CM Revanth : మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె ఇంట్లోకి ఆగంతకుడు చొరబడిన ఘటనపై సీఎం ఆరా తీశారు. ఘటన జరిగిన తీరును, తనకున్న అనుమానాలను రేవంత్ రెడ్డికి(CM Revanth) ఈసందర్భంగా అరుణ వివరించారు. గతంలోనూ తమ కుటుంబంపై దాడులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. తాజా ఘటనను దృష్టిలో ఉంచుకొని తమకు భద్రత పెంచాలని కోరారు. తప్పకుండా భద్రతను పెంచుతామని అరుణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనిపై వెంటనే పోలీసు శాఖకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటుపై విచారణను వేగంగా పూర్తి చేసి, వాస్తవాలను నిగ్గు తేల్చాలని పోలీసు శాఖకు సీఎం నిర్దేశించారు. మొత్తం మీద హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ లాంటి కీలక ఏరియాలో దుండగులు హల్‌చల్ చేయడం అనేది కలవర పెట్టే విషయమే. మొత్తం ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీని జల్లెడపట్టి దుండగుడిని పట్టుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read :Sunita Williams Salary: 9 నెలలుగా స్పేస్‌లోనే సునిత.. ఎక్స్‌ట్రా శాలరీ ఎంత ?
అసలేమైంది ?
- హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న రోడ్ నంబర్ 56లో డీకే అరుణ నివాసం ఉంది.
- ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడ్డాడు.
- దాదాపు గంటన్నర పాటు ఇంట్లో తిరిగాడు. డీకే అరుణ ఉండే గది వరకు వెళ్లాడు.
- కిచెన్, డైనింగ్ హాల్‌లో ఉన్న సీసీ కెమెరాల కనెక్షన్‌ను కట్ చేశాడు.
- గంటన్నర పాటు ఇంట్లోనే తిరిగినా.. ఈ దుండగుడు అరుణ ఇంట్లోని ఏ వస్తువును కూడా దొంగిలించకపోవడం గమనార్హం.
- సీసీ కెమెరా ఫుటేజీ ప్రకారం.. ఆ దుండగుడు చేతులకు గ్లౌజులు వేసుకొని, ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడు. పూర్తి జాగ్రత్త చర్యలతో అతడు ఇంట్లోకి చొరబడినట్లు తెలుస్తోంది.
- దుండగుడు ఇంట్లోకి చొరబడిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు.
- ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.