Meenakshi Natarajan: ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో కాంగ్రెస్‌లో దిద్దుబాటును మొదలుపెట్టారు. పార్టీలోని వర్గ విభేదాలకు అడ్డుకట్ట వేసి.. కాంగ్రెస్ క్యాడర్, నేతలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా ఆమె గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఈక్రమంలోనే మార్చి 4న (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్‌లో మెదక్ పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశం గాంధీ భవన్‌లో నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా మీనాక్షి నటరాజన్ పాల్గొనబోతున్నారు. ఈ సమావేశాల్లో ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలోని మంత్రులు, ఇంఛార్జి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ అధికార ప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాలలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.
Also Read :English Language: అమెరికాలో అధికారిక భాషగా ఇంగ్లిష్.. ఆంగ్లంపై ఆసక్తికర విశేషాలివీ
పార్టీ గీతను దాటితే..
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలను, పార్టీపై విమర్శలు చేసే నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. చెప్పడమే కాదు.. తీన్మార్ మల్లన్న విషయంలో ఈ దిశగా నిర్ణయాన్ని తీసుకున్నారు. మల్లన్నను కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. పార్టీ గీసిన గీతను దాటితే, ఊరుకునేది లేదనే సంకేతాలను మీనాక్షి పంపారు. ఎలాంటి వర్గపోరుకు తావు లేకుండా, కలిసికట్టుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ క్యాడర్‌ను సంసిద్ధం చేయడమే టార్గెట్‌గా ఆమె పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కాంగ్రెస్‌లో సాగుతున్న వర్గపోరుపై మీనాక్షి సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది.
Also Read :Meenakshi Chaudhary: ‘మహిళా సాధికారత’ బ్రాండ్ అంబాసిడర్‌గా హర్యానా బ్యూటీ
మార్చి 4 మీటింగ్ : గూడెం మహిపాల్, కాటా శ్రీనివాస్‌లపై ఫోకస్
మార్చి 4న (మంగళవారం) జరగనున్న మెదక్ పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశంలోనూ వర్గపోరుపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. పటాన్ చెరు కాంగ్రెస్ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పటాన్‌చెరు నుంచి గెలిచారు. అయితే కాంగ్రెస్ గెలవగానే ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. పటాన్‌చెరు అసెంబ్లీ స్థానం నుంచి గతంలో పలుమార్లు పోటీ చేసి కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయారు. అయితే మొదటి నుంచీ ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ రెండు వర్గాలను పెంచి పోషిస్తున్నారు. దీనిపై ఆ ఇద్దరు నేతలకు మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) అల్టిమేటం ఇచ్చే అవకాశం ఉంది. వర్గ విభేదాలను ఆపాలని నిర్దేశించే ఛాన్స్ ఉంది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే వారికి కాంగ్రెస్‌లో అవకాశాలు ఉంటాయని మీనాక్షి చెప్పబోతున్నారు. పటాన్ చెరు కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలపై ఇప్పటికే టీపీసీసీ అంతర్గత విచారణ జరిపించి నివేదికను తెప్పించుకుంది. దాన్ని మీనాక్షి నటరాజన్‌కు సమర్పించారు. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్‌లకు మీనాక్షి కౌన్సెలింగ్ చేయనున్నారు.