Chinna Jeeyar Swamy : వివాదాస్ప‌ద వీడియో పై.. చిన‌జీయ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు..!

  • Written By:
  • Updated On - March 18, 2022 / 06:58 PM IST

వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో తాజాగా షోష‌ల్ మీడియాలో ఎవ‌రో పోస్ట్ చేయ‌డంతో తెలంగాణ‌లో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినందుకు చినజీయ‌ర్ స్వామి వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని తెలంగాణ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో చిన‌జీయ‌ర్ స్వామి దిష్టి బొమ్మ‌లు త‌గ‌ల‌బెడుతూ, ఆయ‌న‌ వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే తాజాగా సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చిన‌జీయ‌ర్ స్వామి వివరణ ఇచ్చారు. రెండు మూడు రోజులుగా వివాదాలు తలెత్తాయని, అది సబబా కాదా అన్నది విన్నవాళ్లకే వదిలేస్తున్నానని చిన‌జీయ‌ర్ స్వామి అన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వివాదం ఎందుకు చేస్తున్నారో త‌న‌కు అర్ధం కావ‌డంలేద‌న్నారు. ఇక కావాల‌నే కొంతమంది పనిగట్టుకుని రాద్దాంతం చేస్తున్నార,మహిళలను కించపరిచే పద్దతి తమది కాదని, మహిళలను చిన్నచూపు చూసే పద్దతిని తాము ప్రోత్సహించమని పేర్కొన్నారు.

ఇక గ్రామ దేవతలు మనుషుల్లో నుంచే వచ్చారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. గ్రామ దేవతలను తూలాడినట్లు ఆరోపణలు వస్తున్నాయని, దురుద్దేశపూర్వకంగా తామెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు చిన్న‌జీయ‌ర్. తన కామెంట్లపై మాట్లాడేవారు పూర్వపరాలు చూడాలని,. అందరినీ గౌరవించాలనేదే తమ విధానమని, తన వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి తప్పు పట్టడం క‌రెక్ట్ కాద‌న్నారు. సామాజిక హితం మీద నిజమైన కాంక్ష ఉన్నవారైతే తనతో వచ్చి మాట్లాడాల్సింద‌ని, వేదికలపై గొంతు చించుకోవడం పబ్లిసిటీ కిందకే వస్తుందని చిన‌జీయ‌ర్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకెప్పుడూ కులం, మతం అనే పట్టింపు లేదని చినజీయర్ స్ప‌ష్టం చేశారు. ఎవరి పద్దతిలో వారు ఉండాలని,మన పద్దతిని మనం ఆరాధించుకోవాలని చిన‌జీయ‌ర్ అన్నారు. హరిజనులైనా, గిరిజనులైనా జ్ఞానంలో ఉత్తములైతే వారికి ఆరాధ్యనీయ స్థానం ఇవ్వాలని రామానుజచార్యులు వారు చెప్పారని చిన‌జీయ‌ర్ స్వామి గుర్తు చేశారు. సమతామూర్తి సందర్శన కోసం వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనడాన్ని తప్పు పట్టారు. అది దర్శనం కోసం పెట్టిన టికెట్ కాదని, ఆ ప్రాంగణ నిర్వహణ కోసమే 150 టికెట్ పెట్టామని చినీజీయ‌ర్ స్వామి తెలిపారు. సమాజ హితం కోసం అందరం కలిసిక‌ట్టుగా ప‌నిచేస్తూ అందరినీ గౌరవిద్దామని ఈ సంద‌ర్భంగా చిన‌జీయ‌ర్ స్వామి పిలుపునిచ్చారు.