Site icon HashtagU Telugu

Kazipet Coach Factory : కాజీపేట ‘రైల్వే కోచ్ ‘కొట్లాట

Kishan Kcr Bandi

Kishan Kcr Bandi

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తెలంగాణ కేంద్రంగా నడుస్తున్న రాజకీయ గేమ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరింత ఆజ్యం పోశాడు. విభజన చట్టంలోని హామీలను తీసుకురాలేని బీజేపీని టీఆర్ఎస్ తరచూ టార్గెట్ చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేస్తుంది. వెనుక బడిన జిల్లాలకు ఇస్తామన్న ప్యాకేజి ఇవ్వలేదు. వీటన్నిటిని ఎన్నికల సందర్భంగా అస్త్రాలుగా టీఆర్ఎస్ కేంద్రంపై ప్రయోగిస్తుంది. తాజాగా కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ తెరమీదకు వచ్చింది. దాని నిర్మాణం కోసం భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించాడు. లేదంటే ఎప్పుడో కేంద్రం కోచ్ ఫ్యాక్టరీని ఇచ్చేదని అన్నాడు. దీంతో ఆ అంశం ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ అస్త్రంగా మారింది. ఐక్య చేసి ఆ రెండు పార్టీల వాలకన్నీ నిలదీయడానికి కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు ఇతర సామాజిక సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు.ఉత్తర, దక్షిణ భారతానికి గేట్​వేగా కాజీపేట ఉంది. ఇక్కడ రైల్వేపరిశ్రమల ఏర్పాటు పై ఏండ్లు గడుస్తున్న అధికార పార్టీలకు సీరియస్ లేదు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా విభజన చట్టంలో ఇచ్చిన కోచ్​ ఫ్యాక్టరీ హామీ రాజకీయ పార్టీల ఆధిపత్య ఆటకు కేంద్రంగా ఉపయోగపడుతున్నది. ఈ విషయంలో టీఆర్​ఎస్​ పార్టీ ముందు వరుసలో ఉండగా ‘ఇచ్చే స్థానంలో ఉండి ఇవ్వకుండా కొర్రీలు పెడుతూ మొండి చేయి’ చూపెట్టడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉంది. ఈ కోచ్​ ఫ్యాక్టరీ పై పరస్పరం విమర్శలు చేసుకోవడం, ఒకరిపై మరొకరు నెపం పెట్టుకొని కాలాయాపన చేయడం అలవాటుగా మారింది. ఆ నేపథ్యంలోనే కాజీపేటలో ఐక్యపోరాటానికి సిద్ధమైతూ సిపిఐ, సిపిఎం, ఇతర కార్మిక, స్వచ్ఛంద సంస్థలను కలిసాయి. ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దీని కోసం వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే, చీప్​విప్​ దాస్యం వినయ్​భాస్కర్​ సీపీఐ, సీపీఎం నాయకులను స్వయంగా కలిసి మాట్లాడారు. దశాబ్దంన్నర కాలంగా కోచ్​ ఫ్యాక్టరీ రాజకీయ ఎజెండాగా మారిపోయింది. కేంద్రంలోని బీజేపీతో టీఆర్​ఎస్​ అంటకాగినంత సేవు ఈ విషయాన్ని మరుగుపరచడం అలవాటైంది. 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్ పార్టీ కాంగ్రెస్​ను లక్ష్యంగా చేసుకుని అడుగులు ముందుకు వేసి సఫలీకృతమైంది.

కానీ, 2018లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో విభజన హామీలు, కోచ్​ ఫ్యాక్టరీని ఎజెండా చేసి కాజీపేట కేంద్రంగా పోరాటాన్ని ఎక్కుపెట్టారు. బీజేపీ పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పోరాటం చేపట్టామని ఆనాడు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోరాటం నీరుగారి పోయింది. ఇటీవల వరంగల్​ కార్పొరేషన్​ ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని కేంద్రీకృతం చేసి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వామ్యం చేస్తూ బీజేపీపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఒక దశలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని రూపొందించి ఆఖరి నిమిషంలో వెనుకంజ వేసి ఉద్యమాన్ని చల్లార్చారు.
తాజాగా రాష్ట్రంలో బీజేపీ, టీఆర్​ఎస్​ మధ్య అగాధం పెరిగిన నేపథ్యంలో మరోసారి ‘కోచ్’ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి బీజేపీని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో మంత్రులు, చీప్​విప్​ వినయ్​, ఎమ్మెల్యే నన్నపునేని తదితరులు బీజేపీపై విమర్శలు పెంచారు. దీనికి కౌంటర్​గా కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​లు భూమి కేటాయింపు జాప్యం అంశాన్ని కేసీఆర్ సర్కారుపై ఎక్కుపెట్టారు. రెండు పార్టీల రాజకీయ క్రీడలో కోచ్​ ఫ్యాక్టరీ ఆశలు గల్లంతైతున్నాయి.దాదాపు రెండు దశాబ్దాలుగా కాజీపేట కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీ రైల్వే పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తూ వచ్చారు. ఈ మేరకు తొలి దశలో ప్రొఫెల్లెంట్​ ఫ్యాక్టరీ, తర్వాత కోచ్​ ఫ్యాక్టరీ, ఓవరాయిలింగ్​ బ్రాంచ్​, రైల్వే ఛక్రాల పరిశ్రమ తదితర పరిశ్రమలను వివిధ రూపాల్లో తెస్తామని కాంగ్రెస్​, టీఆర్​ఎస్​, బీజేపీలు ఆశలు పెంచారు. కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ వస్తే ఈ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడుతాయని గంపెడాశపెట్టుకున్నారు. ప్రత్యక్షంగా 60 వేల ఉద్యోగాలలో స్థానికులకు 10 వేల ఉద్యోగాలు లభిస్తాయని భావించారు. అన్ని వర్గాలు స్టేషన్లో పూలు,కూరగాయలు అమ్మే కూలి తల్లి నుండి సాధారణ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందనుకున్నారు.

దక్షిణ మధ్య రైల్వేలో ఆరు డివిజన్​లుండగా కాజీపేట డివిజన్​ నుంచే 46.8శాతం ఆదాయం సమకూరుతున్నది. ఇత‌ర డివిజ‌న్ల అన్నింటికంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు సుమారు 1.20లక్షల మంది, రిటైర్డ్​ ఉద్యోగులు 8వేల కుటుంబాలు ఉన్నాయి. అధికారికంగా మూడు జంక్షన్​లు పెద్దపల్లి, డోర్నకల్​, కారేపల్లి అనధికారికంగా మానిగర్​, జగయ్యపేట జంక్షన్​లున్నాయి. మొత్తం స్టేష‌న్లు 83 ఉన్నాయి. ఈ డివిజ‌న్​లో హైద‌రాబాద్ రైల్వే మార్గంలో పెంబ‌ర్తి స్టేష‌న్ వ‌ర‌కు, విజ‌య‌వాడ మార్గంలో కొండ‌ప‌ల్లి స్టేష‌న్‌వ‌ర‌కు, భ‌ద్రాచ‌లం మార్గంలో మ‌ణుగూరు, ఢిల్లీలో మార్గంలో మానిఘ‌ర్ స్టేష‌న్ వ‌ర‌కు, ఫండ‌రీపాణి, ఘ‌ట్‌చందూర్ వ‌ర‌కు, లింగంపేట‌, జ‌గిత్యాల స్టేష‌న్ల వ‌ర‌కు ప‌రిధి ఉండేలా డివిజ‌న్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. స్టేషన్లలో కనీస శానిటేషన్, ఇతర మౌలిక సదుపాయాలు లేవు.అదనపు ప్లాట్ ఫారమ్​ల నిర్మాణమే లేదు.కాజీపేట కు మంజూరైనటువంటి వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ రూ.480 కోట్ల మంజూరైనా నిధులు విడుదల కాలేదు. కాజీపేట టౌన్ స్టేషన్ లో 2, 3 వ ప్లాట్​ఫారమ్​లను ఏర్పాటు చేసి బల్లార్ష నుండి వరంగల్ వైపు – వెళ్ళే రైళ్లను టౌన్ స్టేషన్ లో ఆపి నీటి వసతి కల్పించాలనే డిమాండ్​ చాలా కాలంగా ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వందే భారత్ కోచ్ ఫ్యాక్టరీగా కాజీపేటలో నెలకొల్పాలని, రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రైల్వే కార్మికుల కోసం వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర రెండు పడకల గదితో రైల్వే క్వార్టర్స్ నిర్మాణం చేపట్టాలని, మెయిన్ రోడ్ లో ఉన్న రైల్వే స్థలాలలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసే నిరుద్యోగులైన రైల్వే కుటుంబ పిల్లలకు కేటాయించాలని ఇక్కడి ప్రజల డిమాండు చేస్తున్నారు. సబ్ డివిజనల్ రైల్వే హాస్పిటల్ పనులను ప్రారంభించాలని కోరుతున్నారు. టీఆర్​ఎస్​కు కాజీపేట పై ప్రేమ ఉంటే మెట్రో కోచ్ ప్యాక్టరీని వికారాబాద్​కు ఎందుకు తరలించారనే విమర్శలున్నాయి. కోచ్ ప్యాక్టరీ ఏర్పాటు కోసం కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేసి ఈ కాజీపేట ప్రజల కానుకగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. రైల్వే స్టేడియం చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. దీని కోసం పోరాటం చేస్తాం అంటూ కాంగ్రెస్ వస్తుంది. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో మళ్ళీ కాజీపేట రైల్వే కోచ్ అంశం తెరమీదకు వస్తుంది. సో.. వరి ధాన్యం కొనుగోలు, జీవో 317 తరువాత కాజీపేట రైల్వే కోచ్ బీజేపీ,టీఆర్ఎస్ మధ్య మరో రాజకీయ యుద్ధం ప్రారంభం కానుదన్నమాట.