Paddy Issue:కేంద్రమంత్రులు Vs తెలంగాణ మంత్రులు

వరిధాన్యం విషయంలో అన్ని రాజకీయ పార్టీల పరస్పర మాటలయుద్ధం రోజురోజుకి పెరుగుతోంది.

వరిధాన్యం విషయంలో అన్ని రాజకీయ పార్టీల పరస్పర మాటలయుద్ధం రోజురోజుకి పెరుగుతోంది. తప్పు మీదంటే మీదని అన్ని రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యం కొరకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలైతే ఢిల్లీలోనే ప్రదక్షణాలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రులను తాను ఢిల్లీకి పిలవలేదని కేంద్ర మంత్రి ప్రకటించడంతో మంత్రులు ఫైర్ అయ్యారు.

తెలంగాణ రైతులపై కేంద్రం వివక్షత చూపిస్తుందని. తెలంగాణ చేసిన తప్పేంటని మంత్రుల బృందం ప్రశ్నిస్తోంది తెలంగాణలోనే వరిధాన్యం సమస్య ఉందా అనే వారు కురచబుద్దితో ఆలోచిస్తున్నారని, దేశంలోని సగం రాష్ట్రాలు పండించే పంట ఒక్క తెలంగాణలో పండుతుందని తెలంగాణ మంత్రులు తెలిపారు.

అవాకులు, చవాకులు పేలే మూర్ఖులు ముందు విషయాలు తెలుసుకోవాలని, కేంద్రం అడ్డంకులు సృష్టించకుంటే తెలంగాణాలో ఈ యాసంగిలో 70 లక్షల ఎకరాలలో భవిష్యత్ లో 90 లక్షల ఎకరాలకు వరి సాగు వెళ్లేదని, దేశంలో ఒక రాష్ట్రం పురోగమిస్తుంటే సహకారం అందించాల్సిన కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని మంత్రుల బృందం ఆరోపించింది.

తెలంగాణకు నీళ్లు తేవడం, రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించడం మా తప్పా అని మంత్రుల బృందం కేంద్రాన్ని నిలదీసింది. పండించేది తెలంగాణ రైతులైనప్పటికీ
దురదృష్టవశాత్తు కొనుగోళ్లు, గోదాంలు కేంద్రం చేతిలో ఉన్నందున కేంద్రాన్ని అడగాల్సి వస్తుందని, కేంద్రానికి చేతకాకుంటే హక్కులు రాష్ట్రాలకు బదలాయించాలని తెలంగాణ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

తాము ప్రేమలేఖలు ఇవ్వడానికో, ప్రేమించడానికో ఢిల్లీకి రాలేదని.
రైతుల సమస్యల గురించి మాట్లాడేందుకు వస్తే తమాషాగా కనిపిస్తుందా అని కేంద్రమంత్రులను ప్రశ్నించిన తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తున్నదని, ఇది చాలా దురదృష్టకరమని తెలిపారు. మోదీ కార్పోరేట్ పెద్దల కోసం ఎంత దూరమైనా వెళ్తారని, దగ్గరుండి ప్రభుత్వ పెద్దలకు ఒప్పందాలు చేయిస్తారని ఎద్దేవా చేశారు.
లక్షల మంది జీవితాలతో ముడిపడిన రైతుల సమస్యల పట్ల మోదీకి ఎందుకు చిత్తశుద్ధి లేదని, రైతుల పట్ల కేంద్రానికి ఎలాంటి పట్టింపు లేదని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి మాటిచ్చారని, దాని ప్రకారమే లేఖ ఇవ్వాలని వేచి చూస్తున్నామని మంత్రుల బృందం తెలిపారు.

తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతుంటే కిషన్ రెడ్డికి బాద్యత లేదా అని మంత్రుల బృందం ప్రశ్నించింది. దేశంలో పండే 57 రకాలకు పైగా పంటలకు గాను 14 నుండి 23 రకాలకే మద్దతుధర ప్రకటిస్తుందని, మిగతా పంటల రైతుల పరిస్థితి ఏంటని మంత్రులు ప్రశ్నించారు.పండిన పంటలో కేవలం 25 శాతం పంటనే కొనుగోలు చేస్తున్నారన, మిగతా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ పరిస్థితి మారాలని మంత్రులు పేర్కొన్నారు.