Chef Yadamma: యాదమ్మ.. నీ వంటకాలు అదుర్స్ అమ్మా!

ఆమె.. నిరుపేద సామాన్యురాలు. అయితేనేం దేశ ప్రధాని మోడీకి తన చేతి వంటను రుచి చూపించబోతోంది.

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 02:00 PM IST

ఆమె.. నిరుపేద సామాన్యురాలు. అయితేనేం దేశ ప్రధాని మోడీకి తన చేతి వంటను రుచి చూపించబోతోంది. పాకశాస్ర్తంలో పేరున్న చెఫ్ లను సైతం కాదనీ, బీజేపీ నాయకులు ఏరికోరి యాదమ్మకు వంట బాధ్యతలను అప్పజెప్పారంటే ఆమె చేతి వంట ఎలా  ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది. హైదరాబాద్ వేదికగా త్వరలో బీజేపీ జాతీయ సమావేశాలు మొదలుకానున్నాయి. మోడీతో సహా అగ్రనేతలు హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో వంట బాధ్యతలన్నీ యాదమ్మే చూసుకుంటోంది.

29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్న యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్‌ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు. 10వేల మందికి కూడా ఇట్టే వండివార్చేస్తారు యాదమ్మ. మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన సమావేశాల సందర్భంగా వంటలు చేయడంతో మంచి గుర్తింపు వచ్చిందీమెకు.

‘‘మొత్తం మెనూ పూర్తిగా శాఖాహారం ఉంటుంది” బండి సంజయ్ చెప్పారు. రోటీలు కాకుండా అన్ని కూరలు, పప్పులు, చట్నీలు అచ్చమైన తెలంగాణ వంటకాలతో తయారు చేస్తామని సంజయ్ తెలిపారు. యాదమ్మ చేసిన పుంటికూర పప్పు, గంగవైలకుర, మామిడికాయ పప్పు, పచ్చి పులుసు లాంటి వంటకాలతో పాటు ‘జొన్న రొట్టెలు, ‘పెద్ద బూందీ లడ్డు’ లాంటి వంటకాలను తినే అవకాశం పార్టీ నేతలకు ఉంటుంది. సాయంత్రం ‘సకినాలు, ‘గారెలు, సరవపిండి’ స్నాక్స్‌గా వడ్డిస్తారు.