Telangana BJP : సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బలం పెరిగిందా? ఆ రెండు సీట్లకు అభ్యర్థులు దొరికినట్టేనా?

తాజాగా బీజేపీలోకి వేములవాడ(Vemulavada), సిరిసిల్ల(Sirisilla), కరీంనగర్ ప్రాంతాల్లో ప్రముఖ డాక్టర్ అయిన చెన్నమనేని వికాస్ రావు(Chennamaneni Vikas Rao) ఆయన సతీమణి డాక్టర్ దీప చేరారు.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 09:00 PM IST

తెలంగాణ ఎలక్షన్స్(Telangana Elections) కి మరి కొన్ని నెలల సమయం ఉండగానే బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో ప్రతిపక్షాలు హడావిడి పడుతున్నాయి. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానిస్తున్నాయి. కాంగ్రెస్ లో కూడా అన్ని నియోజకవర్గాలకు అప్లికేషన్స్ బాగానే రావడంతో ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు పలువురు. బీజేపీ తమ అభ్యర్థుల్ని సెప్టెంబర్ చివర్లో ప్రకటిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. బీజేపీలో కూడా చేరికలు రోజురోజుకి పెరుగుతున్నాయి.

తాజాగా బీజేపీలోకి వేములవాడ(Vemulavada), సిరిసిల్ల(Sirisilla), కరీంనగర్ ప్రాంతాల్లో ప్రముఖ డాక్టర్ అయిన చెన్నమనేని వికాస్ రావు(Chennamaneni Vikas Rao) ఆయన సతీమణి డాక్టర్ దీప చేరారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు(Chennamaneni Vidyasagar Rao) తనయుడే చెన్నమనేని వికాస్ రావు. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఈయన నేడు బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, లక్ష్మణ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చెన్నమనేని వికాస్ రావు పార్టీకి ఇన్నిరోజులు ప్రత్యక్ష, పరోక్షంగా సేవలు అందించారు. ఆయన చిన్నప్పటి నుంచి RSSలో ఉన్నారు. వాళ్ళ నాన్న ప్రభావం కరీంనగర్, సిరిసిల్లలో బాగానే ఉంది. దీంతో వీళ్ళు బీజేపీలో చేరడంతో సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బలం చేకూరిందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరింతమంది పార్టీలో చేరతారని వ్యాఖ్యానించారు.

ఇక బీజేపీ పార్టీలో చేరడంపై చెన్నమనేని వికాస్ రావు మాట్లాడుతూ.. ఈ రోజు బీజేపీలో చేరడం నా జీవితంలో మర్చిపోలేనిది. ఇది బావోద్వేగ సంఘటన. బీజేపీకి, నాకు అవినాభావ సంబంధం ఉంది. నేను చిన్నప్పటి నుండి సంఘ్ నుండి పెరిగాను. చిన్నప్పుడే హేమాహేమీలు వాజపేయ్, అద్వానీ నీడలో పెరిగాను. కిషన్ రెడ్డి నాకు స్ఫూర్తి ఇచ్చారు. వారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం గర్వకారణం. రాబోయే రోజుల్లో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మోడీ నినాదంతో ముందుకు వెళ్తాను అన్నారు.

అయితే ప్రస్తుతం సిరిసిల్ల కేటీఆర్ అడ్డాగా ఉంది. ఇప్పుడు బీజేపీ తరపున సిరిసిల్ల నుంచి చెన్నమనేని వికాస్ రావు పోటీచేస్తారని వినిపిస్తుంది. అలాగే వేములవాడ నుంచి ఆయన సతీమణి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ప్రజల్లో మంచి డాక్టర్ గా, సీనియర్ నేత విద్యాసాగర్ రావు తనయుడిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. మరి బీజేపీకి వికాస్ రావు చేరికతో సిరిసిల్ల జిల్లాలో ఏ మాత్రం బలం చేకూరుతుందో చూడాలి.

 

Also Read : Patnam Mahender Reddy: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పట్నం, తొలి ఫైల్ పై సంతకం