ప్రధాని కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు.

స్వామి తన ప్రసంగంలో మోడీని శ్రీరాముడితో పోల్చడంతో స్వామిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వామి వ్యాఖ్య బీజేపీకి మేలు చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో స్వామి తన వ్యాఖ్యలతో మోదీకి, బీజేపీకి సాయం చేయడం కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. ఇటీవల స్వామివారి ఆశ్రమాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు, కేసీఆర్‌ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు, అయితే కేసీఆర్‌ ఆశ్రమానికి రాలేదు.

తాజాగా జీయర్ స్వామి కేసీఆర్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇదంతా మీడియా సృష్టి మాత్రమేనని స్పష్టం చేశారు. ఆరోగ్యం లేదా పరిపాలనా కారణాల వల్ల ఆశ్రమంలో జరిగే ప్రధాని, రాష్ట్రపతి కార్యక్రమాలకు కేసీఆర్ హాజరు కాకపోవచ్చునని, అంతకుమించి ఏమీ లేదని స్వామి అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, రాజకీయాల ప్రాతిపదికన తమ ఆశ్రమంలో అధికార పార్టీలు, ప్రతిపక్షాలు అనే వివక్ష లేదన్నారు. ఫిబ్రవరి 5 నుంచి జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ అన్ని విధాలా సహకరించారని స్వామి తెలిపారు.