Site icon HashtagU Telugu

CS Arvind Kumar : వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి – అరవింద్‌ కుమార్‌

Special Chief Secretary Arv

Special Chief Secretary Arv

ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను రెవెన్యూ (విపత్తుల నిర్వహణ శాఖ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ (CS Arvind Kumar) సందర్శించారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన, దివిటిపల్లి అమరాజా ఫ్యాక్టరీకి వెళ్లే టీజీఐఐసీ కాంప్లెక్స్ వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డు, అమిస్తాపూర్ నుంచి రామదాసు తండా మధ్య దెబ్బతిన్న రోడ్డు, మరియు పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనుల గురించి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మరియు రైల్వే, మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్షించారు. అధికారులు పునరుద్ధరణ పనుల వివరాలను ఆయనకు వివరించారు.

Samantha : మెగాఫోన్ పట్టనున్న సమంత..?

ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. వరదల వల్ల దెబ్బతిన్న మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వరద బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆయన అధికారులను కోరారు. త్వరితగతిన రోడ్ల మరమ్మత్తులు, వంతెనల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

అనంతరం అరవింద్ కుమార్ జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు. ఈ పర్యటనలో ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారిని ప్రోత్సహించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.