Site icon HashtagU Telugu

TTDP : తెలంగాణ‌పై చంద్ర‌బాబు దూకుడు!ఖ‌మ్మంలో ఎన్నికల శంఖారావం

TTDP

Tdp Mahanadu

రాజ‌కీయ చాణ‌క్యుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు(CBN). ఆయ‌న సీరియ‌స్ గా తీసుకుంటే ఏదైనా చేయ‌గ‌ల‌రు అనే న‌మ్మ‌కం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. ప్ర‌త్యేకించి తెలంగాణ టీడీపీ(TTDP) లీడ‌ర్లు ఈసారి ఆయ‌న వ్యూహాల మీద ఆశ‌లు పెట్టుకున్నారు. ఈనెల 21వ తేదీన ఖ‌మ్మం నుంచి చంద్ర‌బాబు(CBN) తెలంగాణ ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించ‌బోతున్నారు. ఆ రోజున ఆయ‌న ఇచ్చే దిశానిర్దేశం రాబోవు ఎన్నిక‌ల్లో టీడీపీ దూకుడును పెంచ‌నుంది.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ(TTDP) వ్యాప్తంగా ఓట‌ర్ల‌ను క‌లిగి ఉంది. అంతేకాదు, కొన్ని చోట్ల ద్వితీయ‌శ్రేణి స్ట్రాంగ్ గా ఉంది. ఆర్థికంగా ఆదుకునే అగ్ర‌నేత‌లు లేక‌పోవ‌డంతో కొంత వెనుక‌బ‌డింది. ఈసారి ఆర్థిక ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తుత టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ స‌మ‌కూర్చుతార‌ని క్యాడ‌ర్ కు న‌మ్మ‌కం క‌లుగుతోంది. అందుకే యాక్టివ్ గా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో క‌నీసం 15 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకోవాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. ఖ‌మ్మం, న‌ల్గొండ‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఇప్ప‌టికే ఎంపిక చేసుకుంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌డం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉనికి చాటుకోవాల‌ని వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు.

బీజేపీతో పొత్తు కుదిరితే

ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీ రాజ‌కీయాలపై చంద్ర‌బాబు ఫోక‌స్ పెట్టారు. 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా వ‌దిలేశారు. ఏపీలో అధికారం కోసం మాత్ర‌మే వ్యూహాలు ర‌చించారు. అక్క‌డ సీఎంగా 2014 నుంచి 2109 వ‌ర‌కు చేశారు. ఆనాడు తెలంగాణ‌లోనూ బీజేపీ, టీడీపీ పొత్తుతో వెళ్ల‌గా 19 మంది ఎమ్మెల్యేల‌ను కూట‌మి గెలుచుకుంది. ప్ర‌స్తుతం బీజేపీ బ‌ల‌ప‌డింది. అంతేకాదు, బీఆర్ఎస్ అంటూ ప్ర‌త్యేక సెంటిమెంట్ ను కేసీఆర్ అట‌కెక్కించారు. ఇవ‌న్నీ టీడీపీకి క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. ఒక వేళ బీజేపీతో పొత్తు కుదిరితే తెలంగాణ‌లో కూట‌మి ఈజీగా అధికారంలోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

వెనుక‌బ‌డిన వ‌ర్గాలు ఆద‌రించే పార్టీగా తెలుగుదేశం పార్టీకి గుర్తింపు ఉంది. ప్ర‌త్యేకించి తెలంగాణ వ్యాప్తంగా బీసీలు తొలి నుంచి టీడీపీ ప‌క్షాన నిలిచారు. ఇప్ప‌టికీ బీసీ నేత‌లు అనేక మంది పార్టీలోనే కొన‌సాగుతున్నారు. అందుకే, బీసీల్లోని వివిధ ఉప కులాల నేత‌ల‌తో ప్ర‌స్తుత టీడీపీ తెలంగాణ చీఫ్ కాసాని స‌మ్మేళ‌నాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అనూహ్య స్పంద‌న రావ‌డాన్ని గ‌మ‌నించిన టీడీపీ జాతీయ అధినాయ‌క‌త్వం పార్టీకి మ‌రింత బూష్ట‌ప్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఆ క్ర‌మంలో చంద్ర‌బాబునాయుడు రంగంలోకి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కంచుకోట‌గా ఉన్న ఖ‌మ్మం నుంచి మ‌లిద‌శ ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించింది.

ఉత్సాహంగా శ్రేణులు

ఖ‌మ్మం వేదిక‌గా ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ జిల్లాలో ప‌లు చోట్ల ఉత్స‌వాల సంద‌డి క‌నిపిస్తోంది. ఏడాది పాటు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఉత్సాహంగా శ్రేణులు ముందుకు క‌దిలారు. ఆ సంద‌ర్భంగా మాజీ త‌మ్మల నాగేశ్వ‌ర‌రావు కూడా కొన్ని చోట్ల పాల్గొన్నారు. తిరిగి పార్టీలోకి ఆయ‌న వ‌స్తార‌ని ప్ర‌గాఢంగా న‌మ్ముతున్న వాళ్లు ఉన్నారు. ఆయ‌న‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్లు అనేక మంది లీడ‌ర్లు `ఘ‌ర్ వాప‌సీ` సూత్రాన్ని అనుక‌రిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి కోలుకోని దెబ్బ తగ‌ల‌నుంది. ఒక వేళ టీడీపీ, బీజేపీ కూట‌మి క‌డితే డ్యామ్ షూర్ గా అధికారం చేజిక్కించుకోవ‌చ్చ‌ని అంచ‌నా వేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అందుకే, చంద్ర‌బాబునాయుడు ఈసారి తెలంగాణ వ్యాప్తంగా స‌భ‌ల‌ను పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఖ‌మ్మం స‌భ‌కు వ‌చ్చే స్పంద‌న చూసిన త‌రువాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల బ‌హిరంగ స‌భ‌ల‌కు ఆయ‌న సిద్ధం అవుతున్నారు. మ‌లిద‌శ టీడీపీ ప్ర‌యాణాన్ని తెలంగాణ బీసీలతో చంద్ర‌బాబు ఎలా న‌డిపిస్తారో చూడాలి.