రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూరు డిపోకు చెందిన బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా బస్సు కుడివైపుని భాగం ఆనవాళ్లు లేకుండా పోయింది. టన్నుల కొద్దీ బరువున్న కంకర టిప్పర్ బస్సుపై పడటంతో ప్రయాణికులు దాని కింద ఇరుక్కుపోయారు. వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి జేసీబీల సాయంతో టిప్పర్ను బస్సుపై నుంచి తొలగించి చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Shani: శని ప్రభావం వద్దని అనుకుంటున్నారా.. అయితే అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లే!
ఈ ఘటన పలు కుటుంబాల్లో కన్నీటి మడుగులు మిగిల్చింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ దుర్మరణం పాలవ్వగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారి ముగ్గురు చిన్నారులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. తల్లి మృతదేహం పక్కనే చిన్నారులు ఏడుస్తూ కనిపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మరోవైపు తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆ పిల్లలు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ దృశ్యం హృదయ విదారకంగా మారి, అక్కడి ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు.
ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ అతివేగమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికుడు వినయ్ మాట్లాడుతూ, “బస్సు నిండుగా ఉంది. కొందరు నిలబడి ఉన్నారు. మీర్జాగూడ వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. కుడివైపు ఉన్న మొదటి ఆరు సీట్ల వరకు లోపలికి చొచ్చుకొచ్చింది. అందులో ఉన్నవారంతా కంకర కింద కూరుకుపోయారు. నేను వెనుక కూర్చున్నాను కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను” అని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రహదారులపై అతివేగం, నిర్లక్ష్యం ఎంత భయానక పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మళ్లీ రుజువు చేసింది.
