Site icon HashtagU Telugu

Telangana Debt: తెలంగాణ అప్పులపై కేంద్రం ఫోకస్.. బడ్జెట్ వెలుపలి రుణాలూ ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే!

cash

cash

అప్పుల విషయంలో తెలంగాణకు కేంద్రం నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. దాదాపు నెలన్నరగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనివల్ల అభివృద్ధి, సంక్షేమం కుంటుపడుతున్నాయంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఆంక్షలు తొలగించాలని కోరింది. బడ్జెట్ బయట తీసుకునే అప్పులను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి కాకుండా పాత పద్దతి ప్రకారమే పరిగణించాలని కోరింది. ఇంతకీ రెండింటికీ మధ్య ఎక్కడ తేడా వస్తోంది?

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ఎఫ్ఆర్బీఎం పరిధి 3.5 శాతం. అంటే రూ.42,728 కోట్ల అప్పు తెచ్చుకోవచ్చు. ఒకవేళ పనీతీరు బాగుంటే మరో 0.5 శాతం అదనపు అప్పు తీసుకోవడానికీ పర్మిషన్ ఇస్తుంది. కానీ రాష్ట్రం మాత్రం బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.59,672 కోట్ల అప్పులను సేకరించడానికి సిద్ధపడింది. దీనితోపాటు బడ్జెట్ పరిధిలో కాకుండా.. వివిధ కార్పొరేషన్ల నుంచి మరో రూ.40 వేల కోట్ల అప్పును తీసుకోవడానికి డిసైడ్ అయ్యింది.

ఒక్క కాళేశ్వరం కార్పొరేషన్ కే తీసుకోవాల్సిన అప్పు దాదాపు రూ.30 వేల కోట్లు. ఇక తాగు నీటి సంస్థ, గృహనిర్మాణ సంస్థ, నీటి వనరుల అభివృద్ధి సంస్థ, ఆర్టీసీ ఇలా వీటన్నింటికీ అప్పులు తీసుకోవాలి. కానీ ఇప్పుడు కేంద్రం పెట్టిన పితలాటకంతో కేసీఆర్ సర్కారుకు ఎటూ పాలుపోవడం లేదు. గత ఆర్థిక సంవత్సరం చివరిలో. అంటే మార్చి నెలాఖరు నాటికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మార్కెట్ రుణాలు రూ.2,85,120 కోట్లు. ఇక బడ్జెట్ కు అవతల.. ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన, తీసుకున్న అప్పులు రూ.1,35,282 కోట్లు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ మేరకు లేఖ కూడా రాసింది. అందులో ఏముందంటే.. రాష్ట్రం సేల్ చేసిన బాండ్లలో 49 శాతం అప్పులను 2036 సంవత్సరం తరువాతే చెల్లించాలంది. జీఎస్డీపీలో రాష్ట్రం అప్పులు 25 శాతం లోపే ఉన్నాయని చెప్పింది. జాతీయ బ్యాంకులు, నాబార్డ్ వంటి సంస్థల నుంచి అప్పు తీసుకుంటున్నామని చెప్పింది. అది కూడా తక్కువ వడ్డీకే అని స్పష్టం చేసింది. ఈ లేఖపై మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.