హైదరాబాద్ (Hyderabad) నగరంలో రైల్వే ట్రాఫిక్‌ను తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ (Charlapalli Railway Station)ను అభివృద్ధి చేసినా, రవాణా సౌకర్యాల కొరతతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల రద్దీ తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు మార్చారు. అయితే, అక్కడికి చేరేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సరిగా లేని పరిస్థితిలో, ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల రైల్వే టికెట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ప్రయాణ ఖర్చు అవుతుండటంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చర్లపల్లి టెర్మినల్‌లో మంచి సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, వాటి గురించి చాలామందికి అవగాహన లేదు. పదో నెంబర్ ప్లాట్‌ఫాం వైపు విశాలమైన పార్కింగ్, బస్సు టెర్మినల్ ఉన్నా, ప్రయాణికులు ఎక్కువగా మొదటి ప్లాట్‌ఫాం వైపు గుమికూడుతున్నారు. చెంగిచెర్ల, ఉప్పల్ రింగ్ రోడ్ లాంటి ప్రాంతాల నుండి బస్సు కనెక్టివిటీ పెంచితే ప్రయాణికులకు సౌలభ్యం కలుగుతుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 250C బస్సు సర్వీసు గురించి కూడా స్పష్టమైన సమాచారం అందుబాటులో లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది.
చర్లపల్లి నుండి చెంగిచెర్ల మీదుగా ఉప్పల్ రింగ్ రోడ్డుకు బస్సులు నడిపితే మెట్రో, RTC కనెక్టివిటీ మెరుగవుతుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ రద్దీని తగ్గించడానికే ప్రధాన స్టేషన్ల నుండి కొన్ని రైళ్లను చర్లపల్లికి మళ్లిస్తున్నా, ప్రయోజనం కంటే ప్రజలకు ఇబ్బందులే ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఎంపీలు కూడా ఈ సమస్యను దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల ఆందోళనలను పరిగణలోకి తీసుకొని, చర్లపల్లి స్టేషన్‌కు మెరుగైన రవాణా వ్యవస్థ కల్పించడం, ప్రజలకు అవగాహన కల్పించడం అత్యవసరం అని స్పష్టమవుతోంది. రైల్వే అధికారుల ప్రణాళికా లోపం వల్ల కొంతకాలంగా లక్షలాది మంది ప్రయాణికులు అనవసరమైన ఖర్చుతో పాటు అసౌకర్యానికి గురవుతున్నారు.