Site icon HashtagU Telugu

CBN Effect : రేవంత్ రెడ్డికి `గురు`గ్ర‌హ‌ణం! ఖ‌మ్మం స‌భ హిట్ తెచ్చిన తంటా!

AP-TS

Babu Revanth

`ఎంకి  పెళ్లి సుబ్బి చావుకు` వ‌చ్చిన‌ట్టు `చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ‌` సూపర్ హిట్ కావ‌డం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గ్రాఫ్ పై ప్ర‌భావం(CBN Effect) చూప‌నుంది. తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయ‌కునిగా ఎదిగారు. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపులేని రోజుల్లో తెలుగుదేశం పార్టీ వేదిక బాగా క‌లిసొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ప‌రిచ‌యాలు కూడా టీడీపీకి చెందిన‌వే. మిగిలిన పార్టీల వాళ్లు ఎప్పుడూ రేవంత్ రెడ్డిని రాజ‌కీయ శ‌త్రువుగానే చూసే వాళ్లు. పైగా ఆయ‌న తొలి నుంచి సీఎం ప‌దవి కోసం టార్గెట్ పెట్టుకుని పావులు క‌దిపారు. అందుకే, ఇత‌ర పార్టీలు ఏవీ ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత తెలుగుదేశం పార్టీ బ‌ల‌హీన ప‌డుతూ వ‌చ్చింది. తొలిసారిగా విడిపోయిన రాష్ట్రంలో జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో 19 మంది ఎమ్మెల్యేల‌ను బీజేపీ, టీడీపీ కూట‌మి గెలుచుకుంది. అసెంబ్లీలో ప్రాతినిథ్యం బ‌లంగా ఉండేది. కానీ, ఓటుకు నోటు కేసు పార్టీని మ‌రింత బ‌ల‌హీన‌ప‌రిచింది. గెలిచిన ఎమ్మెల్యేల‌ను కేసీఆర్ లాగేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వెళ్లిపోయారు. ఆయ‌న‌తో పాటు టీడీపీ లీడ‌ర్లు కొంద‌రు, క్యాడ‌ర్ వెళ్లింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్లు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు.

చంద్ర‌బాబు ఇచ్చిన దిశానిర్దేశంతో(CBN Effect)

ఖ‌మ్మం వేదిక‌పై నుంచి చంద్ర‌బాబు ఇచ్చిన దిశానిర్దేశంతో(CBN Effect) రేవంత్ రెడ్డితో వెళ్లిన క్యాడ‌ర్, లీడ‌ర్లు తిరిగి టీడీపీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇటీవ‌ల వేసిన పీసీసీ కార్య‌వ‌ర్గంలోనూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ‌ర్గీయులంటూ సీనియ‌ర్లు ర‌చ్చ చేశారు. దీంతో ఎమ్మెల్యే సీత‌క్క‌తో స‌హా 13 మంది రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. మిగిలిన వాళ్లు కూడా రాజీనామాల‌కు సిద్ద‌ప‌డుతున్నారు. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్ద దిగ్విజ‌య్ సింగ్ రంగంలోకి దిగారు. సీనియ‌ర్లు, రేవంత్ మ‌ధ్య జ‌రుగుతోన్న పోరును స‌రిచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితి లేదు. పైగా ఖ‌మ్మం టీడీపీ స‌భ‌లాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌చోట కూడా కాంగ్రెస్ పెట్ట‌లేదు.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కొడంగ‌ల్ కు చెందిన లీడ‌ర్ గా మాత్ర‌మే రేవంత్ రెడ్డికి గుర్తింపు ఉంది. అక్క‌డ 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌రువాత ల‌క్కీగా 2019 ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి లోక్ స‌భ‌కు పోటీ చేశారు. టీడీపీ ఓట్ల‌తో ఆనాడు ఆయ‌న బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ త‌రువాత జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో లోక్ స‌భ ప‌రిధిలోని కార్పొరేట‌ర్ల‌ను గెలిపించుకునే ప‌రిస్థితుల్లో రేవంత్ రెడ్డి లేరు. అంటే, టీడీపీ ఓట్లు మాత్రమే కొద్దోగొప్పో రేవంత్ రెడ్డికి ఉన్నాయ‌ని అర్థం అవుతోంది. ఒక వేళ బీజేపీ ,టీడీపీ పొత్తు కుదిరితే రేవంత్ రెడ్డి రాజ‌కీయంగా బాగా డ్యామేజ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఆ ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న వ‌ల‌న లాభం కంటే న‌ష్ట‌మే ఎక్క‌వ‌ని అంచ‌నా వేస్తున్నారు.

రేవంత్ తో వెళ్లిన పూర్వ‌పు లీడ‌ర్లు

తెలంగాణ వ్యాప్తంగా బ‌ల‌ప‌డుతోన్న టీడీపీ వైపు రేవంత్ తో వెళ్లిన పూర్వ‌పు లీడ‌ర్లు, క్యాడ‌ర్ స‌ర్దుకుంటున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీలోని క్యాడ‌ర్, లీడ‌ర్లు మెజార్టీ భాగం ఆయ‌న నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నం ఆయ‌న పీసీసీ చీఫ్ అయిన త‌రువాత జ‌రిగిన మునుగోడు, హుజూరాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాలే నిద‌ర్శ‌నం. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయ‌న చాలా చోట్ల ప్ర‌చారం చేశారు. సోష‌ల్ మీడియాలో క్రేజ్ మిన‌హా క్షేత్ర‌స్థాయిలో క‌లిసొచ్చిన సంద‌ర్భం లేదు. ఉప ఎన్నిక‌లు జ‌రిగిన నాగార్జున సాగ‌ర్, హుజూరున‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాలు, హైద‌రాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయ‌న క్రేజ్ కాంగ్రెస్ కు క‌ల‌సి రాలేదు. ఇదే విష‌యాన్ని ఆ పార్టీ సీనియ‌ర్లు అధిష్టానంకు ప‌లుమార్లు చెప్పారు.

రేవంత్ రెడ్డికి డ్రా బ్యాక్స్

తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ వ‌ల్ల రేవంత్ రెడ్డికి క్రేజ్ పెరిగింద‌ని సీనియ‌ర్ల వాద‌న‌. ఆయ‌న వ‌ల‌న కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని ఏఐసీసీకి ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ అయిన త‌రువాత ద‌ళిత‌,గిరిజ‌న దండోరా స‌భ‌లు పెట్ట‌డం ద్వారా వ్య‌క్తిగ‌త క్రేజ్ ను పెంచుకున్నార‌ని సీనియ‌ర్ల భావ‌న‌. ఉప ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటూ సభ‌లు పెట్ట‌డం ఏమిటి? అంటూ అప్ప‌ట్లోనే నిల‌దీశారు. సైకిల్ కాంగ్రెస్ గా మార్చేశార‌ని పదేప‌దే ఆరోపించారు. కొంద‌రు గాంధీభ‌వ‌న్ మెట్ల‌ను కూడా తొక్క‌మంటూ భీష్మించారు. ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో అక్క‌డ వ‌చ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి డిపాజిట్లు కూడా రాలేదు. ఇవ‌న్నీ రేవంత్ రెడ్డికి డ్రా బ్యాక్స్. వీటికి తోడు ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు టీడీపీని బ‌లోపేతం చేయ‌డానికి రంగంలోకి దిగ‌డంతో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లోనూ గ్రాఫ్ ప‌డిపోయే ప్రమాదం ఉంది.

Also Read : TTDP: టీడీపీ లోకి మాజీ మంత్రి కృష్ణ యాద‌వ్‌?