Site icon HashtagU Telugu

Grand Success : చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ గ్రాండ్ స‌క్సెస్! బీజేపీ, టీడీపీ పొత్తు?

Grand Success

Babu Kmm

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న గ్రాడ్ స‌క్సెస్ (Grand Success) తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ పొత్తుల‌ను(Alliance) ఒక ద‌శ‌కు తీసుకురాబోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీని కాద‌ని తెలంగాణాలో కింగ్‌, కింగ్ మేక‌ర్ కావాల‌ని భావించిన బీజేపీకి ఖ‌మ్మం స‌భ క‌ళ్లు తెరిపించింది. రాబోవు రోజుల్లో చంద్ర‌బాబు తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తే ఏమ‌వుతుందో బోధ‌ప‌డింది. అందుకే, పూర్వం మాదిరిగా టీడీపీతో పొత్తుకు క‌మ‌ల‌నాథులు పావులు క‌దిపే అవ‌కాశం ఉంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్ట‌డంతో సెంటిమెంట్ అనే అంశానికి తావులేదు. 2019 ఎన్నిక‌ల్లో మాదిరిగా చంద్ర‌బాబును టార్గెట్ (Grand Success)చేయ‌డానికి అవ‌కాశం లేదు. పైగా 2020 విజ‌న్ తో తెలంగాణ‌కు చంద్ర‌బాబు చేసిన సేవ‌ల‌ను ఇప్పుడు పూర్తి స్థాయిలో అనుభ‌వంలోకి వ‌చ్చాయి. అందుకే, ఆయ‌న విజ‌న్ ను ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేర‌ని మంత్రి కేటీఆర్ ప‌లుమార్లు చెప్పారు. అంటే, రాబోవు రోజుల్లో చంద్ర‌బాబు బీజేపీకి పెద్ద ప్ల‌స్ పాయింట్ కానున్నార‌ని ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతోంది.

ద‌క్షిణ తెలంగాణ అంతటా కింగ్, కింగ్ మేక‌ర్

కనీసం 35 నుంచి 40 స్థానాల్లో టీడీపీ ప్ర‌భావం కీల‌కంగా ఉండ‌నుంది. ఖ‌మ్మం నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు ద‌క్షిణ తెలంగాణ అంతటా కింగ్, కింగ్ మేక‌ర్ గా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నిల‌బ‌డ‌నుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. ఉమ్మ‌డి హైద‌రాబాద్‌, రంగారెడ్డి, ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల్లో క‌మ‌లనాథుల‌కు ప‌ట్టులేదు. అందుకే, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే క‌నీసం 40 నుంచి 50 స్థానాల్లో ఢంకాబ‌జాయించి గెలుచుకోవ‌చ్చ‌ని బీజేపీ తాజా స‌ర్వేలోని సారంశం. దానికి అనుగుణంగా చంద్ర‌బాబు ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న అనూహ్య విజ‌యం సాధించింది.

ఏపీలో టీడీపీ బ‌లంగా ఉందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అసెంబ్లీలోకి అడుగుపెట్టాలంటే బీజేపీ, జ‌న‌సేన‌కు అనివార్యంగా టీడీపీతో పొత్తు అవ‌స‌రమ‌ని గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ దోబూచులాట ఆడుతూ ఎక్కువ స్థానాల‌ను పొంద‌డానికి టీడీపీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ఇప్పుడున్న‌ ప‌రిస్థితుల్లో ఒంట‌రిగా వెళ్లిన‌ప్ప‌టికీ టీడీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఏపీలోని తాజా స‌ర్వేల సారాంశం. అంతేకాదు, చంద్ర‌బాబు ఎక్క‌డ స‌భ‌లు పెట్టిన‌ప్ప‌టికీ తండోప‌తండాలుగా జ‌నం వ‌స్తున్నారు. ఇప్పుడున్న ప్ర‌భుత్వంపై జ‌నం క‌సిగా ఉన్నార‌న‌డానికి ఆయ‌న స‌భ‌ల్లోని ప్ర‌జాప్ర‌భంజ‌నం ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం.

తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ ఇస్తోంది. ఈ పరిణామం చంద్ర‌బాబుకు బాగా క‌లిసొచ్చేలా ఉంది. తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల్లో చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డానికి కేసీఆర్ కు ఈసారి అస్త్రాలు ఏమీ ఉండ‌వు. ఈ ప‌రిణామం తెలుగుదేశం పార్టీకి ఇరు రాష్ట్రాల్లో సానుకూల ఫ‌లితాల‌కు అవ‌కాశం ఉంది. వాస్త‌వంగా తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఏపీ కంటే తెలంగాణాలో బాగా ఉండేది. వెనుక‌బ‌డిన వ‌ర్గాల పార్టీగా గుర్తింపు ఉంది. ప‌టేల్‌, ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను కూల్చిన పార్టీగా బీసీలు టీడీపీని ఆదిరిస్తారు. కానీ, ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత చంద్ర‌బాబు పెద్ద‌గా తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో టీఆర్ఎస్ బ‌ల‌ప‌డింది. ఇప్పుడు ఆ పార్టీ క్లోజ్ అయింది. ఫ‌లితంగా తిరిగి టీడీపీ వైపు బీసీ లీడ‌ర్ల వ‌ల‌స భారీగా ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు.

ఒక వేళ `ఇగో`ల‌కు పోయి టీడీపీని వ‌దులుకుంటే బీజేపీకే ఇరు రాష్ట్రాల్లో న‌ష్టమ‌ని రాజ‌కీయానుభ‌వం పెద్ద‌గాలేని వాళ్లు కూడా చెప్ప‌గ‌ల‌రు. అందుకే, అమిత్ అండ్ టీమ్ ఇప్ప‌టికే ఒక క్లారిటీకి వ‌చ్చార‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబు మ‌ద్ధ‌తుతో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి స‌న్న‌ద్ధం అయ్యార‌ని వినికిడి. ఆ క్ర‌మంలోనే ఖ‌మ్మం జిల్లా నుంచి ఎన్నికల‌ శంఖారావాన్ని చంద్ర‌బాబు పూరించార‌ని స‌మాచారం. రాబోవు రోజుల్లో హైద‌రాబాద్ , రంగారెడ్డితో పాటు ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా చంద్ర‌బాబు స్పీడ్ పెంచ‌నున్నారు. అలాగే, నిజామాబాద్‌, ఆదిలాబాద్ లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల మీద దృష్టి పెట్ట‌నున్నారు. ఆయ‌న హ‌యాంలో చేసిన అభివృద్ధి ప‌నుల‌పై మాత్ర‌మే ఫోక‌స్ చేసి తిరిగి ఓట‌ర్ల‌ను రాబ‌ట్టాల‌ని ప్లాన్ చేశారు.

2014 ఎన్నిక‌ల  పొత్తు(Alliance)

ఏపీలోనూ 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌నిపించిన పొత్తు తిరిగి చూడ్డానికి అవ‌కాశం పుష్క‌లంగా ఉంది. ఆ దిశ‌గా ప‌వ‌న్ రెండో రోజుల క్రితం మాట్లాడారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు కూడా అదే ఫార్ములాను వినిపించారు. అయితే, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఆడుతోన్న గేమ్ కార‌ణంగా పొత్తుల‌కు ఇంకా స‌మ‌యం రాలేదు. ఒక వేళ చంద్ర‌బాబును వ‌దులుకుంటే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. ఏపీలో ఎలాగూ బీజేపీ, జ‌న‌సేన ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌దు. అందుకే, రెండు రాష్ట్రాల్లోని రాజ‌కీయాల దృష్ట్యా చంద్ర‌బాబుతో బీజేపీ జ‌త క‌ట్టే అవ‌కాశం ఉంది. అందుకు ఖ‌మ్మం స‌భ గ్రాండ్ స‌క్సెస్ కీల‌కం కానుంది.

చంద్ర‌బాబు స‌భ గ్రాండ్ స‌క్సెస్ (Grand Success)

ఖమ్మంలోని సర్దార్‌ పటేల్ స్టేడియంలో చంద్ర‌బాబు బహిరంగసభకు ఇసుకేస్తే రాల‌నంత జ‌నం హాజ‌ర‌య్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా చేసిన సన్నాహాలు అనూహ్యంగా విజ‌య‌వంతం అయ్యాయి. బైక్‌ర్యాలీ భారీగా నిర్వ‌హించ‌డం ద్వారా తెలుగుదేశం బ‌లంగా ఉంద‌న్న సంకేతం పంపారు. ప్రధాన వీధులతోపాటు ఇతర మండలాల్లో కూడా భారీగా హోర్డింగ్‌లు, తెలుగుదేశం జెండాలు, తోరణాలతో ప‌సుపు మ‌యంగా మారింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సభకు లక్షకు పైగా జ‌నం హాజ‌ర‌య్యారు.

దారిపొడ‌వునా జ‌ననీరాజ‌నం

చంద్రబాబు ఎల్‌బీనగర్‌, హయతనగర్‌, చౌటుప్పల్‌ మీదుగా ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం నాయకనగూడెం చేరుకున్నారు.ఉమ్మడి ఖమ్మంజిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కూసుమంచి మీదుగా కేశవాపురం చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం మయూరి సెంటర్‌కు నుంచి సర్దార్‌పటేల్‌ స్టేడియానికి భారీ ర్యాలీగా చంద్ర‌బాబు చేరుకున్నారు. స‌భ ముగిసిన త‌రువాత చింతకాని మండలం పాతర్లపాడులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి బోనకల్‌ మండలం మీదుగా విజయవాడ వెళ్లారు. గురువారం ఉద‌యం విజ‌య‌న‌గ‌రం జిల్లా `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి` ప్రోగ్రామ్ కు వెళ‌తారు. ఖ‌మ్మం స‌భ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో మునుప‌టి ఉత్సాహం టీడీపీ క్యాడ‌ర్ లో క‌నిపించింది. పొత్తుల‌కు కూడా ఒక క్లారిటీ త్వ‌ర‌లోనే రానుంద‌ని ఆ స‌భ నిరూపిస్తోంది.

Also Read : CBN ISB : ద‌టీజ్ చంద్ర‌బాబు విజ‌న్! నిస్వార్థ సేవ‌కు అరుదైన గౌర‌వం!