Honey Trap : సాధారణంగా మనుషులను ట్రాప్ చేసే ‘హనీ ట్రాప్’ గురించి వింటుంటాం, కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ వింత చోరీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా నేరగాళ్లు హనీ ట్రాప్ పేరుతో మనుషులను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకోవడం చూస్తుంటాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేత్యాతండాలో మాత్రం దొంగలు తమ తెలివితేటలను మూగజీవాల మీద ప్రయోగించారు. ఒక రైతు కష్టపడి పెంచుకుంటున్న కోడిపుంజును ఎత్తుకెళ్లడానికి వారు ఒక కోడిపెట్టను ఎరగా వాడటం ఇక్కడ విశేషం. కేవలం మనుషులకే కాదు, పక్షులకు కూడా బలహీనతలు ఉంటాయని గ్రహించిన ఈ కిలాడీ దొంగలు, అత్యంత నేర్పుతో ఈ చోరీకి పాల్పడ్డారు.
స్థానిక రైతు లకావత్ జేత్రమ్ తన వద్ద మూడు పుంజులను, ఒక పెట్టను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు. వీటిపై కన్నేసిన ఇద్దరు వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారం బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న ఒక ఆడ కోడిని (పెట్టను) పుంజులకు చూపించి ఎర వేశారు. ఆ పెట్టను చూడగానే జేత్రమ్ వద్ద ఉన్న పుంజులు దాని వైపు ఆకర్షితమై దగ్గరకు వచ్చాయి. పుంజులు తమకు అందుబాటులోకి రాగానే, క్షణాల్లో వాటిని పట్టుకుని ఆ దొంగలు బైక్‌పై అక్కడి నుండి పరారయ్యారు. కళ్లముందే పుంజును ఎత్తుకెళ్లడంతో ఆ రైతు విస్తుపోయాడు.
తమ జీవనోపాధిగా ఉన్న కోడిని కోల్పోయిన జేత్రమ్ వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చూస్తుంటే దొంగలు ఎంతటి ‘క్రియేటివ్’గా ఆలోచిస్తున్నారో అర్థమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల దొంగతనాలు సాధారణమే అయినా, ఇలా ఒక పద్ధతి ప్రకారం కోడిపెట్టను తెచ్చి పుంజును ఎత్తుకెళ్లడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. “వీళ్లు మామూలు కిలాడీలు కాదు బాబోయ్” అంటూ జనం నవ్వుకుంటున్నారు. అయితే రైతులకు మాత్రం ఇది ఒక హెచ్చరికగా మారింది, తమ పశువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన గుర్తుచేస్తోంది.
