Site icon HashtagU Telugu

Chandrababu 1983 formula: తెలంగాణాలో `1983 ఫార్ములా` దిశ‌గా చంద్ర‌బాబు

Balu 2

Balu 2

ఎక్క‌డ త‌గ్గాలో, ఎక్క‌డ నెగ్గాలో బాగా తెలిసిన రాజ‌కీయ‌వేత్త చంద్ర‌బాబు. తెలంగాణాలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌గ్గిన చంద్ర‌బాబు భ‌విష్య‌త్ లో నెగ్గ‌డానికి ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి క‌స‌ర‌త్తు ప్రారంభించారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఫార్ములాను అనుస‌రించ‌డం ద్వారా తెలుగుదేశం జెండాను గండికోట‌పై ఎగుర‌వేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌.

ఉమ్మ‌డి ఏపీలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ 1983 లో అనుస‌రించిన వ్యూహం అనూహ్య విజ‌యాన్ని తెచ్చిపెట్టింది. ఆ ఎన్నిక‌ల్లో 125 మంది ప‌ట్ట భ‌ద్రులు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 20 మంది డాక్ట‌ర్లు, 8 మంది ఇంజ‌నీర్లు, 47 మంది లాయ‌ర్లను ఎన్నిక‌ల బ‌రిలోకి దించారు. వాళ్ల స‌గ‌టు వ‌య‌స్సు 41 సంవ‌త్స‌రాలు. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపుగా ఎవ‌రికీ పూర్వ‌పు రాజ‌కీయ నేప‌థ్యం లేదు. అయిన‌ప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో 290 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టిన టీడీపీ 201 స్థానాల‌ను గెలుచుకుంది. స‌రిగ్గా ఇలాంటి ఫార్ములాను 2023 తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌యోగించడానికి టీటీడీపీ సిద్ధం అయింద‌ని తెలుస్తోంది.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు వినూత్నంగా 1983 ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులను ఎంపిక చేశారు. అప్ప‌టి వ‌ర‌కు ఉండే మూస రాజ‌కీయాల‌కు స్వ‌స్తి పలుకుతూ విద్యావంతుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చారు. వివిధ రంగాల‌కు చెందిన నిష్ణాతుల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లారు. దీంతో ఆయ‌న అనూహ్య ఫ‌లితాల‌ను సాధించ‌గ‌లిగారు. స‌రిగ్గా అదే ఈక్వేష‌న్ ను 2023 తెలంగాణ ఎన్నిక‌ల్లో ఉప‌యోగించాల‌ని చంద్ర‌బాబు వ్యూహం ర‌చించార‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ జెండా, ఎజెండా, సింబ‌ల్ తెలంగాణ ఓట‌ర్ల‌కు బాగా ప‌రిచ‌యం. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు వేసిన అభివృద్ధి పునాదులు ఇప్పుడు క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తున్నాయి. వాటిని తెలంగాణ ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్నారు. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ కూడా ఆనాడు చంద్ర‌బాబు వేసిన ఐటీ బీజాలు ఇస్తోన్న ఫ‌లితాల గురించి చెప్పుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు వేసిన పునాదులు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి బాట‌లు వేశాయ‌ని చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో 1983 త‌ర‌హా ఫార్ములాతో తెలంగాణ రాజ‌కీయాన్ని మార్చేయాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్నార‌ట‌. ఎంత వ‌ర‌కు ఇప్పుడు ఆ ఫార్ములా ప‌నిచేస్తుందో చూద్దాం!