Chandrababu@Munugode: మునుగోడు నుంచే `బాస్ ఈజ్ బ్యాక్`

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ కీల‌కం కానుంది. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్క‌లి ఐల‌య్య అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేయ‌డానికి సిద్దం అవుతున్నారు.

  • Written By:
  • Updated On - October 12, 2022 / 12:00 PM IST

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ కీల‌కం కానుంది. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్క‌లి ఐల‌య్య అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేయ‌డానికి సిద్దం అవుతున్నారు. ఆ మేర‌కు టీడీపీ జాతీయ చీఫ్ చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. వెనుకబ‌డిన వ‌ర్గాల‌కు చెందిన ఐల‌య్య‌ను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న ప్రస్తుతం టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ప్ర‌ధాన పార్టీలు `రెడ్డి` సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇవ్వ‌గా బీసీ అభ్య‌ర్థిని టీడీపీ బ‌రిలోకి దింప‌నుంది. అంతేకాదు, ఒక‌టి, రెండు చోట్ల బ‌హిరంగ స‌భ‌లకు చంద్ర‌బాబు హాజ‌రు కావాల‌ని టీటీడీపీ నేత‌లు ఒత్తిడి తెస్తున్నార‌ని తెలిసింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ‌వాదాన్ని అందుకున్న‌ప్ప‌టి నుంచి టీటీడీపీ దూకుడు పెంచింది. వెనుక‌బడిన వ‌ర్గాల పార్టీగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు టీడీపీ సుప‌రిచ‌యం. అందుకే, ఆ బ్రాండ్ ను కాపాడుకుంటూ ముందుకెళ్లాల‌ని చంద్ర‌బాబు ఇటీవ‌ల టీటీడీపీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశార‌ట‌. అంతేకాదు, ప్ర‌తి రోజూ ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కు ఏదో ఒక టైంలో వ‌చ్చి వెళుతుంటాన‌ని బాబు ఇచ్చిన హామీ నూత‌నోత్సాహాన్ని నింపుతోంది. ఎనిమిదేళ్లుగా ఏపీ మీద మాత్ర‌మే ఎక్కువ‌గా దృష్టి పెట్టిన ఆయ‌న తెలంగాణ టీడీపీ మీద ఫోక‌స్ పెట్ట‌లేదు. ప్ర‌స్తుతం మారిన ప‌రిస్థితుల దృష్ట్యా చంద్ర‌బాబు తెలంగాణ టీడీపీ విభాగాన్ని బలోపేతం చేసే దిశ‌గా ప్ర‌య‌త్నం చేయ‌డం ఆ పార్టీ వ‌ర్గాల‌కు ఆనందాన్ని నింపుతోంది.

తెలంగాణ‌లోని 119 అసెంబ్లీ స్థానాల‌కుగాను 60 చోట్ల టీడీపీ ఓటు బ్యాంకు బ‌లంగా ఉంది. ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌, రంగారెడ్డి, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, మెద‌క్ తో పాటు ఆదిలాబాద్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల‌ ఆ పార్టీ ప్రాబ‌ల్యం ఉంది. ఈసారి వ‌చ్చే 2023 ఎన్నిక‌ల్లో క‌నీసం 30 స్థానాల్లో గెలుచుకోవాల‌ని స్కెచ్ వేస్తోంది. ఒక వేళ ఏపీలో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు ఖాయమైతే, అదే ఈక్వేషన్ తెలంగాణ‌లోనూ ఉండే అవ‌కాశం ఉంది.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ కూట‌మికి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆనాడు ఏపీ మీద పూర్తిగా దృష్టి పెట్టిన చంద్ర‌బాబు తెలంగాణ ప్రాంతాన్ని వ‌దిలేశారు. ఏపీ త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేసి ఉంటే, క‌నీసం 40 స్థానాల వ‌ర‌కు వ‌చ్చి ఉండేవి. రెండో స్థానంలో ఆనాడు టీడీపీ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నిలిచింది. ఆ విష‌యాన్ని బేరీజు వేసుకుంటోన్న టీడీపీ అప్ప‌ట్లో జరిగిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేసుకోవాల‌ని స్కెచ్ వేసింది. ఆ క్ర‌మంలో మునుగోడు నుంచి అభ్య‌ర్థిని నిల‌ప‌డం ద్వారా గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేసే పార్టీగా నిల‌వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది.