BJP Plan : లిక్క‌ర్ కిక్‌! డ్ర‌గ్స్ నిషా! బీజేపీ ఆప‌రేష‌న్ డార్క్!!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో పీక‌ల్లోతుకు ఇరుక్కున్న ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ ఖాయ‌మంటూ వినిపిస్తోన్న త‌రుణంలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం అంటూ మంత్రి కేటీఆర్ ను బీజేపీ టార్గెట్ చేస్తోంది.

  • Written By:
  • Updated On - December 2, 2022 / 01:06 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో పీక‌ల్లోతుకు ఇరుక్కున్న ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ ఖాయ‌మంటూ వినిపిస్తోన్న త‌రుణంలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం అంటూ మంత్రి కేటీఆర్ ను బీజేపీ టార్గెట్ చేస్తోంది. లిక్క‌ర్ స్కామ్ సూత్ర‌ధారిగా ఉన్న అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ప‌క్కాగా క‌విత దొరికిపోయారు. ఇక ఇప్పుడు ముంబాయ్, క‌ర్ణాట‌క డ్ర‌గ్స్ కేసును బీజేపీ నేత‌లు తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను విచారించిన క‌ర్ణాట‌క పోలీసులు అవ‌స‌ర‌మైతే మంత్రి కేటీఆర్ ను కూడా వ‌ద‌ల‌ర‌ని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. ముంబాయ్‌, క‌ర్ణాట‌క డ్ర‌గ్స్ కేసులు విచార‌ణ‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్‌ బండి సంజ‌య్ లు పలుమార్లు కేటీఆర్ ప్ర‌మేయంపై ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న సాగిన ఈ ఎనిమిదేళ్లలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం త‌ర‌చూ వినిపిస్తూనే ఉంది. తొలుత 2018 ఎన్నిక‌ల‌కు ముందుగా డ్ర‌గ్స్ కేసు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ కేసును విచారించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ హ‌ఠాత్తుగా ఏడాది క్రితం క్లోజ్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్క‌డా డ్ర‌గ్స్ మూలాలు లేవ‌ని తేల్చేసింది. ఫలితంగా సినిమా ప‌రిశ్ర‌మ‌లోని చాలా మంది ఊపిరిపీల్చుకున్నారు. కార్పొరేట్ స్కూల్స్ యాజ‌మాన్యం, కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల పిల్ల‌లు సేఫ్ సైడ్ కు వెళ్లారు. అదే స‌మ‌యంలో ముంబాయ్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తెర మీద‌కు వ‌చ్చింది. మ‌హారాష్ట్ర పోలీసులు బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌రువాత డ్ర‌గ్స్ కేసు విచార‌ణ వేగ‌వంతం చేశారు. ఆ కేసులో టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ను విచారించారు. హైద‌రాబాద్ కేంద్రంగా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం న‌డుస్తోందని మ‌హారాష్ట్ర పోలీసులు గుర్తించి కొంద‌రు సినీ, రాజ‌కీయ రంగానికి చెందిన వాళ్ల‌ను ముంబాయ్ పోలీసులు ఇంట‌రాగేష‌న్ చేశారు. త‌ద‌నంత‌రం ఆ కేసు విచార‌ణ స‌ద్దుమ‌ణిగిన కొద్ది రోజుల‌కే బెంగుళూరు కేంద్రంగా న‌డిచిన డ‌గ్స్ వ్య‌వ‌హారం తెర మీద‌కు వ‌చ్చింది.

బెంగుళూరు డ్ర‌గ్స్ కేసులో టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని క‌ర్ణాట‌క పోలీసులు అనుమానించారు. ఆ కేసు విచార‌ణ సంద‌ర్భంగా వాళ్ల‌కు నోటీసులు కూడా ఇచ్చారు. ఆ త‌రువాత ఆ కేసు ఏమైయిందో ఎవ‌రికీ తెలియ‌నంత‌గా బ‌ట్ట‌దాఖ‌లు అయింది. అయితే, ఇప్పుడు ఆ కేసును రీఓపెన్ చేయిస్తున్నామని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ లో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

బెంగళూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని బెంగళూరు పోలీసులు నిర్ధారించారని బండి చెబుతున్నారు. బెంగళూరు పోలీసులకు డబ్బులిచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసును కొట్టివేయించుకున్నార‌ని బండి చేస్తోన్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న‌ప్ప‌టికీ టీఆర్ఎస్ నేతలు డ్ర‌గ్స్ కేసును కొట్టివేయించుకున్నారని ఆయన చెప్ప‌డం రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీస్తోంది.

బెంగుళూరు, ముంబాయ్ కేంద్రంగా బ‌య‌ట‌ప‌డిన డ్ర‌గ్స్ దందా మూలాలు హైద‌రాబాద్ ను ట‌చ్ చేసిన విష‌యం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోని చాలా మంది ప్ర‌ముఖుల‌ను డ్రగ్స్ విచార‌ణ‌కు పిలిచిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ తో కూడిన సిట్ 2018 ఎన్నిక‌ల వ‌ర‌కు ఆ కేసును న‌డిపింది. ఆక‌స్మాత్తుగా ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత క్లోజ్ చేయ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ కేసు విచార‌ణ‌పై హైకోర్టు కూడా చాలా అనుమానాల‌ను వ్య‌క్తం చేసింది. విచార‌ణ‌కు సంబంధించిన ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌మ‌ని కోరింది. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ పెద్ద‌గా స్పందించ‌లేదు. ఫ‌లితంగా క్లోజ్ అయిన డ్ర‌గ్స్ కేసుకు ముంబాయ్‌, బెంగుళూరు దందా ట‌చ్ అయింది. ఆ రెండు చోట్లా చేసిన డ్ర‌గ్స్ కేసు విచార‌ణ నుంచి అధికార‌పార్టీ నేతలు చాక‌చ‌క్యంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఇప్పుడు ఆ కేసుల‌ను తిర‌గతోడ‌తామ‌ని బీజేపీ హెచ్చ‌రిస్తోది. ఇదే త‌ర‌హాలో లిక్క‌ర్ స్కామ్ లోనూ ఢిల్లీ బీజేపీ నేత‌లు ముందుకు గా హెచ్చ‌రించారు. సీన్ క‌ట్ చేస్తే, క‌విత ప‌క్కాగా దొరికారు. డ్ర‌గ్స్ కేసు ద్వారా మంత్రి కేటీఆర్ కూడా దొరుకుతార‌ని బీజేపీ నేత‌లు చాలా కాలంగా చెబుతోన్న మాట‌. ఎంత వ‌ర‌కు వాళ్ల మాట‌లు నిజం అవుతాయో చూడాలి.