Challa Sreenivasulu Setty : ఎస్‌బీఐ ఛైర్మన్ రేసులో తెలుగుతేజం చల్లా శ్రీనివాసులు.. కెరీర్ విశేషాలివీ

మన తెలుగు వ్యక్తి మరో కీలక పదవికి అత్యంత చేరువలో ఉన్నారు.

  • Written By:
  • Updated On - June 30, 2024 / 06:57 AM IST

Challa Sreenivasulu Setty : మన తెలుగు వ్యక్తి మరో కీలక పదవికి అత్యంత చేరువలో ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా (ఉమ్మడి మహబూబ్‌నగర్‌) మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తదుపరి ఛైర్మన్‌ పదవికి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారసు చేసింది. ఈనేపథ్యంలో ఆయన కెరీర్ విశేషాలు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

అగ్రికల్చర్ కోర్సు చేశాక.. బ్యాంకు జాబ్‌లోకి

బ్యాంకింగ్ సెక్టార్‌లోకి వెళ్లాలని భావించే వారంతా డిగ్రీలో బీకామ్ కోర్సు చేస్తుంటారు. కానీ చల్లా శ్రీనివాసులు శెట్టి అలా చేయలేదు. ఆయన ఇంటర్ పూర్తి చేశాక.. మన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు చేశారు. అలా ఎందుకంటే.. బ్యాంకింగ్‌ రంగంలోకి రావాలనే ఆలోచనే ఆయనకు అప్పట్లో లేదు. ఐఏఎస్‌ అధికారి కావాలనే కోరిక మాత్రం శ్రీనివాసులుకు ఉండేది. ఈక్రమంలో చల్లా శ్రీనివాసులు  ఉద్యోగాలు వెతకడం ప్రారంభించారు. అందరూ బ్యాంకు పరీక్షలు రాస్తుంటే చూసి.. ఆయన కూడా అప్లై చేసి రాశారు. ప్రయత్నం ఫలించి.. ఎస్‌బీఐలో జాబ్ వచ్చింది. 1988లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చల్లా శ్రీనివాసులుకు అపాయింట్మెంట్ వచ్చింది. ఐఏఎస్ అయితేనే సమాజానికి సేవ చేయొచ్చని శ్రీనివాసులు తొలుత భావించేవారు.. అయితే ఎస్‌బీఐలో చేరాక ఆయన ఆలోచనా విధానం మారిపోయింది. బ్యాంకింగ్ ద్వారా కూడా సమాజానికి, పేదలకు సేవ చేయొచ్చని శ్రీనివాసులుకు తెలిసొచ్చింది.

Also Read :Black Hair: ఇలా చేస్తే చాలు గంటలో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం?

ప్రస్తుతం ఏయే బాధ్యతలు..

చల్లా శ్రీనివాసులు(Challa Sreenivasulu Setty) గుజరాత్, హైదరాబాద్, ముంబైతో పాటు న్యూయార్క్‌లోనూ ఎస్‌బీఐ కోసం పనిచేశారు. డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ జనరల్‌ మేనేజర్, జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2020 జనవరి నుంచి ఎస్‌బీఐకి మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) హోదాలో సేవలు అందిస్తున్నారు. ఎస్‌బీఐకు సంబంధించిన అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్‌ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాల బాధ్యతలను శ్రీనివాసులు చూసుకుంటున్నారు.

Also Read :New Rules : జులై 1 నుంచి కొత్త రూల్స్‌.. సిద్ధమైన తెలంగాణ పోలీస్‌

శనివారం రోజే ఇంటర్వ్యూ.. 

2024 ఆగస్టు 28న ప్రస్తుత ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా(63) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలోకి సరైన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఎఫ్‌ఎస్‌ఐబీ తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్‌ఎస్‌ఐబీ శనివారం రోజే ముగ్గురిని ఇంటర్వ్యూ చేసింది. చివరకు చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఛైర్మన్‌ పదవికి సిఫారసు చేసింది. ప్రస్తుత ఎస్‌బీఐ ఎండీలలో అందరి కంటే సీనియర్‌ శ్రీనివాసులే కావడంతో సంప్రదాయం ప్రకారం ఈయన పేరును ఛైర్మన్‌ పదవికి సిఫార్సు చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ) దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.  ఎస్‌బీఐ ఛైర్మన్ స్థాయి పదవిలో ఎవరు ఉండాలని డిసైడ్ చేయగల ఎఫ్‌ఎస్‌ఐబీ సంస్థకు ప్రస్తుత అధిపతిగా వ్యక్తిగత, శిక్షణ విభాగం మాజీ కార్యదర్శి భాను ప్రతాప్‌ శర్మ వ్యవహరిస్తున్నారు. ఈ బ్యూరోలో ఆర్థిక సేవల కార్యదర్శి, ప్రభుత్వ సంస్థల విభాగ కార్యదర్శి, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ సభ్యులుగా ఉన్నారు. ఓరియంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ ఛైర్మన్, ఎండీ అనిమేశ్, ఆర్‌బీఐ మాజీ ఈడీ దీపక్, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ మాజీ ఎండీ శైలేంద్ర కూడా సభ్యులుగా ఉన్నారు.