Central Govt Land : `భూ` దందా వ‌యా వైజాగ్‌!

కేంద్రం, తెలంగాణ ప్ర‌భుత్వాల మ‌ధ్య భూముల వ్య‌వ‌హారం రాజుకుంది.

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 01:55 PM IST

కేంద్రం, తెలంగాణ ప్ర‌భుత్వాల మ‌ధ్య భూముల వ్య‌వ‌హారం రాజుకుంది. ఇటీవ‌ల వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో రాజుకున్న వివాదానికి మించిన విధంగా కేంద్ర‌, రాష్ట్ర స‌ర్కార్ల మ‌ధ్య భూముల క్ర‌య‌విక్ర‌యాల ఇష్యూ న‌డుస్తోంది. తెలంగాణ‌లోని ప‌బ్లిక్ రంగ సంస్థ‌ల‌ను అమ్మ‌డానికి పెట్టిన కేంద్రం భూముల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని మంత్రి కేటీఆర్ ఫిట్టింగ్ పెట్టారు. సుమారు రూ. 40వేల కోట్ల విలువైన భూములు అమ్మ‌డానికి కేంద్రానికి హ‌క్కు ఎక్క‌డిద‌ని నిల‌దీస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కంటోన్మెంట్ ఏరియా నుంచి హైద‌రాబాద్ న‌గ‌ర ఈశాన్య ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి రోడ్ల‌ను విస్త‌రించ‌డానికి భూములు ఇవ్వాల‌ని కేసీఆర్ స‌ర్కార్ కేంద్రాన్ని కోరింది. అందుకు ప్ర‌తిగా రూ. 442కోట్లు ఇవ్వాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ నుంచి తిరుగు స‌మాధానం వ‌చ్చింది. దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య భూ వివాదం తారాస్థాయికి చేరింది.

సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ప్రాంతంలో సుమారు 40 ఎకరాల భూమిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖను కోరింది. పరిహారంగా భూమిని ఇచ్చేందుకు రూ.442 కోట్లు కేంద్రం కోరింది. కంటోన్మెంట్ ప్రాంతం దాటి నగరంలోని ఈశాన్యంలో నివాస ప్రాంతాలకు రహదారి కనెక్టివిటీ సమస్యను పరిష్కరించడానికి రోడ్ల‌ను విస్త‌రింప చేయాల‌ని కేసీఆర్ స‌ర్కార్ ప్లాన్ చేసింది. స్థానిక మిలిటరీ అథారిటీ (LMA) కొన్ని సంవత్సరాల క్రితం అలహాబాద్ గేట్, గఫ్ రోడ్, వెల్లింగ్‌టన్ రోడ్ , ఆర్డినెన్స్ రోడ్‌లను AOC వద్ద కలుస్తుంది. మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, RK పురం ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో నివసించే నివాసితులకు ఇది ప్రధాన కనెక్టివిటీ. కంటోన్మెంట్ ను ఆవ‌ల ఉన్న ప్రాంతాల నివాసితుల నిరసనల తరువాత, సమస్యను పరిష్కరించే దిశ‌గా రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు కనెక్టివిటీని ప్లాన్ చేసింది.

 

రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన రోడ్ల విస్త‌ర‌ణ ప్లాన్ అమ‌లు కావ‌డానికి భూమిని ఉచితంగా ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కేసీఆర్ స‌ర్కార్ కోరింది. కానీ, రూ. 442కోట్ల‌ను న‌ష్ట‌ప‌రిహారం కింద ఇవ్వాల‌ని కోర‌డంతో తెలంగాణ రాష్ట్రంలోని భూముల‌ను స్వాధీనం చేయాల‌ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. గ‌తంలో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు రాష్ట్రం భూముల‌ను ఇచ్చింది. ఆ సంస్థ‌లు న‌ష్టాల్లో న‌డుస్తున్నాయ‌ని వాటిని అమ్మ‌కానికి కేంద్రం పెట్టింది. వాటిలో ”హిందుస్థాన్‌ కేబుల్స్‌, హిందుస్థాన్‌ ఫ్లోరో కార్బన్స్‌, ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌, హెచ్‌ఎంటీ, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిసిఐ), ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ త‌దిత‌రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా అమ్ముతోంది. ఈ ఆరు సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో దాదాపు 7,200 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి విలువ కనీసం 5 వేల కోట్లపైగా ఉండ‌గా, బహిరంగ మార్కెట్‌లో40 వేల కోట్లపైగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అంచ‌నా. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలి. లేదంటే ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలి. ఆ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

తెలంగాణ‌, కేంద్రం మ‌ధ్య న‌డున్న భూముల వివాదంలోకి ఏపీని కూడా మంత్రి కేటీఆర్ లాఆరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ప్లాంట్ భూముల విలువ సుమారు రూ. 2ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఆ భూములతో సహా అమ్ముతారో లేదో తెలియ‌దంటూనే కిరికిరి పెట్టారు. మొత్తం మీద ప్రైవేటు ప‌రం చేస్తోన్న ప్ర‌భుత్వం రంగ సంస్థ‌ల తాలూకూ భూముల విలువ తెలంగాణ రాష్ట్రంలో రూ. 40 వేల కోట్ల ఉంటుంద‌ని, ఏపీలో రూ. 2ల‌క్ష‌ల కోట్ల విలువైన భూములు ఉంటాయ‌ని కేటీఆర్ చెబుతున్నారు. ఒక వేళ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ప్రైవేటు వాళ్ల‌కు అప్ప‌గిస్తే ఆ భూముల‌ను తిరిగి ఇవ్వాలి? లేదా ప‌రిహారం కింద నిధుల‌ను స‌మ‌కూర్చాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ రోడ్ల విస్త‌ర‌ణ కోసం అవ‌స‌ర‌మైన భూమి కోసం రూ. 442 కోట్లు ప‌రిహారం కింద ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చేసిన డిమాండ్ కు ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వ సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ‌కు లింకు పెడుతూ రూ. 2.42ల‌క్ష‌ల కోట్లు ఇవ్వాల‌ని మంత్రి కేటీఆర్ లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం.