Bhatti Vikramarka: కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే చెక్ డ్యామ్ లు కొట్టుకుపోయాయి : భట్టి విక్రమార్క

కేసీఆర్ కు ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోవడం వెన్నతో పెట్టిన విద్య అని భట్టి విక్రమార్క అన్నారు.

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 12:53 PM IST

రెండు సంవత్సరాల క్రితం రూ.16 కోట్లతో నిర్మాణం చేసిన చెక్ డ్యామ్  గోదావరి వరదల్లో కొట్టుకుపోవడం నాసిరకంగా నిర్మాణం చేయడమే కారణమని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు. చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తున క్రమంలో ప్రజలు చాలాసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. నాసిరకంగా కాంట్రాక్టర్  చేసిన నిర్మాణం వల్ల  గోదావరి నదిలో చెక్ డ్యామ్ కొట్టుకుపోయి ప్రజాధనం వృధా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగులపై నిర్మించిన చెక్ డ్యామ్ లు వరదల్లో కొట్టుకుపోయాయని, 15 సంవత్సరాల కిందట నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ లను  ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన క్రమంలో చూశానని భట్టి స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పాలనల్లో వేలాది కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన చెక్ డ్యాముల వరదల్లో కొట్టుకుపోవడం వల్ల ఆ నిధులు నీళ్లలో పోసినట్టుగా అయ్యిందని భట్టి ఆరోపించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సమయాత్తం చేయకపోవడం వల్ల, వాళ్లను పాలన పరంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా అప్రమత్తం చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదల వల్ల ప్రాణనష్టం జరిగిన సంఘటనలు వెలుగు చూశాయని, తెలంగాణలో అధికార యంత్రాంగం ప్రజల కోసం పనిచేయడం వదిలి పెట్టి రాజకీయ పార్టీ కోసం పని చేసే యంత్రాంగంగా మారాయని విమర్శించారు. ఇప్పటికైనా మిగతా కార్యకలాపాలు బంద్ చేసి పాలన యంత్రాంగం  పై సమీక్ష చేయాలని భట్టి డిమాండ్ చేశారు.  వరద ప్రాంతాల్లో ముంపునకు గురవుతున్న ప్రజలకు కావలసిన సహాయక చర్యలు అందించడమే కాకుండా నివారణ కావలసిన ప్లానింగ్, ఆలోచన చేయాలని అన్నారు. ‘‘ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోవడం వెన్నతో పెట్టిన విద్య గత సంవత్సరం భద్రాచలం ముంపు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రూ. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఏడాది కావస్తున్నది. సీఎం మాటలు నీటి మూటలే తప్ప అమలుకు నోచుకోలేదు’’ అని భట్టి అన్నారు.

Also Read: Osmania Hospital: ఎట్టకేలకు మోక్షం.. ఇక ఉస్మానియా ఆస్పత్రి కూల్చుడే!