Site icon HashtagU Telugu

Sagar-Srisailam: సాగ‌ర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం, కృష్ణా బోర్డుకు అప్ప‌గించాల‌ని ఆదేశం

Nagarjuna Sagar Imresizer

Nagarjuna Sagar Imresizer

Sagar-Srisailam: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రాజెక్టులు అన‌గానే నాగార్జున సాగ‌ర్, శ్రీశైలం గుర్తుకువ‌స్తాయి. ద‌శాబ్దలుగా ఎంతోమంది ఆయ‌క‌ట్టు రైతుల‌కు నీరందిస్తూ సాగుకు వ‌రంగా మారుతున్నాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఈ రెండు ప్రాజెక్టుల‌కు తెలుగు రాష్ట్రాల‌కు రెండు క‌ళ్ల లాంటివి. అయితే తాజాగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)కు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ లో సాగర్‌ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖర్జీ ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ ప్రభుత్వ చేతుల్లో ఉందని ముఖర్జీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన దేబశ్రీ ముఖర్జీ నాగార్జున సాగర్ వ్యవహారంపై మాత్రమే మాట్లాడాలని కోరారు. అయితే కేఆర్ఎంబీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గతంగా చర్చించుకుని చెప్తామని కేంద్ర అధికారులకు తెలిపారు. విద్యుత్తు ప్రాజెక్టులు సహా… ప్రాజెక్టు పరిధిలో ఉన్న అవుట్‌లెట్స్‌, సాంకేతిక పరిమితులు వంటి విషయాలపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.

టెక్నికల్ ఇష్యూస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవాలని జలశక్తి కార్యదర్శి సూచించారు. సాగర్ పరిధిలో సీఆర్పీఎఫ్ భద్రతను కొనసాగించడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎంల భేటీ సారాంశ నివేదిక పంపిన తరువాత మరో సారి సమావేశం ఉంటుందని ముఖర్జీ తెలిపారు. ఈ భేటీలో ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌, సాధ్య‌సాధాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.