తెలంగాణపై ఎందకింత చిన్నచూపు!

తెలంగాణ పర్యాటక ప్రాంతాలను కేంద్రం పట్టించుకోవడం లేదా..? ఇక్కడి టూరిజం ప్రాంతాలకు నిధులు మంజూరు చేయడం లేదా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు.

  • Written By:
  • Updated On - October 6, 2021 / 04:13 PM IST

తెలంగాణ పర్యాటక ప్రాంతాలను కేంద్రం పట్టించుకోవడం లేదా..? ఇక్కడి టూరిజం ప్రాంతాలకు నిధులు మంజూరు చేయడం లేదా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. తెలంగాణ డెవలప్ మెంట్ కోసం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, ముఖ్యంగా ఇక్కడి పర్యాటక ప్రాంతాలు, గొప్ప చరిత్ర కలిగిన కట్టడాలను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ తెలంగాణ టూరిజం గురించి పలు విషయాలను ఆయన  ప్రస్తావించారు. తెలంగాణలో ఎన్నో గొప్ప పర్యాటక ప్రాంతాలు, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే కట్టడాలున్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 58 ఏండ్లుగా ఇక్కడి వారసత్వాలు కట్టడాలు, టూరిజం ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన వాటర్ ఫాల్స్ తో పాటు ఖమ్మంలోని పాండవులు గుట్ట, ఆలంపూర్ లోని జోగులాంబ లాంటి ఆలయాలు సైతం డెవలప్ మెంట్ కు నోచుకోవడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో కవులు, కళాకారులు, వివిధ రంగాల్లో ప్రతిభ కల్గిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారని, అందులో చాలామంది పద్మశ్రీ లాంటి అవార్డులకు అర్హులు అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పద్మశ్రీ లాంటి అవార్డుల కోసం పేర్లు పంపాలా? వద్దా? అని అడిగినా బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా హామీ ఇచ్చినా, ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో విమానాశ్రయాలు నిర్మించేందుకు కేంద్రాన్ని కోరితే.. నేటి వరకు సాంకేతిక అనుమతులు ఇవ్వలేదని, మా డబ్బుతో కట్టుకుంటామని చెప్పినా నిర్లక్ష్యం చేస్తోందని కేంద్రంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.

తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా, గోదావరి పుష్కరాల మీద కూడా గతంలో ఉద్యమం చేశానని పేర్కొన్న కేసీఆర్ అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి చారిత్రక ప్రదేశాలు, కోటలు, దర్శనీయ స్థలాలు, విశిష్టతను సంతరించుకున్న ఆలయాలకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేంద్రాన్నిఎయిర్ స్ట్రిప్స్ ఇవ్వాలని అడిగి ఆరున్నర సంవత్సరాలు గడిచిపోయిందని, కానీ కేంద్రం కాలయాపన చేస్తోందంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.