Allegations Against Kavitha: లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత (Allegations Against Kavitha) కుట్రదారుగా ఉన్నారని సీబీఐ ఆరోపించింది. భారీ కుట్రను వెలికి తీసేందుకు తమ కస్టడీలో ఆమెను విచారించాల్సి ఉందని తెలిపింది. తీహార్ జైలులో సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాస్తవాలను దాచి పెడుతున్నారని పేర్కొంది. డబ్బులు చేతులు మారడంలో ఆమెదే కీలక పాత్రని తెలిపింది. అందుకే తమకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది.
విజయ్ నాయర్, తదితరులతో కలిసి కవిత స్కెచ్ వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై ఢిల్లీ, హైదరాబాద్‌లలో సమావేశాలు జరిగాయని తెలిపారు. ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత భాగస్వామి అనేది ఇతర నిందితుల వాట్సప్ చాట్స్ లో స్పష్టమైందన్నారు. రూ. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి కవిత.. ఆప్ నేతలకు అందించారని ఆరోపించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 25 కోట్లు అందజేశారన్నారు.
Also Read: Blast Case : బెంగళూరు కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్!
ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిపారు. వాట్సాప్ చాట్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని అన్నారు. కోర్టుకు వాటిని అందజేశారు. ఢిల్లీ లిక్కర్ విధాన రూపకల్పనలో కీలక కుట్రదారు కవిత అని, రకరకాల కారణాలతో విచారణకు కవిత సహకరించలేదని చెప్పారు. ప్రశ్నించిన అంశాలకు కూడా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని, మేము సేకరించిన డాక్యుమెంట్లకి కవిత చెప్పిన సమాధానాలకి పొంతన లేదని, నోటీసు ఇచ్చిన విచారణకు హాజరు కాలేదని వివరించారు.
కల్వకుంట్ల కవితపై రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ వ్యాపారం కోసం నిందితుడు శరత్ చంద్ర రెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా జోన్‌కు రూ. 5 కోట్లు చొప్పున రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్టు తెలిపింది. దీనికి ఆయన విముఖత వ్యక్తం చేయడంతో బెదిరించారని పేర్కొంది. హైదరాబాద్‌లో ఆయన వ్యాపారాలు సాగనివ్వనని హెచ్చరించారని చెప్పింది.
We’re now on WhatsApp : Click to Join
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఆసక్తికర వీడియో బయటకు వచ్చింది. కేసు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఫైల్స్‌ను మూటలో కట్టి ఓ అధికారి కోర్టుకు తీసుకొచ్చారు. వాటిని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కాగా, కేసులో కవిత పాత్రను ధర్మాసనం ముందు సీబీఐ బలంగా వాదిస్తోంది.
