Local Body Reservations : స్థానిక సంస్థలే.. దేశానికి పట్టుకొమ్మలు. అటువంటి కీలకమైన స్థానిక సంస్థల్లో ఎన్నికల అంశంపై తెలంగాణ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన నిబంధనలలో మార్పులు చేసింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు ఒకసారి రిజర్వేషన్ ఖరారైతే.. పదేళ్ల పాటు (రెండు టర్ములు) అదే రిజర్వేషన్ కంటిన్యూ అయింది. ఇకపై ఏదైనా రిజర్వేషన్ ఖరారైతే.. అది కేవలం ఒక టర్మ్‌కే పరిమితం అవుతుంది. అంటే ప్రతీ ఐదేళ్లకోసారి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు మారిపోతాయి. ఈ మేరకు ‘పంచాయతీరాజ్చట్టం-2018’లో ప్రతిపాదించిన సవరణలకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్లకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లు మారిపోనున్నాయి.
Also Read :Formula E Car Race : రేపోమాపో కేటీఆర్‌పై కేసు.. గవర్నర్ అనుమతి వివరాలు ఏసీబీకి !
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నా ఓకే..
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని క్యాబినెట్(Local Body Reservations) నిర్ణయించింది. ఇంతకుముందు ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు పోటీ చేసేందుకు అనర్హులుగా ఉండేవారు.
ప్రతీ మండలంలో ఐదుగురు ఎంపీటీసీలు
ప్రతీ మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండేలా చట్టానికి సవరణ చేశారు. తక్కువ జనాభా ఉన్న గ్రామీణ మండలాల్లోనూ ఇకపై ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉంటారు.
ఓటరు నమోదుకు ఏడాదికి మూడు ఛాన్స్‌లు
స్థానిక సంస్థల్లో ఓటరు జాబితాలో ఓటరుగా చేరడానికి అర్హత తేదీని కూడా తెలంగాణ సర్కారు మార్చేసింది. ఇంతకుముందు ఏడాదికి ఒకసారే ఈ ఛాన్స్ ఉండేది. ఇక నుంచి ఏటా ఏప్రిల్, జులై, అక్టోబరు నెలల ఒకటవ తేదీని అర్హత తేదీగా మార్చారు.