KTR: ఊసరవెళ్లి రంగులు మార్చుతది.. రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తాడు: కేటీఆర్

  • Written By:
  • Updated On - May 21, 2024 / 11:41 PM IST

KTR: వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజుర్ నగర్ లో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారు, మోసపు మాటలే వింటారు. అని చెప్పి నిజాయితీగా రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి మోసం మాటలు, చేతలు ప్రజలకు తెలుస్తున్నాయ్. రుణమాఫీ సాధ్యం కాదన్న తేలిపోయింది. ఇక ఇప్పుడు సన్న వడ్లకే రూ. 500 బోనస్ అంట. సన్న వడ్లకు మార్కెట్ లోనే మంచి ధర వస్తది. వాళ్లు ఇచ్చే బోనస్ అవసరమేముంటది. అందుకే సన్న వడ్ల బియ్యం అనే మాట తెచ్చారు. కానీ తెలంగాణలో 80 శాతం దొడ్డు వడ్లే పండుతాయి. అప్పుడు అందరికీ అన్ని అన్నారు. ఇప్పుడు మాత్రం కొందరికి కొన్నే అంటున్నారు. సన్నాయి నొక్కులు నొక్కే కాంగ్రెస్ సన్నాసులకు ఓటు తో వేటు వేసి బుద్ధి చెప్పండి.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.

‘‘రైతు బంధు నాట్ల నాడు ఇవ్వాల్సి ఉండగా….ఓట్ల నాడు రైతుబంధు వేస్తున్నాడు. అది కూడా ఘనకార్యమేనంట. ఆరు నెలల క్రితం ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారు. ఎన్నికలకు ముందు అభయహస్తం…ఇప్పుడు భస్మాసుర హస్తం. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తానని…వెంబడే సంతకం పెడతా అని రైతులను బురిడి కొట్టించిండు రేవంత్ రెడ్డి. ఆరు నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ అతిలేదు. గతిలేదు. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మటం లేదు. అందుకే ఇగ దేవుడి మీద ఒట్లు పెట్టుకోవటం మొదలుపెట్టిండు’’ అని కేటీఆర్ విమర్శించారు.

దేవుళ్ల మీద ఒట్లు వేసి దేవుడిని కూడా ఇబ్బంది పెట్టే పనిచేస్తున్నాడు. ఊసరవెళ్లి రంగులు మార్చుతది. రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తాడు. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సాయం అన్నాడు. ఒక్కరికైనా వచ్చాయా? ఒక్క పనికూడా చేయకుండా ఉన్న కాంగ్రెస్ కే మళ్లీ ఓటు వేద్దామా? ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు అవుతది. రెండోసారి మళ్లీ వాడి చేతిలోనే మోస పోతే మోసపోయిన వాళ్లదే తప్పు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా అబద్దాల కోరు మరొకరు లేరు. సిగ్గు లేకుండా ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేసిన అంటున్నాడు. తెలంగాణలో రూ. 2500 ఇస్తున్నట్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.